Byjus - విద్యార్థులు ట్యాబ్‌ల్లో సినిమాలు చూడడంపై మెమోలా...??
విద్యార్థులు ట్యాబ్‌ల్లో సినిమాలు చూడడంపై మెమోలు
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరులో పలువురు విద్యార్థులు ట్యాబ్‌లు ఇంటికి పట్టుకెళ్లి బైజూస్ కంటెంట్‌కు సంబంధం లేనివి చూశారని తరగతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులను అందుకు బాధ్యులుగా చేస్తూ మెమోలు ఇవ్వటంపై ఉపాధ్యాయవర్గం మండిపడుతోంది.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు(డీఈవో) ఇప్పటి వరకు పాఠశాలల పరిశీలనకు వెళ్లిన సమయంలో ఎవరైనా ట్యాబ్‌లు వినియోగించకపోయినా లేదా ట్యాబ్‌ల్లో పాటలు, సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నట్లు గుర్తిస్తే బాధ్యులైన విద్యార్థులు, ఉపాధ్యాయులను హెచ్చరించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించి వదిలేసేవారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మూడు జిల్లాల పరిధిలో పలువురు టీచర్లు, ప్రధానోపాధ్యాయులకు మెమోలు ఇచ్చి వివరణ కోరటం ఉపాధ్యాయుల్లోనే కాదు విద్యాశాఖవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. పలువురికి మెమోలు ఇచ్చినట్లు తెలుసుకుని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీనిలో తమ తప్పిదం ఏంటీ? పాఠశాల అనంతరం జరిగిన వాటికి తమను బాధ్యులుగా ఎలా చేస్తారు? అంటూ ఆవేదన చెందుతున్నారు. 8వ తరగతిని పర్యవేక్షించే క్లాస్ టీచర్, ప్రధానోపాధ్యాయులకు మెమోలు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం ఆదేశించిన మాట వాస్తవమేనని అధికారి ఒకరు తెలిపారు. హెచ్‌ఎంలను బాధ్యులను చేయటంపై ప్రధానోపాధ్యాయుల సంఘం తప్పుబట్టింది.
ఇళ్లకు వెళ్లి చూడగలమా?
సగటున ఒక్కో స్కూల్లో 50 నుంచి 200 మంది వరకు పిల్లలు ఉంటారు. వీరంతా ఇంటికి వెళ్లాక ఏం చేస్తున్నారని వారి ఇళ్లకు వెళ్లి చూడడం సాధ్యమయ్యే పనేనా? ఇంతగా తమను వేధించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిర్దేశిత పాఠశాల పనివేళల్లో ఏదైనా జరిగితే అందుకు తాము బాధ్యత వహిస్తాం. అందుకు విరుద్దంగా ఇంటికెళ్లాక పిల్లలు ట్యాబ్‌ల్లో ఏవేవో చూస్తున్నారని అందుకు తమల్ని బాధ్యులను చేయటం సరికాదు. ఇలా చేస్తే ఉపాధ్యాయుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అది చివరకు వృత్తిపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. 8వ తరగతి చదివే ప్రతి విద్యార్థి, వారికి బోధించే అందరూ ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. అందులో బైజూస్ సంస్థ 8వ తరగతి పాఠ్యాంశాలు మరికొన్ని వీడియోలు అప్లోడ్ చేసింది. వాటిని మినహా మరేవీ చూడకూడదని ఆదేశించింది. అయితే ట్యాబ్‌ల్లో అవి మినహా మిగిలిన ఏ ఇతర సమాచారం లభ్యం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ పని చేయకుండా టీచర్లను బాధ్యులను చేయటం సరైన విధానం కాదు వెంటనే ఇచ్చిన మెమోలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. కొందరు విద్యార్థులు ట్యాబ్‌ల్లో వారికి చెందిన మెమరీ కార్డులు వేస్తున్నారు. దీంతో వాటిల్లో ఏం కావాలంటే అవి లభ్యమవుతున్నాయని అసలు మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ లేకుండా చేస్తే విద్యార్థులు వాటి జోలికి వెళ్లరు కదా? అని హెచ్‌ఎం ఒకరు ప్రశ్నించారు. ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో చేయాల్సిన పనులు. అవేం చేయకుండా ఉపాధ్యాయులే అన్నింటికి బాధ్యులనేలా ఉన్నతాధికారుల తీరు ఉందని ఆవేదన చెందారు. ట్యాబ్‌ల్లో ఏం చూస్తున్నారో విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. అందులో భాగంగానే కొందరు విద్యార్థులు ఇంటికెళ్లాక వారు చూడకూడనవి చూశారని అలర్ట్‌మెస్సేజ్ రావటం వల్లే ఇది వెలుగులోకి వచ్చిందని విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.
విద్యాశాఖదే బాధ్యత
ట్యాబ్‌ల పంపిణీ సమయంలో బైజూస్ కంటెంట్ తప్ప ఏ ఇతర సమాచారం వాటిల్లో లభ్యం కాదు. అందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. తీరా ఇప్పుడేమో విద్యార్థులు వాటిల్లో సినిమాలు చూస్తున్నారు, పాటలు వింటున్నారని గుర్తించాం. అందుకు మీరే బాధ్యులని టీచర్లకు మెమోలు ఇవ్వటం దుర్మార్గం. పాఠ్యాంశాలు తప్ప ఏవీ రాకుండా కట్టడి చేయాల్సిన యంత్రాంగం ఆ చర్యలేమీ తీసుకోకుండా ఉపాధ్యాయులపై పడితే ఏం ప్రయోజనం? మెమోలివ్వటం అంటే ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయటమే. ఇచ్చిన మెమోలను ఉపసంహరించుకుని ఉపాధ్యాయులకు భరోసా కల్పించాలి. - బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్
0 Comments:
Post a Comment