ముంబయి: బ్యాంకింగ్, డిజిటల్ ఫైనాన్షియల్ సేవల రంగంలో వివిధ సమస్యలకు పరిష్కారాలకు కనుగొనేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హార్బింగర్ 2023 (HARBINGER 2023) పేరుతో గ్లోబల్ హ్యాకథాన్ (Hackathon)ను నిర్వహిస్తోంది.
ఇందులో పాల్గొని ఆర్‌బీఐ సూచించిన సమస్యలకు పరిష్కారం కనుగొన్నవారికి మొదటి బహుమతిగా రూ. 40 లక్షలు, రెండో బహుమతిగా రూ. 20 లక్షల నగదును అందిస్తోంది.
ఆర్‌బీఐ ఈ హ్యాకథాన్‌ను తొలిసారిగా 2021లో ప్రారంభించింది. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనే వారు నాలుగు అంశాలకు పరిష్కారాలు చూపాలని ఆర్‌బీఐ కోరుతోంది.
దివ్యాంగులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సులభంగా ఉపయోగించుకునేందుకు వినూత్నమైన పరిష్కారం కనుగొనడం
ఆర్థిక సేవల (Fintech Services) రంగంలో నియంత్రిత సంస్థలు ఉపయోగించే సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణలు
రిటైల్ లావాదేవీ(Retail Transactions)ల్లో ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా ఇ-రూపీ (Digital Rupee) వినియోగాన్ని విస్తృతం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం
బ్లాక్‌చెయిన్స్ (Blackchains) ద్వారా సెకనుకు జరిగే లావాదేవీల (TPS) సంఖ్యను పెంచి, వాటిని లెక్కించేందుకు అసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం
హార్బింగర్ 2023లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 24లోపు తమ ఆవిష్కరణలు, సాంకేతికతలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్‌బీఐ ప్రత్యేక వెబ్‌సైట్ (https://hackolosseum.apixplatform.com) ద్వారా సమర్పించాలి.
18 సంవత్సరాలు నిండి, హ్యాకింగ్‌పై అవగాహన ఉన్న వారు ఎవరైనా తమ ప్రతిపాదనలను సమర్పించవచ్చు. ఆర్‌బీఐ నియమించిన జ్యూరీ ప్రతిపాదనలను పరిశీలించి వాటిలో విన్నూత్నంగా ఉన్నవాటిని ఎంపిక చేస్తుంది.
అలా ఎంపికైన ప్రతిపాదనలకు నగదు బహుమతిని అందజేయడంతోపాటు, వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు జ్యూరీలో ఉన్న ఆర్థిక, సాంకేతికత రంగ నిపుణులు పర్యవేక్షకులుగా ఉండి సూచనలు చేస్తారు.
0 Comments:
Post a Comment