ఇంటర్నెట్ డెస్క్: ఖర్చులను అదుపు చేయాలని ప్రతి నెలా అనుకుంటాం. కానీ, నెల చివరికి వచ్చేసరికి ఖర్చులను నియంత్రించడంలో విఫలం అవుతుంటాం.
స్నేహితులతో కలిసి చేసుకునే చిన్న చిన్న పార్టీలు, పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాలు.. ఇలా భావోద్వేగాలతో తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసేస్తాం. షాపింగ్, ఆఫర్ల విషయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఖర్చును పెంచేస్తుంటాయి.
ఇది మితిమీరితే.. స్వల్ప, దీర్ఘకాలం కోసం చేసే పొదుపు/పెట్టుబడులు దెబ్బతింటాయి. ఆర్థిక భారం పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
బడ్జెట్‌కు కట్టుబడండి..
బడ్జెట్‌ను వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లతే ఖర్చులను నియంత్రించుకోవడం సులభం అవుతుంది. బడ్జెట్ అనేది కేవలం నెలవారీ ఖర్చుల కోసమే కాదు.
మీరు విహారయాత్రకు వెళ్లాలనుకున్నా, ఇంట్లో జరిగే చిన్న, పెద్ద ఫంక్షన్లు, స్నేహితులతో జరుపుకొనే పార్టీలు, షాపింగ్ వంటి విషయాల్లోనూ బడ్జెట్ వేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో బడ్జెట్‌ను దాటి ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ కంటే తక్కువకే ప్లాన్ చేయండి.
అప్పుడు పరిధి దాటకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మీరు టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారు. అందుకు మీరు నిర్ణయించుకున్న బడ్జెట్ రూ.1 లక్ష అయితే రూ.90 వేలలోనే ఖర్చులను ప్లాన్ చేయండి. టూర్ పూర్తి చేసుకుని వచ్చే సరికి అనుకోని ఖర్చుల కారణంగా మరో రూ.10 వేలు అయినా బడ్జెట్‌లోనే ఉంటారు.
హడావిడిగా కొనుగోళ్లు వద్దు..
షాపింగ్ కోసం ప్లాన్ చేసినదానికంటే ఎక్కువ మొత్తం ఖర్చుచేయడం.. తరచూ చేస్తుంటాం. దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా వేరే పనిమీద బయటకు వెళ్లినప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా నచ్చితే కొనేస్తాం. ధర గురించి పెద్దగా ఆలోచించం.
నెల చివరికి లెక్కలు వేసుకున్నప్పుడు గానీ అర్థం కాదు.. మనం బడ్జెట్‌కు మించి షాపింగ్ చేశామనే సంగతి. అందువల్ల ఖాళీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి షాంపింగ్ చేస్తే తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఖాళీ సమయాన్ని ఈ విధంగా వినియోగించుకోవడం వల్ల పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు.
తెలివిగా కొనుగోళ్లు..
ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, క్రమం తప్పకుండా కొనుగోలు చేసే వస్తువులు ఎక్కడ అనుకూలంగా లభిస్తున్నాయో తెలుసుకుని కొనుగోలు చేయండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే అలవాటు ఉన్నవారైతే నాలుగైదు యాప్స్‌ను పోల్చి చూసుకుని కొనుగోలు చేయండి. ఉచిత డెలివరీ, వారాంతపు ఆఫర్లు వంటివి చూసుకుని కొనుగోళ్లు చేయడం ద్వారా కొంత ఖర్చు తగ్గించుకోవచ్చు.
షాపింగ్ యాప్‌లను తరచూ చెక్‌చేయడం మానుకోండి..
మీ మొబైల్‌లో వివిధ సంస్థలకు సంబంధించిన షాపింగ్ యాప్‌లు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటాం. అయితే అవసరమైనప్పుడు మాత్రమే కాకుండా రోజువారీగా ఇచ్చే ఆఫర్ల గురించి మనలో చాలా మంది తనిఖీ చేస్తుంటారు.
