తారకరత్నని పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థాంక్స్ చెప్పి!
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న.. ఇటీవలే నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ తొలిరోజు.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తారకరత్నని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న సతీమణి అలేఖ్యతోపాటు కుమార్తెని కూడా ఓదార్చారు. వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ఇక విషయానికొస్తే.. తారకరత్న గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇతడికి మామయ్య వరస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సొంత చెల్లెలు కూతురే అలేఖ్య. ఇక అలేఖ్య రెడ్డి.. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవారు. తారకరత్న ‘నందీశ్వరుడు’కు ఈమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. తొలుత ఇరుకుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సన్నిహితుల సమక్షంలో తారకరత్న-అలేఖ్య పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ప్రేమ పెళ్లికి విజయసాయిరెడ్డి ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హాస్పిటల్ లో ఉన్న తారకరత్నని పరామర్శించేందుకు వచ్చారు. అలానే దగ్గరుండి చూసుకుంటున్న బాలయ్యకు ధన్యవాదాలు కూడా చెప్పారు.
‘తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినందున మెదడులో పైభాగం కాస్త దెబ్బతింది. వాపు తగ్గిన తర్వాత కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. గుండె చక్కగా పనిచేస్తోంది. రక్తప్రసరణ బాగుంది. బాలకృష్ణ అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు. ఆయనకు థ్యాంక్స్’ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. రాజకీయంగా ఎలాంటి భావాలున్నప్పటికీ.. ఇలా కుటుంబ విషయాల్లో సాధారణంగా ఉండటం నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
0 Comments:
Post a Comment