📚 సబ్జెక్టు టీచర్ పోస్టులు భర్తీ అయ్యేనా?
👉మాకొద్దు మొర్రో అంటున్న ఎస్జీటీలు
👉నాలుగుసార్లు పిలిచినా ఇంకా ఖాళీగా 90 పోస్టులు
ఒంగోలు (విద్య), ఫిబ్రవరి 19 :* జిల్లాలోని హైస్కూళ్లు, యూపీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సబ్జెక్టు టీచర్లుగా సర్దుబాటుకు సెకండరీ గ్రేడ్ టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్‌కు ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా పాఠశాలల్లో 90 సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. సబ్జెక్టు టీచర్ల పోస్టులకు ఎస్‌జీటీలను సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే నాలుగుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేదు. దీని పర్యవసానంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధన కుంటుపడుతోంది. సిలబస్ కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లలో విలీనం చేసి వారికి కూడా సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తామని ప్రభుత్వం నమ్మబలికింది. అయితే పాఠశాలల్లో తగినంత మంది సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో ప్రభుత్వ ఆశలు నెరవేరడం లేదు. ఖాళీల్లో 70శాతం ఎస్‌జీటీలను ఉద్యోగోన్నతుల ద్వారా మిగిలిన 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే డీఎస్సీ ప్రకటించనందున ఆ పోస్టులను కూడా ఎస్జీటీల సర్దుబాటు ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సర్దుబాటు ద్వారా సబ్జెక్టు టీచర్లుగా పనిచేసే ఎస్జీటీలకు రూ.2500 ప్రత్యేక అలవెన్స్‌ను ప్రకటించింది. ఆ అలవెన్స్ తీసుకొని సబ్జెక్టు టీచర్లుగా పనిచేసేందుకు ఎస్జీటీలు కౌన్సెలింగ్‌కు రావడం లేదు.
*700 మందికి 29 మంది సుముఖం*
సెకండరీ గ్రేడ్ టీచర్లను సబ్జెక్టు టీచర్లుగా సర్దుబాటు చూసేందుకు 700 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు ఈనెల 14న పిలువగా కేవలం 29 మంది మాత్రమే సుముఖత చూపారు. దానిని బట్టి ఈ సర్దుబాటుపై టీచర్లలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. 700మంది సర్టిఫికెట్ల పరిశీలనకు రావాల్సి ఉండగా కేవలం వంద మందిలోపు మాత్రమే హాజరయ్యారు. వీరిలో కేవలం 29 మంది మాత్రమే సర్దుబాటుకు ఆమోదం తెలిపారు. బయోలాజికల్ సైన్స్ పోస్టులు 25 ఖాళీలు ఉండగా 208 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. వీరిలో కేవలం నలుగురు మాత్రమే సబ్జెక్టు టీచర్లుగా వెళ్లేందుకు ఆమోదం తెలిపారు. సోషల్ స్టడీ్‌సలో 51 పోస్టులు ఖాళీగా ఉండగా 380 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలువగా కేవలం 18 మంది అంగీకరించారు. గణితంలో ఖాళీగా ఉన్న తొమ్మిది పోస్టులకు 55 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలువగా కేవలం ఏడుగురు మాత్రమే ఆమోదం తెలిపారు. ఇంగ్లిషు ఏడు పోస్టులు ఖాళీగా ఉండగా 55 మందిని పిలిచారు. అయితే సబ్జెక్టు టీచర్లుగా వెళ్లేందుకు టీచర్ల నుంచి అంతంతమాత్రమే స్పందన రావడంతో 18న జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. మళ్లీ కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
0 Comments:
Post a Comment