Blue Zone Diet ప్రపంచమంతా అనారోగ్యం ప్రబలుతుంటే.. అక్కడ మాత్రం జలుబు, దగ్గులు సైతం నమోదు కావు. అరవై డబ్భు ఏండ్లు బతకడమే గగనమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో సునాయాసంగా సెంచరీ కొడతారు.
దీనికి కారణం ఏమిటి? ఆ ప్రజల ఆయురారోగ్యాల రహస్యం ఏమిటి? అనే కోణంలో అనేక అధ్యయనాలు జరిగాయి.
Blue Zone Diet | తగినన్ని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధమైన ఆహారం ఆరోగ్యకరమైన జీవితానికి, పరిపూర్ణ ఆయువుకు హామీ ఇస్తాయి. శతాధికులు అత్యధికంగా జీవించే ప్రాంతాలను నిపుణులు 'బ్లూజోన్’గా వ్యవహరిస్తారు. అక్కడి ఆహార విధానాన్ని 'బ్లూ జోన్ డైట్’గా పేర్కొంటారు. వారి ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకుంటే.. శతమానం చిరునామా దొరికినట్టే.
ప్రపంచమంతా అనారోగ్యం ప్రబలుతుంటే.. అక్కడ మాత్రం జలుబు, దగ్గులు సైతం నమోదు కావు. అరవై డబ్భు ఏండ్లు బతకడమే గగనమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో సునాయాసంగా సెంచరీ కొడతారు. దీనికి కారణం ఏమిటి? ఆ ప్రజల ఆయురారోగ్యాల రహస్యం ఏమిటి? అనే కోణంలో అనేక అధ్యయనాలు జరిగాయి. భూగోళం మొత్తానికి అత్యధిక ఆయువు కలిగిన ప్రజలు నివసించే.. జపాన్‌లోని ఒకినావా, గ్రీస్‌లోని ఐకారియా, కోస్టారికాలోని నికోయా పెనిన్సులా, ఇటలీలోని సార్డీనియా, అమెరికాలోని లోమా లిండా ప్రాంతాలు బ్లూ జోన్ పరిధిలోకే వస్తాయి.
బ్లూ జోన్ ప్రజల ఆహారంలో శనగలు, పల్లీలు, బ్లాక్ బీన్స్, సోయా బీన్స్ లాంటి లెగ్యూమ్ జాతి కాయధాన్యాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌తో సమృద్ధం. వీటికి దీర్ఘాయువునిచ్చే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది.
ఓట్స్, సిరిధాన్యాలు, బార్లీ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ధాన్యాలు తీసుకుంటారు. వీటిని తింటే క్యాన్సర్, గుండె రోగాలు, డెమెన్షియా తదితర జబ్బుల ముప్పు తగ్గిపోతుంది. గ్రీస్ దేశంలోని ఐకారియా ప్రజల్లో క్యాన్సర్, గుండె రోగాలు, డెమెన్షియా రేట్లు చాలా తక్కువ. కారణం.. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, ఆలుగడ్డలు లాంటి మధ్యధరా ప్రాంత ఆహారంపై ఎక్కువగా ఆధారపడటమే.
ఆకుకూరలు కూడా అమృతతుల్యమే. వీటిలో పోషకాలు ఎక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాలకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పండ్లు.. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ గనులు. ఫలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె కవాటాల వ్యాధుల ముప్పు తగ్గుతుంది. తాజా పండ్లు అధికంగా తీసుకుంటున్న కారణంగానే చైనా వయోధికుల్లో గుండె రోగాలు అతి తక్కువగా నమోదు అవుతున్నాయి.
ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్, శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ నూనె శరీరంలో వాపులు, దీర్ఘకాలిక వ్యాధులపై పోరాడుతుందని పరిశోధనల్లో తెలిసింది.
బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలు.. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌కు వనరులు. వీటిని ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి రోగాల ముప్పు తగ్గిపోతుంది కూడా.
బ్లూ జోన్ ప్రజలు 80 శాతం పొట్ట నిండగానే తినడం ఆపేస్తారు. అలా బరువు నియంత్రణలో ఉంటుంది. పరిమితంగా వైన్ సేవిస్తారు. సాయంత్రం అల్పాహారం తీసుకుంటారు.
తమ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకుంటారు. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. సామాజిక జీవనానికి ప్రాధాన్యం ఇస్తారు. నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఒత్తిడిని ఆమడదూరంలో ఉంచుతారు. వందేండ్ల నిండు జీవితం గడుపుతారు.
0 Comments:
Post a Comment