అమెరికా వెళ్లాలని కలలు కనేవాళ్లు ప్రపంచం నలుమూలలా కనిపిస్తారు. ఆ క్రమంలో ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణాలు చేసేవారి కథలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.
అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే వారు జైళ్లలో మగ్గుతున్న ఉదంతాలు ప్రతి రోజూ కనిపిస్తూనే ఉంటాయి.
అయితే అదే అమెరికా నుంచి ప్రాణాలకు తెగించి మరీ సరిహద్దులోని మెక్సికో నగరాలకు వెళ్లే అమెరికా పౌరులు కూడా లక్షల్లో ఉన్నారు. అమెరికాలో వైద్య ఖర్చులను భరించలేక.. చౌక చికిత్స కోసం సరిహద్దులు దాటి వెళుతుంటారు. కానీ అలా వెళ్లటం చాలా ప్రమాదకరంగా మారుతుంటుంది.
గత వారాంతంలో నలుగురు అమెరికన్లు కాస్మెటిక్ సర్జరీ కోసం అమెరికా సరిహద్దుకు ఆనుకుని ఉన్న మెక్సికో పట్టణం మాటామోరోస్‌కి కారులో వెళ్లారు. అలా వెళ్లిన నలుగురూ కిడ్నాప్‌కు గురయ్యారు. వారిలో ఇద్దరు చనిపోయారు. మిగతా ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
Reuters
మెక్సికోలోని మాటామోరోస్ వంటి సరిహద్దు పట్టణాలు అత్యంత ప్రమాదకరమైనవి. టామౌలిపాస్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు డ్రగ్ కార్టెల్స్ (మాదకద్రవ్యాల ముఠాలు) గుప్పిట్లో ఉంటాయి. స్థానిక పోలీసుల కన్నా ఈ డ్రగ్ ముఠాలే చాలా బలంగా ఉంటాయి.
అయితే ఈ పట్టణాల్లో వైద్యం చేయించుకోవటం కోసం లక్షలాది మంది అమెరికన్లు సరిహద్దు దాటి వస్తూ ఉంటారు. అమెరికాలో వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవటం వల్ల వారు ఈ దారి ఎంచుకుంటున్నారు.
ఇలా వైద్యం కోసం వచ్చే పర్యాటకులు.. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రమాదాల గురించి అవగాహన ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మెక్సికోలో తమ వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవటం అలాంటి జాగ్రత్తల్లో ఒకటి.
అలా చేయటం ద్వారా వీరు తమ కారులో ప్రయాణిస్తూ సరిహద్దు దాటి మెక్సికోలో ప్రవేశించగానే కారు లైసెన్స్ ప్లేటును మార్చుకుంటారు. అమెరికా లైసెన్స్ ప్లేటు స్థానంలో మెక్సికో లైసెన్స్ ప్లేటు పెట్టుకుంటారు.
దీనివల్ల దుండగులు వీరి కార్లను లక్ష్యంగా చేసుకోవటం తగ్గుతుంది. అలాగే ప్రమాదకరమైన పట్టణాల్లో కాలినడకన తిరగాల్సిన పరిస్థితి కూడా ఉండదు.
BBC
మెక్సికోలో ధరలు తక్కువగా ఉండటం, సరిహద్దుకు చాలా సమీపంగా ఉండటం వల్ల చాలా మంది అమెరికన్లు వైద్యం కోసం ఎక్కువగా వెళ్లే దేశాల జాబితాలో మెక్సికో కూడా ఉంది.
''ఇదంతా ఆర్థికశాస్త్రం. మెక్సికోలో వైద్యం, సేవలు, ఔషధాలు చాలా చౌక. ముఖ్యంగా దంత చికిత్సలు. పళ్లు శుభ్రం చేయించుకోవటం కానీ, డెంటల్ ఇంప్లాంట్ అమర్చుకోవటం కానీ.. అమెరికాలో అయ్యే ఖర్చులో ఒక్క రవ్వ ఖర్చుతో మెక్సికోలో చేయించుకోవచ్చు'' అని వలస అధ్యయనాల నిపుణుడు నెస్టార్ రోడ్రిగ్ చెప్పారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మెక్సికోలో సర్జికల్ ప్రొసీజర్స్ వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ మెక్సికోలో వైద్యం నాణ్యత కూడా సాధారణంగా అమెరికాలో దొరికే వైద్యంతో సమానంగా ఉంటుందని ప్రొఫెసర్ రోడ్రిగ్ పేర్కొన్నారు.
మెక్సికన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ టూరిజం ఇండస్ట్రీ గణాంకాల ప్రకారం.. ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది అమెరికన్లు వైద్య సేవల కోసం మెక్సికోకు వస్తుంటారు.
