Post office Schemes - మధ్యతరగతి ప్రజలకు కాసులు కురిపిస్తోన్న పోస్టాఫీస్ పథకాలు..!
పోస్టాఫీస్ పథకాలు గురించి పట్టణాల్లో నివసించే వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికే ఎక్కువ తెలుసు. కూలీ నాలీ చేసుకుంటూ వచ్చే నాలుగు రాళ్ళలో ఎంతో కొంత పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు.
అది ఎంత మొత్తమా..? అన్నది సమస్య వారి కాదు. భవిష్యత్తులో ఏ అవసరం వస్తుందో.. ఆ సమయంలో నలుగురి వద్ద చేతులు చాచకుండా ఉండలన్నదే వారి తాపత్రయం. అలా అని పోస్టాఫీస్ పథకాలను ప్రయోజనాలు తక్కువ అని తీసిపారేయకండి. ప్రభుత్వ రంగ అందించే ప్రయోజనాల కంటే పోస్టాఫీస్ పథకాల్లోనే ప్రయోజనాలు ఎక్కువ. అందులోనూ.. రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి రాబడి రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి.
పోస్టాఫీస్ పొదుపు ఖాతా, రిక్కరింగ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన.. ఇలా పలు పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం.. ఈ ఐదు పథకాలను వేరు వేరు ఉద్దేశ్యాలతో తీసుకొచ్చారు. వీటి వల్ల ప్రయోజనాలు బోలెడు. ఆ ప్రయోజనాలు తెలుసుకొని భవిష్యత్ కోసం పొదుపు చేస్తారన్న ఆలోచనతో ఈ వివరాలు మీకందిస్తున్నాం..
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల తండ్రులు.. తమ కూతురి భవిష్యత్ పై/ పెళ్లిపై బెంగ పెట్టుకోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆడపిల్లల భవిష్యత్తే మీ ఆలోచన అయితే.. ఇంతకు మించిన పథకం మరొకటి లేదు. ఆడబిడ్డ జన్మించిన క్షణం నుంచి 10ఏళ్ల వయసు వచ్చేలోపు ఈ ఖాతా తెరవాల్సి ఉంటుంది. పదేళ్లు దాటితే సాధ్యపడదు. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వచ్చాక.. ఖాతా ఆమె ఆధీనంలోకి వస్తుంది. అప్పటివరకు తల్లిదండ్రులకు మాత్రమే అకౌంట్ పై అధికారం ఉంటుంది.
సుకన్య సమృద్ధి ఖాతా ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ కాలవ్యవధి 21 ఏళ్లు. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చాక కొంత మొత్తంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.
కిసాన్ వికాస్ పత్ర
ఈ పథకాన్ని 1988లో ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టింది. ఆనాటి నుంచి ప్రజల మనసు చూరగొంటోంది అంటే నమ్మండి. ఇందులో ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టిన 124 నెలల్లో(10 సంవత్సరాల 4 నెలలు) ఆ మొత్తం రెట్టింపవుతుంది. ఉదాహరణకు, మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 124 నెలల తర్వాత రూ. 10 లక్షలు మీ చేతికి అందుతాయి. ఇందులో కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు. ఆపై ఎంత మొత్తమైనా రూ.1000 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే.. రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000.. ఇలా పొదుచేయాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది ప్రయోజనకరం. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రపై సంవత్సరానికి 7.2 శాతం వడ్డీ లభిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఈ పథకం మెచ్యూరిటీ పిరియడ్ 15 సంవత్సరాలు. ఈ ఖాతాను 10 ఏళ్ల లోపు పిల్లల పేరుపై కూడా తెరవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
60 ఏళ్లు పైబడిన వారి కోసం ఉద్దేశించిందే ఈ పథకం. అయితే, 55 ఏళ్లు పైబడిన 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టాలనే షరతుకు లోబడిన వారు ఈ ఖాతాను తెరవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. ప్రతి 3 నెలలకొకసారి వడ్డీ చెల్లిస్తారు. కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 8 శాతం వడ్డీ లభిస్తోంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం
ఈ పథకంలో చేరిన వారికి ఒక సర్టిఫికెట్ అందచేస్తారు. వీటిని మరొకరి పేరిట బదిలీ చేసుకునే వీలూ ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే కనిష్టంగా రూ.100లు పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠ పరిమితి లేదు. ఆదాయ పన్ను 80సీ ప్రకారం ఉద్యోగులు, వ్యాపారులకు ఇది మేలు చేకూర్చే పథకం.కావాలనుకుంటే.. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించవచ్చు. నామినీ సౌకర్యం ఉంటుంది. ఎన్‌ఎస్‌సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు మీ చేతికందుతాయి. ప్రస్తుతం ఈ పథకంపై 6.8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.
0 Comments:
Post a Comment