*📚✍️విద్యాశాఖ అధికారులకు ముచ్చెమటలు!
♦️ప్రవీణ్ ప్రకాష్ పరిశీలనలో పలు లోపాలు బహిర్గతం
♦️వీటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నల వర్షం
♦️గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలు స్కూళ్లలో తనిఖీలు
*🌻ఈనాడు, అమరావతి*
*దుగ్గిరాల*:
విద్యార్థుల్లో సామర్థ్యాల లేమి.. పిల్లలు రాసిన వర్క్‌బుక్స్‌ను కొందరు ఉపాధ్యాయులు కరెక్షన్ చేయకపోవడం, హెచ్‌ఎం సెలవు పెడితే పత్రం ఇవ్వకపోవడం, ఆ విషయం అధికారులకు తెలియకపోవడం, తరగతి గదులు ఉన్నా వాటిని ఖాళీగా పెట్టి పిల్లలను ఇబ్బందికరంగా కూర్చోబెట్టడం వంటి అనేక లోపాలు పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలనలో వెలుగుజూశాయి. ఇవి విద్యా శాఖ యంత్రాంగంలో అలజడి రేపాయి. తమపై ఏం చర్యలు తీసుకుంటారోనని ఆందోళనలో ఉన్నారు.
♦️ప్రవీణ్‌ప్రకాష్ ప్రతి జిల్లాకు వెళ్లి పాఠశాలలు పరిశీలించి పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? ఉపాధ్యాయులు విధి నిర్వహణËలో ఎలా ఉంటున్నారు, నాడు-నేడు పాఠశాలల నిర్మాణాలు వంటివి పరిశీలించి లోటుపాట్లు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు హైస్కూలు, గొడవర్రు ప్రాథమిక పాఠశాలను, బాపట్ల జిల్లాలో పలు పాఠశాలలను పరిశీలించారు. ఈ రెండు జిల్లాల్లోనూ బడుల నిర్వహణ ఏం బాగోలేదని పిల్లల్లో సామర్థ్యాలు కొరవడినా అధికారుల పర్యవేక్షణ లోపించిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
* పిల్లల్లో సామర్థ్యాలు లోపించినా, ఉపాధ్యాయులు సక్రమంగా బోధన చేయకపోయినా అందుకు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలే బాధ్యులని తాము కేవలం పర్యవేక్షకులం మాత్రమేనన్న ధోరణి ఆర్జేడీ, డీఈఓల్లో ఉన్నట్లు ఉంది. ఈ లోపాలకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు, మీకు మెమో ఇచ్చి వివరణ కోరతామని, మీరిచ్చే సమధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని బాంబుపేల్చారు. దీంతో ఉన్నతాధికారులు బెంబేలెత్తారు. ఆయన పర్యటనకు వస్తారని ఇప్పటికే గుంటూరు డీఈఓ శైలజ ఈ మధ్య కాలంలో అనేక పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆమె పరిశీలనలోనే చాలాచోట్ల ఉపాధ్యాయులు వర్క్‌బుక్స్ కరెక్షన్ చేయకపోవటం, పిల్లల్లో సామర్థ్యాలు కొరవడినట్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే తాను కొన్ని స్కూళ్లు పరిశీలించి లోపాలు గమనించి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. అయినాప్రవీణ్ ప్రకాష్ సంతృప్తి చెందలేదు. ‘తాను ఒక్కడినే పట్టించుకోవాలా? ఇంతమంది యంత్రాంగం ఉండి ఏం ప్రయోజనం? విద్యారంగానికి ఇతోధికంగా కేటాయింపులు జరుపుతున్నాం. అయినా ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఇంకెప్పటికి మారుతుంది? అసలు మీ పర్యటనల ఉద్దేశం ఏమిటి? ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఏమిటని’ ఆయన కటువుగానే ప్రశ్నించారని తెలిసింది. ఆయన వేసిన ప్రశ్నలతో యంత్రాంగం నీళ్లు నమిలింది. ఓ పాఠశాల హెచ్‌ఎం సెలవు పెడితే సెలవు పత్రం ఏదీ? సెలవుపెట్టిన విషయం మీకు తెలియకపోతే స్కూళ్ల నిర్వహణ దారుణంగా ఉండవా అంటూ నిలదీసినట్లు సమాచారం. మరోవైపు ఆయన పర్యటనకు సంబంధించి ముందుగా అధికారులు దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, కొల్లూరు, వేమూరు, బాపట్ల మండలాల్లో కొన్ని స్కూళ్లను సూచించారు. అలాగే వెళదామని చెప్పి కారుల్లో బయలుదేరారు. కారు ఎక్కాక ఆ స్కూళ్లను కాదని రెండు, మూడు సూళ్లను ఆయన ఆలోచన మేరకు ఎంపిక చేసుకుని వాటికి వెళదామని సూచించారు. అక్కడకు వెళ్లగా ఆ స్కూళ్లల్లోనే ఎక్కువగా లోపాలు బయటపడినట్లు తెలిసింది. గతంలో పర్యటించిన పలు జిల్లాల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని అసహనం, అసంతృప్తి వ్యక్తం చేయగా ఉమ్మడి గుంటూరులో మాత్రం యంత్రాంగం తీరును తప్పుబట్టడం గమనార్హం. ఆయన పర్యటించిన అన్ని స్కూళ్లలో తరగతి గదిలోకి వెళ్లగానే టీచర్లను బయటకు వెళ్లమని, అధికారులను పిలిచి వారి సమక్షంలోనే పిల్లలతో మాట్లాడటం, వారి పుస్తకాలు పరిశీలించటం వంటివి చేశారు. అధికారులను సైతం ఎఫ్‌ఏ-2, 3 పరీక్షలకు సంబంధించిన సిలబస్‌పైనా ప్రశ్నించగా వారి నుంచి సమాధానం కొరవడినట్లు సమాచారం. ఆయన వెంట ఆర్జేడీ సుబ్బారావు, గుంటూరు, బాపట్ల డీఈఓలు శైలజ, రామారావుతో పాటు ఆయా డివిజన్ల ఉపవిద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment