ఢిల్లీ : భారత్-పాకిస్తాన్, భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతలపై యూఎస్ నిఘా విభాగం చట్టసభ సభ్యులకు తాజాగా ఓ నివేదిక ఇచ్చింది.
ఇందులో సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపులకు సమాధానంగా భారత్ లోని మోడీ సర్కార్ ఆ దేశంపై సైనిక చర్యకు దిగే అవకాశమున్నట్లు అంచనా వేస్తోంది.
ప్రతీ ఏటా అమెరికా భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై నిఘా విభాగం చట్టసభలకు వార్షిక నివేదిక ఇస్తుంటుంది. ఇందులో ఈసారి పాకిస్తాన్ కవ్వింపులకు భారత్ సైనిక చర్యతో సమాధానం చెప్పే అవకాశమున్నట్లు తెలిపింది.
అలాగే భారత్- చైనా ద్వైపాక్షిక సరిహద్దు చర్చలలో నిమగ్నమై, సరిహద్దు పాయింట్లను పరిష్కరించుకున్నప్పటికీ 2020లో గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇది గత కొన్ని దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన అంశంగా తెలిపింది.
వివాదాస్పద సరిహద్దులో భారత్-చైనా సైనిక మోహరింపులు రెండు అణు శక్తుల మధ్య సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇవి సహజంగానే యూఎస్ లో ఉన్న వ్యక్తులు, ప్రయోజనాలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని అంచనా వేసింది.
మే 2020లో భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్ లో సైనిక ప్రతిష్టంభన జరిగినప్పటి నుండి ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పెరుగుతున్న ముప్పుతో పాటు భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు కూడా ఆందోళన కలిగిస్తున్నట్లు యూఎస్ రిపోర్ట్ తెలిపింది.
పాకిస్తాన్ తీవ్రవాదానికి ఇస్తున్న మద్దతు నేపథ్యంలో.. మోడీ నాయకత్వంలో భారత్ ఆ దేశ కవ్వింపులకు తగిన జవాబు చెప్పే అవకాశమున్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. కాశ్మీర్‌లో దాడులు, దేశంలో ఉగ్రవాద చర్యల అవకాశాలు ఈ ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది.
0 Comments:
Post a Comment