ఇళ్ల నుంచి చెత్త సేకరణపై ప్రతి నెలా రుసుములు చెల్లించడానికే ప్రజలు ఇబ్బంది పడుతుంటే..ఇప్పుడు ఆస్తి పన్నుతో కలిపి ఆరునెలలకు ఒకేసారి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించడంతో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నూతన విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తి పన్నుకు వినియోగ రుసుములను అనుసంధానించే ప్రక్రియ వార్డు సచివాలయాల్లో ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2021 అక్టోబరు 2న ప్రారంభించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా 42 పుర, నగరపాలక సంస్థల పరిధిలో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థల నుంచి రోజూ చెత్త సేకరిస్తున్నారు. దశల వారీగా 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ అమలు చేయాలన్నది ప్రణాళిక. చెత్త సేకరిస్తున్న పట్టణాల్లో ఇళ్ల నుంచి నెలకు కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.150, దుకాణాలు, భారీ వ్యాపారసంస్థల నుంచి రూ.150 నుంచి రూ.15 వేలు వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. రుసుముల వసూళ్లపై ప్రజల్లో మొదటి నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కేంద్రమైన కడపలో అధికార పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు మేయర్, కార్పొరేటర్లు రుసుముల వసూళ్లు నిలిపి వేయాల్సిందేనని నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురం నగరపాలక సంస్థల్లోనూ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రుసుముల వసూళ్ల కోసం సిబ్బంది నానా హైరానా పడుతున్నారు.
* 42 పుర, నగరపాలక సంస్థల్లోని ఆస్తి పన్ను అసెస్‌మెంట్లుకు వినియోగ రుసుములు అనుసంధానించి డిమాండ్ నోటీసులు ఇకపై ఆన్‌లైన్‌లో పెడతారు. సంబంధిత ఇంటి యజమాని పేరుతో అసెస్‌మెంట్లు ఉంటున్నందున వారే ఇక చెల్లించాలి. అద్దెకి ఉంటున్న వారి నుంచి ఇళ్ల యజమానులు రుసుములు ప్రతి నెలా వసూలు చేస్తారా? ఆర్నెల్లకోసారి తీసుకుంటారా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం.
* రహదారులకు ఇరు వైపులా తోపుడుబళ్లపై వ్యాపారాలు చేసే వారి నుంచి ప్రతి నెలా యథావిధిగా రుసుములు వసూలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఆటోలు టిప్పర్లకు చెల్లించాలని ఒత్తిడి
చెత్త సేకరించేందుకు వినియోగిస్తున్న 2,525 హైడ్రాలిక్ గార్బేజ్ టిప్పర్లు, మరో 1,264 ఈ-ఆటోల వినియోగం, నిర్వహణకు ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రతి నెలా విధిగా నిర్దేశించిన మొత్తాలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం పుర, నగరపాలక సంస్థలపై ఒత్తిడి పెడుతోంది. ఉదాహరణకు ఒక్కో ఆటోకు నెలకు రూ.23,500 చొప్పున చెల్లించాలి. వీటిని బిల్డ్, ఓన్, ఆపరేట్ (బీవోవో) విధానంలో ప్రైవేట్ ఏజెన్సీల నుంచి స్వచ్ఛాంధ్ర సంస్థ సేకరించి పట్టణ స్థానిక సంస్థలకు పంపింది. రుసుములు సరిగా వసూలు కానందున ప్రైవేట్ ఏజెన్సీలకు దాదాపు రూ.126 కోట్లు బకాయిపడ్డారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం...ఆస్తి పన్నుతోపాటు రుసుములు కూడా ప్రజల నుంచి పుర, నగరపాలక సంస్థలు వసూలు చేసి మొదట పాత బకాయిలు చెల్లించాలి. తరువాత నుంచి ప్రతి నెలా విధిగా ఓఅండ్‌ఎం ఛార్జీలు జమ చేయాలి.
0 Comments:
Post a Comment