ఏప్రిల్ 1 నుండి కొత్త టోల్ బాదుడు; టోల్ ఛార్జీలు ఎంతగా పెరుగుతాయంటే!!
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ టాక్స్ పెంచేందుకు నిర్ణయం తీసుకోగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జాతీయ రహదారులు మరియు ఎక్స్ ప్రెస్ హైవేలపై ప్రయాణం మరింత భారం కానుంది.
దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజా ల వద్ద ఐదు శాతం నుండి పది శాతం వరకు టోల్ టాక్స్ ను పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇక ఈ నిర్ణయంతో వాహనదారులకు టోల్ ట్యాక్స్ షాక్ తగలనుంది.
జాతీయ రహదారుల రుసుముకు సంబంధించిన రూల్స్ 2008 ప్రకారం సవరించిన టోల్ రేట్లు ప్రతిపాదన మార్చి 25వ తేదీ నాటికి కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖల ఆమోదానికి పంపబడింది. ఇది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. దీని ప్రకారం కార్లు మరియు తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇక 2022లో టోల్ పన్ను పరిధిని 10% నుంచి 15% మధ్య పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త పన్ను బాదుడు తగ్గించినట్టు తెలుస్తుంది. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల టారిఫ్ ధరలను 10 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోను టోల్ రుసుములను సమీక్షించి తదనుగుణంగా పెంపు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని ధరల బాదుడుతో ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి ప్రజలు టోల్ చార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడనున్నారు. ఇక తాజాగా టోల్ చార్జీలను పెంచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 58 టోల్ ప్లాజా లలో పెరిగిన ఫీజులు అందుబాటులోకి రానున్నాయి.
0 Comments:
Post a Comment