ఏపీ కేబినెట్లో మళ్లీ మార్పులు ? ఉద్వాసన వీరికే ! కొత్తగా ముగ్గురికి ఛాన్స్..!
ఏపీలో మరోసారి కేబినెట్ ప్రక్షాళన తప్పేలా లేదు. ప్రస్తుత కేబినెట్ మంత్రులపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సంకేతాలు వచ్చాయి.
మంత్రులు పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని నేరుగానే సీఎం జగన్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు చర్చ జరుగుతోంది. అలాగే కొత్తగా మంత్రులయ్యే వారి పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
మళ్లీ జగన్ కేబినెట్ ప్రక్షాళన ?
ఏపీలో సీఎం జగన్ తన మంత్రివర్గంలో మరోసారి మార్పులకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితులు, అలాగే మంత్రుల పనితీరు వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ మంత్రులతో చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. దీంతో కేబినెట్ ప్రక్షాళనపై చర్చ మరింత ముదిరింది.
కేబినెట్లో జగన్ సంకేతాలు ?
ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుల్ని ఆమోదించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులతో పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు తప్పకుండా గెలవాలని వారికి టార్గెట్ ఇచ్చారు. ఇందులో విఫలమైతే మంత్రులపై వేటు వడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరెవరికి ఉద్వాసన ?
ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారిలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం మొదలైంది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే మంత్రుల జాబితా ఎక్కువే కనిపిస్తోంది. ఇందులో ఎంతమందిని తప్పిస్తారో ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పేర్లలో మాత్రం సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం వంటి వారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ?
జగన్ ఒక వేళ కేబినెట్ విస్తరణ చేపడితే ఎంతమందిని తప్పించవచ్చన్న దానిపై నిర్ధారణ కాకపోయినా, కనీసం ముగ్గురిని తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి స్దానంలో మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో తాజాగా ఎమ్మెల్సీలు అయిన కవురు శ్రీనివాస్, మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో మర్రి రాజశేఖర్ కు జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మిగతా ఇద్దరిని సామాజిక సమీకరణాలతో కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది.
0 Comments:
Post a Comment