✍️జీతాల కోసం నిరీక్షణే
🌻జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జనవరి జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రభుత్వం జీతాలు వేస్తుందేమోనని ఉద్యోగులు ఎదురు చూశారు. అయితే 5వ తేదీ వరకు ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జీతాలకు సంబంధించి నగదు జమ కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది బ్యాంకుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణం తీసుకున్నారు. నెలలో 1 నుంచి 5వ తేదీ లోపు నెల వారీ కిస్తీలు ఈఎంఐలు చెలించాల్సి ఉంటుంది. జీతాలు పడకపోవడంతో ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మూడున్నరేళ్లుగా నెలలో సక్రమంగా జీతాలు పడకపోవడంతో బ్యాంకుల్లో ఈఎంఐలు సరిగా చెల్లించలేకపోతున్నారు. దీనివల్ల వారి సిబిల్ స్కోర్‌లో రుణాత్మక పాయింట్లు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ప్రతిబంధకంగా మారుతుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి బయట అప్పులు చేసి బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో ముగియనుంది. దీంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు పన్ను చెల్లించాలని నోటీసులు వచ్చాయి. జనవరి జీతం వచ్చినా ఆదాయ పన్ను చెల్లించడానికే సరిపోతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో 50 శాతం, మార్చి నెలలో మరో 50 శాతం చొప్పున ఆదాయ పన్ను చెల్లిస్తామని.. జీతాల్లో మినహాయించుకోవాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కార్యాలయాల అధికారులను ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం జీతాలు ఎప్పుడు విడుదల చేస్తుందా? తమ ఇబ్బందులు ఎప్పుడు తొలుగుతాయా? అని ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఉద్యోగులకు నెలలో ఒకటో తేదీన జీతం చెల్లించేలా చూడాలని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
0 Comments:
Post a Comment