ఉపాధ్యాయులపై నిఘా
♦️ బాధ్యతలు నిర్వర్తిస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
♦️. టెన్షన్‌తోనే విధులకు వెళ్తున్న మాస్టార్లు.
♦️. ప్రవీణ్‌ప్రకాష్ వ్యాఖ్యలపై నిరసనలు
🌻(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న విమర్శ సర్వత్రా విన్పిస్తోంది. వారికి బాధ్యతలను పెంచుతూ మరోవైపు పర్యవేక్షణ కూడా పెంచిందన్న భావన వారిలో స్థిరపడింది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించడం.. లోపాలు చూసి ఆగ్రహించడం సాధారణంగా మారుతోంది. ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ ఇతర జిల్లాలో పాఠశాలను సందర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ వర్గంలో మరింత అలజడి రేపాయి. మరోవైపు సమస్యలపై ఉద్యమిస్తున్న వారిపై ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతోందని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదే విషయాన్ని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో మాస్టార్లు నేరుగా నిరసన తెలిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలల ఉపాధ్యాయుల ఫోన్‌లకు వారి విధులపై తరచూ మెసేజ్‌లు వస్తున్నాయి. జిల్లా విద్యా శాఖ అధికారితో కూడిన టీమ్‌లు ఆకస్మిక సందర్శనకు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సందేశం పంపుతున్నారు. పక్క గ్రామానికి ఎవరైనా అధికారులు వస్తే మిగతా వారు కూడా టెన్షన్ పడుతున్నారు.
♦️. పాఠశాలకు సమయానికి హాజరు కావడం.. విద్యార్థుల అంటెండెన్స్, మధ్యాహ్న భోజన పథకం ఫొటోలు, ఫేషియల్ అటెండన్స్ అప్‌లోడ్ చేయడం.. టీచింగ్ నోట్స్ రాయడం.. వర్క్‌బుక్‌లు కరెక్షన్ చేయడం.. సిలబస్ పూర్తి చేయడం.. స్టాక్ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించడం.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేయడం తదితర అంశాలపై అందరూ పక్కాగా ఉండాలని మండల అధికారుల నుంచి టీచర్ల ఫోన్‌లకు సమాచారం వస్తోంది. 39 అంశాలతో సందేశం పంపుతున్నారు.
0 Comments:
Post a Comment