Tiger: పులినే వండుకుని తినేసిన గ్రామస్తులు.. ఫారెస్ట్ అధికారులు వెళ్లి చూడగా..!
ప్రకాశం: చికెన్, మటన్, ఫిష్ తిని బోరుకొట్టిందో.. లేదంటే కొత్త టేస్ట్ కోసం ఏదైతే ఏమైందనుకున్నారో ఏమో తెలియదు గానీ ఏకంగా టైగర్‌నే (Tiger) ఆరగించేశారు గ్రామస్తులు.
ఈ అనూహ్య సంఘటన పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా (Prakasam District)లో ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాద ముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. అలాగే పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరు బయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ విద్యుత్ సరఫరా (Power supply)ను నిలిపివేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచె తగిలి పులి మరణించింది. అయితే దీన్ని గమనించిన కొందరు పులి మాంసాన్ని ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేసినట్టు ప్రచారం జరుగుతోంది. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే పులి మాంసాన్ని వండుకున్న వారంతా దాని చర్మాన్ని సమీపంలోని బావిలో పడేసినట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది (Forest staff).. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్న 12 మందిని గుర్తించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం వీరిలో ఇద్దరిని ఎర్రగొండపాలెంలోని కార్యాలయానికి పిలిపించి రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చనిపోయిన తల్లి కోసం రెండు పులి కూనలు వెతుకుతుండడం ట్రాప్ కెమెరాల్లో (Trap cameras) రికార్డయింది.
0 Comments:
Post a Comment