దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడిచమురు (Crude oil), చమురు (Fuel) ఎగుమతులపై చమురు సంస్థలపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్ (Windfall tax) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది భారీగా నిధులు సమకూరనున్నాయి.
మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్‌ఫాల్ ట్యాక్స్ ద్వారా రూ.25వేల కోట్లు వసూలు కానున్నట్లు సీబీఐసీ ఛైర్మన్ వివేక్ జోహ్రి తెలిపారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో విండ్ ఫాల్ పన్ను ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పారు.
భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ ఎంతకాలం ఈ ట్యాక్స్ కొనసాగుతుందని చెప్పడం కష్టమని పేర్కొన్నారు.
దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపైన, చమురు ఎగుమతులపై గతేడాది జులై 1 నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా 15 రోజులకోసారి పన్నును సవరిస్తున్నారు.
ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న నేపథ్యంలో ఈ ట్యాక్స్‌ను కొత్తగా తీసుకొచ్చారు. అలాగే, గతేడాది ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ద్వారా ఏర్పడిన లోటును ఈ ట్యాక్స్ ద్వారా భర్తీ చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ప్రస్తుతం క్రూడాయిల్‌పై టన్నుకు రూ.1900 పన్ను విధిస్తున్నారు. అలాగే లీటర్ డీజిల్‌పై రూ.5, ఏటీఎఫ్‌పై రూ.3.5 చొప్పున విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు.
మరోవైపు గతేడాది బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.3.35 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేయగా.. దాన్ని రూ.3.20 లక్షల కోట్లకు సవరించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.39 లక్షల కోట్లు ఎక్సైజ్ సుంకం ద్వారా సమకూరుతుందని తాజా బడ్జెట్‌లో అంచనా వేస్తున్నారు.
0 Comments:
Post a Comment