షాపింగ్ యాప్‌లు సేల్స్ పెంచుకోవడం కోసం తరచూ ఏదో ఒక ఆఫర్ ఇస్తూనే ఉంటాయి. ఈ ఆఫర్ల కోసం కొనుగోళ్లు చేస్తే ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి తరచూ యాప్‌లు చెక్ చేసే అలవాటు మానుకోండి.
కుటుంబ సభ్యులతో పారదర్శకంగా..
కొంతమంది కుటుంబ సభ్యలకు ఎలాంటి లోటూ రాకూడదనే ఉద్దేశంతో అసలు ఆర్థిక పరిస్థితిని దాచి, అడిగిన ప్రతిదీ కొనిచ్చేందుకు చూస్తారు. దీంతో ఖర్చు పెరిగిపోతుంది. దీని ప్రభావం దీర్ఘకాల లక్ష్యాలపై పడుతుంది.
భవిష్యత్‌లో కుటుంబ సభ్యులు మరింత ఇబ్బంది పడాల్సి రావచ్చు. అందువల్ల ప్రస్తుత వాస్తవ పరిస్థితిని దాచకుండా కుటుంబ సభ్యులకు వివరంగా తెలియజేస్తే.. ప్రస్తుతం చిన్న చిన్న విషయాల్లో రాజీపడినా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు.
ఎక్కడ నియంత్రణ కోల్పోతున్నారో తెలుసుకోండి..
కొందరు షాపింగ్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తే.. మరికొంతమంది విందు, విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి, మీరు ఎలాంటి ఖర్చుల విషయంలో నియంత్రణ కోల్పోతున్నారో ముందుగా తెలుసుకుని, దశల వారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి.
ఖర్చులు అదుపు చేయలేకపోతే..
మితిమీరిన వ్యయాన్ని అధిగమించడానికి పొదుపు ఒక్కటే మార్గం. పొదుపు కోసమే ఒక కొత్త బ్యాంకు ఖాతాను తెరవండి. ప్రతి నెలా పొదుపు చేసిన మొత్తాన్ని ఇందులో వేయండి. దీనికి కొత్త డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేకుండా చూసుకోండి.
ప్రతి నెలా పొదుపు చేసిన మొత్తాన్ని ఇందులో వేయండి. డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ యాక్సెస్, యూపీఐ సదుపాయం ఉండదు కాబట్టి తొందరపాటుతో అప్పటికప్పుడు కొనుగోలు చేసే అలవాటు తగ్గుతుంది.
అధిక రాబడి కోసం..
డబ్బు పొదుపు ఖాతాలో ఉండడం వల్ల తక్కువ వడ్డీ వస్తుంది. కాబట్టి, మీ పొదుపు ఖాతాను 'స్వీప్' లేదా 'ఆటో స్వీప్' ఖాతాకు అనుసంధానించండి.
ఇలా చేయడం వల్ల మీ పొదుపు ఖాతాలో నిర్దిష్ట పరిమితికి మించి జమైన మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి అధిక వడ్డీనిచ్చే పెట్టుబడులకు బదిలీ చేస్తారు. దీంతో డబ్బు పొదుపు చేయగలుగుతారు. అలాగే, ఎక్కువ వడ్డీ పొందగలుగుతారు.
గుర్తుంచుకోండి..
అవసరానికి ఖర్చు చేయడంలో తప్పులేదు. కానీ, వృథా ఖర్చులు చేయడం మాత్రం మంచిది కాదు. మీరు ఎంత తక్కువగా ఖర్చు చేస్తారో.. అంత ఎక్కువగా పొదుపు చేయగులుగుతారు. ఇక పొదుపు చేసి పెట్టుబడులు పెట్టిన డబ్బు.. ఎప్పుడూ డబ్బును సంపాదించి పెడుతుంది.
0 Comments:
Post a Comment