ప్రపంచంలో కొన్ని ప్రసిద్ధ కట్టడాలను చాలా మంది సులభంగా గుర్తుపట్టేస్తారు. వాటిలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఒపెరా హౌస్ తప్పకుండా ఉంటాయి.
ఈ నిర్మాణాల వెనుక జరిగిన విశేషాలేంటో చదివేయండి.
అమెరికా(America) మొట్టమొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ 1792లో అధ్యక్ష భవనం నిర్మించాలని సంకల్పించాడు. అప్పటికి వాషింగ్టన్ డీసీ ఇంకా అభివృద్ధి చెందలేదు. అధ్యక్ష భవన నిర్మాణం కోసం డిజైన్లు పంపించాల్సిందిగా ఆయన పోటీ నిర్వహించాడు.
దాంతో పలువురు నిపుణులైన వాస్తు శిల్పులు, ఔత్సాహికులు తాము రూపొందించిన డిజైన్లు పంపించారు. వాటిలో అమెరికా చరిత్ర ప్రతిబింబించేలా.. సంస్కృతి కనిపించేలా అనేక డిజైన్లున్నాయి.
అంతిమంగా ఐర్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబన్ రూపొందించిన డిజైన్‌ను ఎంపిక చేశారు. అతడు దాన్ని డబ్లిన్‌లోని లెన్ట్సర్ హౌస్‌ను స్ఫూర్తిగా తీసుకొని గీశాడు. అయితే ఇప్పుడున్న వైట్‌హౌస్(White house) పూర్తిగా తొలి డిజైన్ కాదు.
అనేక మంది అధ్యక్షులు అందులో నివాసం ఉంటూ కొన్ని కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు. జేమ్స్ మన్రో కాలంలో సౌత్ పోర్టికో నిర్మించారు. ఆండ్రూ జాక్సన్ పరిపాలనలో నార్త్ పోర్టికో నిర్మించారు. 1901లో అమెరికా(America) అధ్యక్షుడిగా పనిచేసిన థియోడర్ రూజ్‌వెల్డ్ అధికారికంగా ఈ నివాసానికి 'వైట్ హౌస్' పేరు పెట్టాడు.
దాంతో ఆ పేరు మంచి ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు ఆ వైట్ హౌస్‌లో ఎన్నోసార్లు మార్పులు జరిగాయి కానీ పేరు మాత్రం మారలేదు.
అమెరికా పేరు వినగానే ప్రపంచానికి గుర్తుకొచ్చే 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'(Statue of liberty)ని ఫ్రెడ్రిక్ బర్థోల్డీ డిజైన్ చేశారు. ఈ నిర్మాణంలో స్వేచ్ఛను ప్రసాదించే రోమన్ దేవత లిబర్టాస్ ఉంటుంది. 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' నిర్మాణం వెనుకున్న విషయాలపై కొందరు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
అదేంటంటే.. ఈజిప్టు(Ezypt) సామాజికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో సూయజ్ కెనాల్ పాత్ర ఎంతో ఉంది. దాంతో ఆ కాలువ సమీపంలో లాంతరు పట్టుకున్న ఒక ముస్లిం మహిళ శిల్పాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. 'ఈజిప్ట్ బ్రింగింగ్ లైట్ టు ఏసియా' అంటూ క్యాప్షన్ కూడా సిద్ధం చేశారు.
కానీ ఈజిప్ట్ అధికారులు వేగంగా స్పందించకపోవడంతో ఆ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. దాంతో ఫ్రెడ్రిక్ అదే నిర్మాణానికి కొన్ని మార్పులు చేసి 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'ని తీర్చిదిద్దారు.
ఆస్ట్రేలియా(Austalia) పేరు చెప్పగానే సిడ్నీ నగరం గుర్తొస్తుంది. ఆ సిడ్నీ నగరానికి తలమానికంగా నిలుస్తోంది 'ఒపెరా హౌస్'. తెరచాపలు, గవ్వల్లా కనిపించే ఈ నిర్మాణాన్ని జోర్న్ అట్జోన్స్ రూపొందించారు.
ఈ నిర్మాణం ఎంపికలో 200 మంది పోటీపడ్డారు. చివరికి.. రెండో స్థానంలో నిలిచిన ప్రస్తుత ఒపెరా హౌస్‌ను ఎంపిక చేశారు. ఫిలడెల్ఫియా కొలాబ్రేటివ్ గ్రూప్‌లోని ఏడుగురు ఆర్కిటెక్ట్స్ కలిసి దీనిని డిజైన్‌ను తీర్చిదిద్దారు.
అట్జోన్స్ సహా వారంతా కలిసి సముద్ర తీరంలోని నత్తగుల్లలను చూసి స్ఫూర్తి పొందారు. సముద్రం పక్కనే ఆ జీవి తరహా నిర్మాణం ఉంటే బాగుంటుందని భావించారు.
ఆ ఆలోచనల మూలంగా అందమైన ఒపెరా హౌస్ రూపుదిద్దుకుంది. ఎత్తయిన కిటికీలు, మడతలు వేసిన కాంక్రీటు నిర్మాణాలు ఇప్పటికీ సందర్శకులను అబ్బురపరుస్తుంటాయి.
0 Comments:
Post a Comment