జీవితంలో ఇతరులకు, ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ముందు మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకుంటే, మన మానసిక, శారీరక, భావోద్వేగపు శక్తిని మనం కాపాడుకోగలం.
అప్పుడే మనకు సంతోషాన్నిచ్చే వాటిపై మనం దృష్టి పెట్టగలం. భావోద్వేగపు శక్తి మనల్ని మనం కొత్తగా ఉంచుకునేందుకు, రోజంతా కొత్త శక్తితో ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుంది.
ఆ శక్తిని మనలో కాపాడుకోవాలి. దానిని అర్హులు కాని వ్యక్తులపై, ఇతర అంశాలపై వృథా చేయరాదు. థెరపిస్ట్ సారా కుబిరిక్ ఆయా అంశాలను తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చర్చించారు. మన శక్తిని ఎలా కాపాడుకోవాలో సూచించారు. మన శక్తిని వృథా కాకుండా చూసుకునేందుకు కొన్ని టిప్స్ ఇచ్చారు.
అంత ముఖ్యమైనవి కాని వాటిపై: మన శక్తిని కాపాడుకునేందుకు మన దృష్టిని ఆకర్షించే అర్హత కల వాటిపైనే మన దృష్టి ఉండాలి. మిగిలిన వాటిపై దృష్టి పెట్టడం మానేయాలి.
స్క్రోలింగ్: మనం కొన్నిసార్లు సోషల్ మీడియాలో అదే పనిగా చాలా సేపు స్క్రోల్ చేస్తూ ఉంటాం. అది మన నిద్ర సమయాన్ని కూడా తినేస్తుంది. దానికి బదులుగా మనకు తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి.
ఒప్పించడం: చాలాసార్లు మనం ఇష్టపడే వారు మనల్ని వీడి వెళ్లినప్పుడు మనతో ఉండాలని వారిని ఒప్పించేందుకు, నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తాం. భావోద్వేగాలకు లోనై మరింత బాధపడుతాం.
వ్యక్తులు మనం ఇష్టపడే వారైనా సరే.. కొన్నిసార్లు వీడిపోవడం సహజమేనని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
నటించడం: సహజ స్వభావానికి విరుద్ధంగా, మనం కానటువంటి వ్యక్తులుగా నటించడం వల్ల మన శక్తి వృథా అవుతుంది. దీనికి బదులుగా మన నిజాయతీని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం.
విలువను నిరూపించుకోవడం: మన విలువను ఇతరులకు నిరూపించడానికి ప్రయత్నించడం కంటే శక్తి వృథా చేసుకోవడం మరొకటి ఉండదు. అత్యంత బాధాకరమైన విషయమే అయినప్పటికీ, మన మాటల కంటే చేతల్లో చెప్పడం వల్ల మేలు జరుగుతుంది.
వాదనలు: మనల్ని అర్థం చేసుకునేందుకు ఇష్టపడని వారితో తరచుగా మనం వాగ్వాదానికి దిగి బంధాన్ని తెంచుకుంటాం. ఇలాంటి సందర్భాల్లో వాదనలకు టాటా చెప్పి.. ముందుకు సాగడమే మంచి పని.
మనలాంటి వ్యక్తులను తయారు చేయాలనుకోవడం: ఏం చేసినా సరే.. మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లవేళలా ఉంటారు. అందరూ మనల్ని ఇష్టపడేలా చేయడం మన పని కాదు. దీనిని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ఇష్టపడాలని వాళ్లను ఒప్పించే ప్రయత్నాల్లో మన శక్తిని వృథా చేసుకోవద్దు.
0 Comments:
Post a Comment