వసంతకాలంలోనే ఎండాకాలం వేడి ఎలా ఉండబోతుందో తెలిసి వస్తుంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో వేడివేడిగా ఏది తినాలనిపించదు. ఈ సమయంలో చల్లని పానీయాలు, ద్రవరూపంలో పదార్థాలు తీసుకోవడం మేలు. ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం చాలా మంచిది.
అది మీ కడుపును, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మీరు లంచ్ లేదా డిన్నర్ సమయంలో అన్నంలో కలుపుకొని తినడానికి మజ్జిగ రసం రెసిపీని ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
మజ్జిగ రసం మీరు సాధారణంగా తినే మజ్జిగ చారు, రసం కంటే భిన్నమైనది. కందిపప్పు లేదా పెసరిపప్పులో పెరుగు కలిపి దీనిని తయారు చేస్తారు. ఇందులో కొన్ని సుగంధ దినుసులు, టొమాటోలు కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. దీనిని మీరు నేరుగా తాగవచ్చు. మజ్జిగ రసం సులభంగా ఎలా చేయాలో ఇక్కడ సూచనలు చదివి తెలుసుకోండి.
Buttermilk Rasam Recipe కోసం కావలసినవి
1 కప్పు పుల్లని మజ్జిగ
1/4 కప్పు కందిపప్పు
1/4 కప్పు తరిగిన టమోటాలు
1½ టేబుల్ స్పూన్ రసం మసాలా
1 స్పూన్ నెయ్యి
1 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
1 నుంచి 2 ఎండు మిరపకాయలు
6 నుండి 7 కరివేపాకులు
తాజా కొత్తిమీర
రుచికి తగినంత ఉప్పు
మజ్జిగ రసం తయారు చేసే విధానం
ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్‌లో వేయండి, అందులో టమోటా ముక్కలు వేసి, సరిపడా నీళ్లుపోసి, కొద్దిగా ఉప్పుకూడా వేసి బాగా కలిపి మూత పెట్టండి. సుమారు 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఆవిరి మీద ఉడికించుకోండి.
పప్పు ఉడికిన తర్వాత మూత తీసి అందులో మిరియాలు, ఇతర సుగంధాలతో చేసిన రసం పౌడర్ వేసి కలపండి, అవసరం అనుకుంటే మరికొన్ని నీళ్లుపోసి 2-3 నిమిషాలు చిన్న మంటపై ఉడికించండి.
ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి పోపు వేయించండి.
ఈ పోపును పప్పులో వేసి బాగా కలపండి. ఇప్పుడు పెరుగులో నీళ్లు కలిపి మజ్జిగ చేయండి.
మజ్జిగను పలుచటి పప్పులో వేసి బాగా కలిపేయండి.
అంతే, మజ్జిగ రసం రెడీ. అన్నంలో కలుపుకొని తింటూ ఆనందించండి.
0 Comments:
Post a Comment