దేశంలో ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల హవా నడుస్తోంది. భౌతిక కరెన్సీతో అవసరం లేకుండా ఫోన్ల ద్వారా ప్రజలు ఎక్కువగా పేమెంట్లు చేస్తున్నారు. UPI ప్రవేశపెట్టిన నాటి నుంచి వీటి సంఖ్య మరింత పెరిగింది.
వినియోగదారుల ఆదరణ పెరుగుతుండటంతో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు.. కేవలం బిల్ పేమెంట్లే కాకుండా పలు ఇతర సేవలను సైతం ప్రవేశపెట్టాయి.
ఈ రంగంలో మరింత ఎదగాలనే ప్రణాళికలతో నిధులను సమీకరిస్తూ ఫోన్ పే ముందంజలో ఉంది.
పెద్దఎత్తున క్యాపిటల్ సమీకరణ:
టైగర్ గ్లోబల్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ద్వారా 100 మిలియన్ డాలర్లను ఫోన్ పే సమీకరించింది. ఈ నిధులను తన చెల్లింపులు, బీమా వ్యాపారాల విస్తరణకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
రుణాలు ఇవ్వడం, స్టాక్ బ్రోకింగ్, ONDC-ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను సైతం ప్రారంభించడనికి సిద్ధపడుతోంది. లక్ష్యానికి అనుగుణంగా, దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.
మొన్న 350.. ఇప్పుడు మరో 100:
వ్యాపార విస్తరణ కోసం పెద్ద మొత్తంలో నిధులను సమీకరించడానికి ఫోన్ పే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గతేడాది అక్టోబరులోనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇందులో భాగంగా 'జనరల్ అట్లాంటిక్' నుంచి ఇటీవల 350 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది.
ఇది జరిగిన కొద్ది వారాలకే ఇప్పుడు మరో 100 మిలియన్ డాలర్లను సేకరించి అత్యంత విలువైన ఫిన్ టెక్ గా అవతరించింది.
GigIndia, WealthDesk, OpenQలను గతేడాది కొనుగోలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న IndusOS కొనుగోలును సైతం పూర్తి చేసింది.
UPIలో మార్కెట్ లీడర్:
డిజిటల్ లెండింగ్ యాప్ లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ (MeiTY) కొరడా ఝళిపిస్తున్న సమయంలో.. ఫోన్ పే రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
అయితే చైనీస్ లెండింగ్ యాప్ లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతోనే వాటిని నిషేధిస్తున్నట్లు ఫోన్ పే CEO సమీర్ నిగమ్ అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో తమకేమీ ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేశారు. 400 మిలియన్లకు పైగా వినియోగదారులతో UPI లావాదేవీల్లో మార్కెట్ లీడర్ గా ఫోన్ పే కొనసాగుతోంది. దేశంలో నెలవారీ జరుగుతున్న UPI చెల్లింపుల్లో 47 శాతం వాటా దీని సొంతం.
0 Comments:
Post a Comment