ఈ నెల 16న ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ ? ఆ కీలక హామీపై అసెంబ్లీలో ప్రకటన !
ఏపీ లో ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక, ఆర్ధికేతర హామీలు నెరవెర్చే విషయంలో జరుగుతున్న జాప్యం వారిలో ఆగ్రహం పెంచుతోంది. ఈ ప్రభావం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కనిపించింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల నాటికి ఉద్యోగుల్ని పూర్తిగా తమవైపు తిప్పుకునే లక్ష్యంతో ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకోసం వారికి గతంలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సీపీఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఉద్యోగుల సీపీఎస్ రద్దు
ఏపీలో ఉద్యోగుల పెన్షన్ ను సీపీఎస్ విధానంలోకి మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరించి తిరిగి వారికి పాత పద్ధతిలోకి మారుస్తామని గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. తమకు అధికారమిస్తే వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసేస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చినా మూడేళ్ల తర్వాత కూడా దాని ఊసెత్తకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం.. సీపీఎస్ రద్దు అమలు చేయలేమని, గతంలో తెలియక దీనిపై హామీ ఇచ్చామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు భగ్గుమన్నారు. వారి ఆగ్రహం గమనించిన ప్రభుత్వం జీపీఎస్ రూపంలో మరో ప్రత్యామ్నాయం తెచ్చేందుకు ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. చివరికి సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టాయి.
16న తేల్చేయబోతున్న ప్రభుత్వం
ఉద్యోగులకు గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీపై ప్రభుత్వం ఈ నెల 16న తుది దఫా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. అదే రోజు ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై కీలక నిర్ణయం ప్రకటిస్తామని ఇప్పటికే వెల్లడించింది. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే దాంతో ప్రభావితం అవుతున్న ఉద్యోగుల్లో ఆందోళన తగ్గుతుంది. ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తగ్గుతుంది. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం ప్రారంభించిన నేపథ్యంలో ఉద్యోగులు పూర్తిగా ఉద్యమంవైపు మళ్లకుండా ఉండాలంటే ఓ ప్రకటన చేయక తప్పదు. దీంతో ఈనెల 16న ఆ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది.
జగన్ అసెంబ్లీలో ప్రకటించే అవకాశం
ఉద్యోగులతో చర్చల కోసం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ.. ఉద్యోగ సంఘాలతో సీపీఎస్ రద్దుపై ఈ నెల 16న తుది చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇందులో కుదిరే అవగాహన మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో దీనిపై అదే రోజు లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 16న జరిగే సీపీఎస్ చర్చలు కీలకంగా మారాయి. ఇందులో ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య పెన్షన్ పథకంపై ఓ అవగాహన కుదురుతుందనే లీకులు వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సీపీఎస్ రద్దు దిశగా అడుగులేస్తున్నాయి. అటు కేంద్రం కూడా ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ నెల 16న వైఎస్ జగన్ సీపీఎస్ పై ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment