Tea History | 1850 ప్రాంతంలో అసోం కొండల్లో ఆసమ్ తేయాకు తోటల పెంపకం మొదలైనా.. టీ రుచులు మనవారికి దగ్గరైంది మాత్రం 1930 ప్రాంతంలోనే!
Tea History | బ్రిటిష్ పాలకులు భారతీయులపై ఎన్నో పాశ్చాత్య పోకడలు రుద్దారు.
ఎంత వద్దనుకున్నా మళ్లీమళ్లీ ముద్దనిపించే తేనీరు మన 'కప్ ఆఫ్ టీ' అయింది వారి వల్లే! 1850 ప్రాంతంలో అసోం కొండల్లో ఆసమ్ తేయాకు తోటల పెంపకం మొదలైనా.. టీ రుచులు మనవారికి దగ్గరైంది మాత్రం 1930 ప్రాంతంలోనే! భారతీయ తేయాకు విపణి విస్తరణ సంస్థ పెట్టి మరీ దేశం నలుచెరగులా తేనీటి ఘుమఘుమలు పరిచయం చేయడం మొదలుపెట్టారు బ్రిటిష్‌వాళ్లు.
రైల్వేస్టేషన్లు, బడా నగరాల్లోని ప్రధాన కూడళ్లలో టీ కొట్లు పెట్టి.. ఆకట్టుకునేవాళ్లు! దారినపోయే దానయ్యలకు గ్లాసుల్లో టీ పోసి దానంగా ఇచ్చేవాళ్లు.
రైల్వే స్టేషన్లలో ప్రత్యేకమైన టీస్టాళ్లు పెట్టడం మాత్రమే కాదు, ప్రకటనలతో హోరెత్తించేవాళ్లు! ఆనాటి ఒక ప్రకటన బోర్డు ఇప్పటికీ పశ్చిమ్ బెంగాల్‌లోని దమ్‌దమ్ రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంది.
ఆనాటి ఉచిత ఉష్ణోదక వితరణ సేవా కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనూ నెలల తరబడి కొనసాగింది. మొదట్లో తేనీటిని నల్లమందు కన్నా భయంకరమైన మాదక ద్రవ్యంగా భావించిన మనవాళ్లు అటుగా వెళ్లాలంటేనే జంకేవారట!
రుచి చూసిన వాళ్లు మాత్రం జిహ్వ చాపల్యం చంపుకోలేక.. నిత్యకృత్యంగా ఏకాక్షరి సాధనలో తరించేవారట. కొన్ని రోజులకు చిన్నచిన్న టీ పొడి పొట్లాలను అక్కడే అణా, రెండణాలకు అమ్మడం మొదలుపెట్టారు.
టీ రుచి మరిగిన ప్రేమికులు.. ఆ పొట్లాలను అతి జాగ్రత్తగా ఇంటికి కొనిపోయి, చిక్కటి బర్రె పాలతో కాచుకొని తాగేవాళ్లు. నాటి నుంచి తేనీటితో మనవారి ప్రేమాయణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది.
అత్యధికంగా టీ వాడకం ఉన్న దేశాల్లో భారతావని రెండోస్థానంలో ఉన్నదంటే.. టీ మీద మనవారి మేటి ప్రేమకు సాటిలేదని రుజువైంది. ఆ ఘాటుప్రేమకు దీటుగా ఈ పూట మసాలా టీ కాచుకుందాం..
మసాలా టీ
కావలసిన పదార్థాలు
నీళ్లు:ఒకటిన్నర కప్పులు, పాలు:ఒక కప్పు, టీ పొడి:ఒక టీ స్పూన్, మసాలా పొడి: ఒక టీ స్పూన్ (ఇలాచీ, దాల్చిన చెక్క, సోంపు, లవంగాలు సమపాళ్లలో తీసుకొని, కాస్త వేయించి.. పొడిగా చేసుకోవాలి)
తయారీ విధానం..
స్టౌమీద గిన్నె ఉంచి, నీళ్లు పోసి, టీ పొడి, మసాలా పొడి వేసి బాగా మరిగించాలి. డికాక్షన్ మసిలేటప్పుడు పాలు పోసి, చక్కెర వేయాలి. టీ పొంగేంత వరకు ఉంచి స్టౌ ఆఫ్ చేయాలి. గ్లాసులో వడకట్టుకుంటే బద్ధకాన్ని వదలగొట్టే మసాలా టీ సిద్ధం.
'టీ'కా తాత్పర్యం
ఒక కప్పు టీ తాగడం వల్ల, పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు!
0 Comments:
Post a Comment