గురువులతో రాజకీయ క్రీడ!
Teacher MLC Election:
👉ఉపాధ్యాయ
👉టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పొలిటికల్ రంగు
👉సామ, దాన, భేద, దండోపాయాలకు వైసీపీ సిద్ధం
👉అర్హత లేని ప్రైవేటు టీచర్లు ఓటర్లుగా నమోదు
👉ప్రైవేటు బడి యాజమాన్యాలతోనూ ఒప్పందం?
👉ఒకేసారి పదేళ్లకు రెన్యువల్ చేస్తామని హామీ
👉పశ్చిమ రాయలసీమలో లంచ్‌బాక్స్‌ల పంపిణీ
👉ఓటుకు రూ.5 వేల వరకూ ఇస్తారనీ ప్రచారం
👉టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం బరితెగింపు
👉ఇలాగైతే మండలిలో ప్రాతినిధ్యం పూర్తిగా
కోల్పోతామని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం ప్రైవేటు ఓటర్లతో అయినా గెలవాలని అధికార వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. టీచర్లకు బహుమతులు, నగదు పంపిణీతో పాటు ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. అన్ని కోణాల్లోనూ రాజకీయానికి దిగి వారిని అష్టదిగ్బంధం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు 16న నోటిఫికేషన్ జారీ కానుండటంతో అధికార పార్టీ అడ్డదారి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఒకవైపు గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా యత్నిస్తుంటే చేస్తుంటే, మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. తాజాగా పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు నేరుగా లంచ్ బాక్స్‌ల పంపిణీకి దిగడం ఎన్నికలను మరింత వాడీవేడిగా మార్చేశాయి. ఈ వ్యవహారంతో ఉపాధ్యాయ వర్గాలు విస్తుపోయాయి.
ఇలా బహిరంగంగా ప్రలోభాలకు దిగితే ఇక ఎన్నికలు ఎలా జరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది మొదటి అడుగు మాత్రమేనని... వైసీపీ సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. టీచర్లకూ ఓటుకు నోటు పంచేందుకు అధికార పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లంచ్ బాక్స్‌ల పంపిణీ ద్వారా అనుకూలంగా ఉన్నారనుకున్న చోట్ల ఓటుకు రూ.5 వేల వరకూ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ తరఫు అభ్యర్థే శాసనమండలిలో అడుగుపెట్టాలనివైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల తరఫున మండలిలో ప్రాతినిధ్యం కోల్పోతామేమోనన్న ఆందోళన టీచర్లలో వ్యక్తమవుతోంది.
*భారీగా పెరిగిన ప్రైవేటు ఓట్లు
*ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లతో పాటు ఈసారి ప్రైవేటు బడుల్లో పనిచేసే టీచరు ఓట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. పశ్చిమ రాయలసీమ నియోజవర్లో సుమారు 8వేలు, తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో 5వేల వరకు ప్రైవేటు ఓట్లు పెరిగాయి. ఇవన్నీ అధికార పార్టీ అభ్యర్థుల కోసమేనని అర్థమవుతోంది. నిర్దేశిత సర్వీసు లేకపోయినా, పీఎఫ్ ఖాతాలే లేకున్నా వారినీ టీచరు ఓటర్లుగా నమోదు చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతోనూ ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోందనే వాదన తెరపైకి వచ్చింది. మూడేళ్లకు బదులుగా పాఠశాలల గుర్తింపును పదేళ్లకు రెన్యువల్ చేస్తామని, ప్రతిఫలంగా ప్రైవేటు టీచర్ల ఓట్లన్నీ తమ అభ్యర్థికి వేయాలనే షరతు పెట్టబోతోందని కొద్దిరోజుల కిందట అకస్మాత్తుగా కడప ఆర్జేడీని బదిలీ చేసి ఆ స్థానంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతా్‌పరెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది.
ఆయన సతీమణి కల్పలతా రెడ్డి గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వైసీపీ మద్దతుతో గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఆయన్ను ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఆర్జేడీగా నియమించగా... ఆయన పలుచోట్ల టీచర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాఠశాలలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బడి పనివేళ్లలో ఎన్నికల ప్రచారం చేయొద్దని, పాఠశాల విద్య కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేసినా చర్యల మాటెత్తడం లేదు. కొందరు జిల్లా స్థాయి అధికారులు అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి.
0 Comments:
Post a Comment