✍️టీచర్లకు తాఖీదుల పరంపర!
♦️తాండవ, డి.యర్రవరం ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ డీఈవో తనిఖీలు
♦️లెసన్ ప్లాన్, విద్యార్థుల నోట్స్ నిర్వహణపై అసంతృప్తి
♦️తాండవ స్కూల్ హెచ్ఎం, 18 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
🌻నాతవరం, ఫిబ్రవరి 1: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని తాండవ, డి.యర్రవరం ఉన్నత పాఠశాలలకు చెందిన 19 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉప విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఒక హెచ్‌ఎం కూడా వున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం తాండవ హైస్కూల్‌లో తనిఖీలు చేశారు. విద్యార్థుల నోట్ పుస్తకాలను పరిశీలించి, పాఠ్యాంశాలకు సంబంధించి 9, 10 తరగతుల విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేశారు. తెలుగు, లెక్కల టీచర్లు.. విద్యార్థుల నోట్స్‌ను సరిగా దిద్దలేదని, లెసన్ ప్లాన్ రాయలేదని గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం శ్రీదేవి పట్టించుకోకపోవడంతో ఆమెతోపాటు ఆయా సబ్జెక్టు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరువాత ఆయన డి.యర్రవరం ఉన్నత పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల నోట్స్ పరిశీలించారు. లెసన్ ప్లాన్ రాయకపోవడం, విద్యార్థుల నోట్స్‌ను చూడకపోవడం వంటి కారణాలతో ఈ పాఠశాలలో పనిచేస్తున్న 16 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నట్టు చెప్పారు. 8వ తరగతి విద్యార్థులు ట్యాబ్‌లు ఎలా వినియోగిస్తున్నది పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది 22,500 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, శత శాతం ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఎంఈవో అమృతకుమార్ వున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment