🛼బూట్లకు... తూట్లు..🛼
♦️కుట్టించుకోవడానికీ పనికి రావట్లేదు
♦️ప్రవీణ్ సార్! విద్యార్థులు వేసుకోనిది అందుకే
🌻ఈనాడు, అమరావతి
మూడు రోజుల క్రితం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని పలు స్కూళ్లకు ప్రత్యక్ష పరిశీలనకు వెళ్లారు. ఓ పాఠశాలలో అయితే చాలా మంది విద్యార్థులు బూట్లు(షూస్) ధరించకుండా రావడాన్ని గమనించారు. జేవీకే కిట్‌లో షూస్, బెల్టులు ఇచ్చాం కదా? పిల్లలు ఎందుకు వేసుకోలేదని ప్ర£శ్నించగా అధికారుల నుంచి హెచ్‌ఎం దాకా ఎవరూ నోరుమెదపలేదు.
♦️ప్రస్తుత విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక(జేవీకే) కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేసిన సామగ్రిలో బూట్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. వాటి పంపిణీ సమయంలోనే బాగోలేదని ప్రధానోపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నాణ్యత లేని సరకు సరఫరా చేసిన గుత్తేదారుడిని వదిలేసి అధికారులు, ఉపాధ్యాయులను పిల్లలు బూట్లు ఎందుకు ధరించట్లేదని ప్రశ్నించడం ఉన్నతాధికారుల తీరుగా మారింది. ‘పాఠశాల దశలోనే పిల్లలకు షూస్ వేసుకునే విధానం నేర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మనం ఇక్కడ పాఠశాల విద్యార్థులకు బూట్లు ఇస్తున్నాం. పిల్లలు వాటిని వేసుకురాకపోవడం బాధాకర’మన్నారు. అయితే ప్రభుత్వమిచ్చిన బూట్లు నాణ్యత లేమితో ఉన్నాయని, అవి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయనే విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేరని’ ఆయన పర్యటన ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఏ పార్టుకు ఆ పార్టు ఎక్కడికక్కడ ఊడిపోయి, తెగిపోయి నామరూపాల్లేకుండా ఉన్నాయి. అలా అధ్వానంగా ఉన్న వాటిని ఏం వేసుకుంటామని చాలా మంది విద్యార్థులు ప్రత్యామ్నాయంగా చెప్పులు వేసుకుని వస్తున్నారు. తెగిపోయినవి కుట్టించుకుని వేసుకుందామనుకున్నా అవి కుట్టడానికీ వీల్లేకుండా ఉన్నాయని విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు సైతం చెబుతున్నారు. దీన్నిబట్టి అవి ఎంత తీసికట్టుగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఏ పాఠశాల విద్యార్థి ధరించిన బూట్లు చూసినా కన్నాలు పడి ఉండడం, చిరిగిపోయి ఉండడం కనిపిస్తుంది. సహజంగా మనం మార్కెట్‌కు వెళ్లి బూట్లు కొనుగోలు చేస్తే వాటి మన్నిక, ఎన్నాళ్లు ఉంటాయని దుకాణదారుడ్ని ప్రశ్నించి మరీ కొనుగోలు చేస్తాం. అందుకు వారంటీ తీసుకుంటాం. కానీ లక్షల మంది విద్యార్థుల కోసం కొనుగోలు చేసేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులే ప్రశ్నించుకోవాలి. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా 3500కు పైగా పాఠశాలలు ఉండగా వాటిల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికి ఆగస్టు, సెప్టెంబరులో బూట్లు అందించగా మరికొందరికి స్టాక్ లేవని చెప్పి అక్టోబరు, నవంబరులో అందజేశారు. ఇంత ఆలస్యంగా ఇచ్చిన బూట్లు కూడా నాణ్యత లేమితోనే వచ్చాయని ఉపాధ్యాయులు తెలిపారు.
♦️ఎక్కడా చూసినా ఇలాగే...
బూట్ల నాణ్యత లేమిపై గతంలోనే మీడియాలో కథనాలు రాగా వాటిపై వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి పూర్తిగా పాడైపోయిన వారి నుంచి వివరాలు సేకరించారు. సగటున ప్రతి పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులు తమ బూట్లూ పనికిరాకుండా పోయాయని, అందుకే వాటిని వేసుకుని రావటం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ఏ పాఠశాలలో చూసినా పాడైపోయిన బూట్లతోనే స్కూళ్లకు వస్తున్నారని, వాటిని చూస్తే తమకే బాధేస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment