మారిన వాతావరణ పరిస్థితులు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది న్యుమోనియా(pneumonia) బారిన పడుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్ కారణంగా ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్ గురికావడాన్ని న్యూమోనియా అంటారు.
ఈ సమస్య ప్రధానంగా చలికాలంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐదేళ్లలోపు చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దవారిలో న్యూమోనియా రిస్క్ ఎక్కువగా ఉంది. న్యూమోనియా లక్షలు, నిర్ధారణ టెస్ట్‌లు, చికిత్సా పద్దతులు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలను బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్- ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ సునీల్ బోహ్రా మాటల్లో తెలుసుకుందాం.
* ప్రపంచవ్యాప్తంగా 1.5 నుంచి 14 కేసులు
స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా అనే ఒక రకమైన బ్యాక్టీరియా, ఇన్‌ఫ్లూ ఎంజా అనే వైరస్ న్యుమోనియాకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ప్రతి వెయ్యి మందిలో 1.5 నుంచి 14 మధ్య న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయి. న్యూమోనియా మరణాల రేటు ప్రపంచ వ్యాప్తంగా 14 నుంచి 30 శాతం ఉండగా, భారత్‌లో ఇది 23 శాతంగా ఉంది.
డాక్టర్ సునీల్ బోహ్రా (ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్- ఇంటర్నల్ మెడిసిన్)
* పెద్దవారు, పిల్లల్లో లక్షణాలు
పెద్దవారిలో న్యుమోనియా సాధారణ లక్షణాలుగా జ్వరం, చలి, శ్వాసలోపం, శ్వాస సమయంలో ఛాతీ నొప్పి, గుండె- శ్వాస రేటు పెరగడం, వికారం, వాంతులు, అతిసారం, తరచుగా ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కఫం పడేలా దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయి. పిల్లల్లో న్యూమోనియా లక్షణాలుగా డీహైడ్రేషన్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఆహారం సరిగ్గా తినలేకపోవడం, దగ్గు, జ్వరం, చిరాకు, దగ్గు తర్వాత వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
న్యుమోనియా మొదట్లో స్వల్పంగా ఉండవచ్చు. అయితే, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే సమస్య చాలా తీవ్రం అవుతుంది. ఇక, వైద్యుడిని సంప్రదించాల్సిన సందర్భాలు ఇలా ఉన్నాయి.
* కఫంతో కూడిన జ్వరం, దగ్గు కొంతకాలం పాటు ఉండి, మెరుగు పడకపోవడం లేదా మరింత తీవ్రం.
* రోజువారీ పనులు చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
* ఊపిరి పీల్చుకున్నప్పుడు ఛాతీ నొప్పి
* జలుబు లేదా ఫ్లూ నుంచి మెరుగైన తర్వాత పరిస్థితి అకస్మాత్తుగా తీవ్రమవ్వడం.
* అవయవ మార్పిడి లేదా స్టెమ్ సెల్ (ఎముక మజ్జ) మార్పిడి లేదా రోగనిరోధక శక్తిని అణిచివేసే మందులను తీసుకోవడం కారణంగా రోగనిరోదక శక్తి తగ్గడం.
* ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు.
* చిన్న పిల్లలు, లేదా 65 ఏళ్లు పైబడిన పెద్దవారు
* ముఖ్యంగా వృద్ధులలో శ్వాసకోశ లక్షణాలతో పాటుగా గందరగోళం ఏర్పడడం.
వ్యాధి నిర్ధారణ
న్యుమోనియాను సాధారణంగా మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఛాతీ ఎక్స్-రే తో పాటు బ్లడ్ టెస్ట్స్, కఫ(గల్ల) పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు. రోగుల పరిస్థితిని బట్టి CT స్కాన్, బ్రోంకోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు.
చికిత్స
కమ్యూనిటీ అక్వైజ్డ్ న్యుమోనియా ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులు, దానికి కారణమయ్యే జీవి రకం ఆధారంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్స్‌తో ఇంట్లోనే చికిత్స పొందవచ్చు. అయితే, తీవ్రమైన అనారోగ్యం బారిన వ్యక్తులను హార్ట్ బీట్ రేటు, శ్వాస రేటు, ఉష్ణోగ్రత- ఆక్సిజన్ స్థాయిల పర్యవేక్షణ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేరిన రోగులకు సాధారణంగా ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ చికిత్స అందిస్తారు. ఇలా మూడు నుంచి ఐదు రోజుల చికిత్స తర్వాత వారు కొంత మెరుగుపడతారు. సాధారణ జీవితం గడపడానికి వారికి మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
నివారణ
న్యుమోనియా, దాని ద్వారా వచ్చే సమస్యలను ముందుగానే నివారించడానికి టీకాలు వేయడం ఒక ముఖ్యమైన మార్గం. న్యుమోకాకల్ టీకా, ఇన్‌ఫ్లుఎంజా లేదా ఫ్లూ వ్యాక్సిన్ అనే టీకాలు వేస్తారు. ధూమపానం చేసేవారిలో న్యూమోనియా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీంతో దీని నివారణలో ధూమపానం మానేయడం ఎంతో కీలకమైన దశ. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్స్ వంటి ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు పాటించడం మేలు.
న్యుమోనియా లక్షణాలు ఉన్నవారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలి. దగ్గినప్పుడు వచ్చిన కఫం వెంటనే పారవేయాలి. తరచుగా చేతులు కడుక్కోవాలి. లాలాజలం, స్రావాలు ఇతరులకు వ్యాపించకుండా ఉంచడానికి రోగి తన మోచేతిని అడ్డం పెట్టుకుని లేదా దుస్తుల స్లీవ్‌లోకి తుమ్మడం లేదా దగ్గడం మంచిది.
ప్రాముఖ్యత
ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా నవంబర్ 12ను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. న్యుమోనియా లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించడం కోసం 2009లో నవంబర్ 12ను ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా ఆమోదించారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దల్లో న్యూమోనియా రిస్క్ ఎక్కువ. ప్రపంచ న్యుమోనియా దినోత్సవం -2022 థీమ్ 'న్యుమోనియాకు వ్యతిరేకంగా పోరాడటం'. ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసే ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రపంచం ఇంకా పోరాడుతోందనే విషయాన్ని ఈ థీమ్ సూచిస్తుంది.
0 Comments:
Post a Comment