📚✍️వామ్మో.. సారొస్తున్నారు!
♦️ప్రవీణ్ ప్రకాశ్ పర్యటనలతో టీచర్లలో వణుకు
♦️దాదాపు 40 అంశాలపై బడుల్లో పరిశీలన
♦️ఏది సరిగా లేకున్నా మెమోలు.. సస్పెన్షన్ హెచ్చరికలు
♦️తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులు
🌻(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘మొన్నామధ్య ఓ స్నేహితుడి వాళ్లబ్బాయి పుట్టినరోజు అంటే వెళ్లాను. పేరేమిటిఅనడిగితే ప్రవీణ్ ప్రకాశ్ అని చెప్పారు. అంతే భోజనం కూడా చేయకుండా తిరిగొచ్చేశాను’’ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో కొద్దిరోజులుగా షేర్ అవుతోన్న జోక్ ఇది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేరు వింటే టీచర్లు ఎలా వణికిపోతున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రవీణ్ ప్రకాశ్ పాఠశాల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఆయన సీఎంవోలో పనిచేసినప్పుడు కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తారనే ప్రచారం ఉండటంతో టీచర్లు ఆందోళన చెందారు. అయితే ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లండి, ఎలాంటి హడావుడి వద్దు అని స్వయంగా ఆయనే భరోసా ఇచ్చారు. జిల్లాల్లో తన పర్యటనలకు ఎలాంటి ఏర్పాట్లూ అవసరం లేదని అతి సాధారణ మెనూ కూడా విడుదల చేశారు. దీంతో తాము ఊహించినంత ఇబ్బందేమీ ఉండదని టీచర్లు భావించారు.
కానీ అంతలోనే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టిన ఆయన టీచర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు 40 రకాల అంశాల్లో ఏ ఒక్కదాంట్లో లోపాలున్నా వెంటనే టీచర్లకు చీవాట్లు పెడుతున్నారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లోని పాఠశాలలను ఆయన సందర్శించగా దాదాపుగా అన్ని చోట్లా టీచర్లకు క్లాస్ తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక టీచర్‌ను సస్పెండ్ చేయగా, అనేక మందికి ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో మెమోలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రతిరోజూ ముఖ్య కార్యదర్శి ఎక్కడ పర్యటిస్తున్నారు..? అని టీచర్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆయనొస్తే చిన్న లోపమైనా పట్టుకుంటారని, దాన్ని పట్టుకుని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని సతమతమవుతున్నారు.
♦️ఇవన్నీ సరిగా ఉండాలి👇👇👇👇
ప్రవీణ్ ప్రకాశ్ పర్యటనల నేపథ్యంలో జిల్లాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 40 రకాల అంశాలతో జాబితా రూపొందించి టీచర్లకు పంపుతున్నారు. అందులో ప్రతిదీ అప్‌డేటెడ్‌గా ఉండాలని ఆదేశిస్తున్నారు. వాటిలో కొన్ని...
వర్క్, నోట్ పుస్తకాల కరెక్షన్ పూర్తిచేసి ఉండాలి. ఎక్కడా ఖాళీ పేజీలు ఉండకూడదు. పరీక్షా పేపర్ల మూల్యాంకనం పూర్తవ్వాలి. ప్రతి టీచర్ వద్ద మూల్యాంకనం సూత్రాలు ఉండాలి. పరీక్ష పేపర్లు దిద్దిన తర్వాత విద్యార్థి రాసిన తప్పు సమాధానాలకు వివరణ ఇచ్చినట్లుగా రికార్డు ఉండాలి. మధ్యాహ్న భోజనం మెనూ ఏమిటనేది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ తెలిసి ఉండాలి. నాడు-నేడు పథకం నగదు ఖాతాల్లో ఉండకూడదు. అన్ని వివరాలు చెప్పగలగాలి. ప్రతి విద్యార్థి యూనిఫాంలోనే పాఠశాలకు రావాలి. బైజూస్ ట్యాబ్ రోజూ బడికి తీసుకురావాలి. రోజూ టీచర్, విద్యార్థులు దానికి సమయం కేటాయించాలి. ప్రతి టీచర్ పాఠ్య ప్రణాళిక కచ్చితంగా రాయాలి. బాత్‌రూమ్ ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, విద్యార్థుల హాజరు యాప్, ఉపాధ్యాయు హాజరు యాప్ అన్నీ సక్రమంగా నిర్వహించాలి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తిచేయాలి. బాత్‌రూమ్‌లుశుభ్రం చేసే మెటీరియల్ స్టాకు, నాడు-నేడు పనుల మెటీరియల్ స్టాకు, విద్యార్థినుల శానిటరీ నాప్కిన్ల స్టాకు వివరాలకు రిజిస్టర్లు రోజూ అప్‌డేట్ చేయాలి. తాగునీటి ఆర్వో ప్లాంటు చెక్ చేయాలి. తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు నిర్వహించి, ఆ తీర్మానాలు రిజిస్టర్‌లో నమోదుచేయాలి. వీటితోపాటు అనేక రకాల అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను టీచర్లకు సూచిస్తున్నారు.
♦️బోధనేతర పనులు తొలగించండి
పాఠాలు చెప్పడమే కాకుండా తమకు సంబంధం లేని బోధనేతర పనులన్నీ అంటగట్టి ఇప్పుడు టీచర్లు సక్రమంగా పనిచేయడం లేదన్నట్టుగా ముద్ర వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీచర్లను బోధనేతర పనులకు వినియోగించకుండా ఉండే ఉద్దేశంతో ఇటీవల ఎన్నికల విధుల నుంచి తప్పించారని, అలాంటప్పుడు బాత్‌రూమ్ ఫొటోలు, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, నాడు-నేడు పనులు, విద్యాకానుక పంపిణీ.. ఇవన్నీ తమకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ తొలగిస్తే బోధన సంబంధిత అంశాల్లో ఎక్కడా లోపాలు ఉండవని, ముందుగా వాటిని సరిదిద్దాలని కోరుతున్నారు.
♦️భయంభయంగా ఉద్యోగం
ఇటీవల ప్రకాశం జిల్లాలో నాడు-నేడు పనులపై జిల్లా అధికారులు వరుసపెట్టి సమీక్షలు పెడుతున్నారు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీయగా ప్రవీణ్ ప్రకాశ్ పాఠశాలల సందర్శనకు వస్తున్నారనే సమాచారంతో సమీక్షలు చేస్తున్నారని ఉపాధ్యాయులు చెప్పారు. ఇప్పటికే పర్యటనలు చేసిన జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాల్లోని టీచర్లలో ఆందోళన ఎక్కువైపోతోంది. ఏరోజుకారోజు ‘ఇవాళ సార్ ఎక్కడికి వెళ్తున్నారు?’ అని ప్రధానోపాధ్యాయుని స్థాయి వారు కూడా షెడ్యూలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది పుస్తకాలు ఆలస్యంగా ఇవ్వడంతో సిలబస్ పూర్తి ఆలస్యమవుతోంది. అయినా సరే అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సిలబస్ కావాలని ముఖ్య కార్యదర్శి అంటున్నారు. విద్యా కానుకలో ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయినా, మూడు జతల యూనిఫాం ఇవ్వకపోయినా వారు వాటిని ధరించేలా చూడటం టీచర్ల బాధ్యత అంటూ ముడిపెడుతున్నారు.
0 Comments:
Post a Comment