మెక్సికోలో జన్మించిన అమెరికా పౌరురాలు టేడ్ రామిరెజ్ (58) దశాబ్ద కాలానికి పైగా సరిహద్దు దాటి మెక్సికో వెళ్లి వస్తూ ఉన్నారు. శాన్ ఆంటోనియోలో నివసించే ఆమె హైపర్‌థైరాయిడిజం చికిత్స కోసం తన ఇంటి నుంచి రెండున్నర గంటలు ప్రయాణించి.. ఈగిల్ పాస్-పీడ్రాస్ గెగ్రాస్ బోర్డర్ క్రాసింగ్ వద్దకు వెళుతుంటారు.
ఆమెకు తను పని చేసే కంపెనీ అందిస్తున్న ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. అమెరికాలో చికిత్స చేసుకుంటే బీమా కవరేజీ పోగా చెల్లించాల్సిన అదనపు చెల్లింపులు చాలా ఖరీదవుతున్నాయని, దానికన్నా చాలా తక్కువ ఖర్చుతో మెక్సికోలో వైద్యం చేయించుకుంటున్నానని చెప్తున్నారు.
సాధారణంగా ఈ ప్రయాణం కోసం ఒక రోజు మొత్తం కేటాయిస్తానని, ఇప్పటివరకూ ఈ ప్రయాణాల్లో ఎలాంటి సమస్యనూ ఎదుర్కోలేదని రామిరెజ్ బీబీసీతో చెప్పారు.
అయినాసరే భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఆమె రాత్రివేళ సరిహద్దు దాటరు. ఇంటి నుంచి బయలుదేరితే నేరుగా తను చికిత్స చేయించుకునే చోటుకు వెళతారు. చికిత్స పూర్తయ్యాక నేరుగా అమెరికా తిరిగి వస్తారు.
''నేను ఎన్నడూ ఒంటరిగా వెళ్లను. ఎల్లప్పుడూ నా సోదరిని కానీ, నా కొడుకును కానీ వెంట తీసుకు వెళతాను'' అని తెలిపారామె.
మెక్సికోలోని చాలా సరిహద్దు పట్టణాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో వైద్య పర్యాటక రంగం ఒకటిగా ఉంది.
టామౌలిపాస్ రాష్ట్రంలోని న్యూవో లారెడో పట్టణంలో రెండు ప్రధాన కారిడార్లలో పదుల సంఖ్యలో డెంటిస్ట్రీ కార్యాలయాలు వరుసగా ఉన్నాయి. వాటితో పాటు.. వైద్యం కోసం వచ్చే ప్రయాణికుల కోసం హోటళ్లు కూడా బారులు తీరి కనిపిస్తాయి.
సాన్ డియాగో నుంచి సరిహద్దు దాటి మూడు నిమిషాలు ప్రయాణిస్తే తిజువానా పట్టణం వస్తుంది. బాజా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఈ పట్టణంలో ఒక 33 అంతస్తుల ఆస్పత్రి సదుపాయాల భవనాన్ని గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించారు.
దాని పేరు 'న్యూ సిటీ మెడికల్ ప్లాజా'. ఇది 'ప్రపంచంలో అత్యుత్తమ మెడికల్ టూరిజం ఫెసిలిటీ' అని నిర్వాహకులు ప్రకటించారు. ఇక్కడ కాస్మెటిక్ సర్జరీ సహా 30కి పైగా మెడికల్ స్పెషాలిటీస్‌లో చికిత్సలు అందిస్తున్నారు. అంతేకాదు హోటల్ సదుపాయం, షాపింగ్ సదుపాయం కూడా ఈ ప్లాజాలో లభిస్తుంది.
Reutersమాటామోరోస్‌లో అమెరికన్ల కిడ్నాప్ ఆధారాల కోసం పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
టామౌలిపాస్‌లో నేరాలు, అపహరణలు అధికంగా ఉన్నాయని.. ప్రయాణికుల బస్సులు, ప్రైవేటు వాహనాలను తరచుగా టార్గెట్ చేసుకుంటున్నారని చెప్తూ.. ఆ పట్టణానికి ప్రయాణాలను నివారించాలని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా హెచ్చరిక జారీ చేసింది.
ఇతర మెక్సికో సరిహద్దు నగరాల విషయంలోనూ ఇలాంటి ప్రయాణ హెచ్చరికలు జారీ అయ్యాయి.
అమెరికాలో ప్రవేశించటానికి ప్రయత్నించే వలసదారులకు, శరణార్థులకు కొన్ని సరిహద్దు పట్టణాలు ప్రత్యేకించి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతాల్లో అమెరికన్ల మీద హింస జరగటం ఇంకా అరుదైన విషయమే.
నలుగురు అమెరికన్లను కిడ్నాప్ చేయటం, వారిలో ఇద్దరిని చంపటం అనేది అసాధారణ విషయమని రోడ్రిగ్ అంటున్నారు.
అయితే ఈ సరిహద్దు సురక్షితమైనది కాదని ఈ ఘటన గుర్తుచేస్తోందన్నారు.
''నేను వెళ్లటం మానేశాను'' అని చెప్పారు.
0 Comments:
Post a Comment