వజ్రం.. ఈ పేరు వినగానే భారతీయులకు కోహినూర్ వజ్రం(diamond) గుర్తొస్తుంది. భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయన చర్య ఫలితంగా వజ్రం పుట్టుకొస్తుంది.
వజ్రాన్ని కార్బన్ ఘన మూలకంగా భావించొచ్చు. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో కనిపిస్తాయి. దీంతో వజ్రం గట్టిగా ఉంటుంది. ఇతర ఏ పదార్థాల్లో లేని ఉష్ణవాహకత సామర్థ్యం వజ్రంలో ఉంటుంది.
సహజంగా దొరికే వజ్రాల వయసు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. భూమిలో 150 నుంచి 250 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు.
అలాంటి వజ్రాలకు పోటీగా ఇప్పుడు కృత్రిమ వజ్రాలు చక చకా వారాల వ్యవధిలోనే తయారైపోతున్నాయి.
కృత్రిమ వజ్రం ఎలా తయారు చేస్తారు?
న్యూయార్క్(New York)లోని జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 1954లో తొలిసారి ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను(Laboratory Grown Diamonds) సృష్టించారు.
తరువాత అనేక పరిశోధనలు చేసి వాటి తయారీ వేగం పెంచడానికి రెండు పద్ధతులు కనుగొన్నారు. అవేంటంటే.. 1. అధిక పీడనం, అధిక ఉష్ణం(హెచ్‌పీహెచ్‌టీ) 2. రసాయన ఆవిరి నిక్షేపణ(సీవీడీ). ఈ రెండు పద్ధతులకు సీడ్ తప్పనిసరి. అంటే ఏదైనా ఇతర డైమండ్‌లోని కొంత భాగాన్ని సీడ్‌గా పేర్కొంటారు.
అధిక పీడనం, అధిక ఉష్ణం పద్ధతిలో సీడ్, స్వచ్ఛమైన గ్రాఫైట్ కార్బన్‌ను ఒక చోట ఉంచుతారు. వాటిని దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలాగే పీడనాన్ని కలిగిస్తారు. దాంతో కార్బన్ డైమండ్‌గా రూపాంతరం చెందుతుంది.
రసాయన ఆవిరి నిక్షేపణ విధానంలో కార్బన్ రిచ్ గ్యాస్ నింపిన ఛాంబర్లో సీడ్‌ను ఉంచి 800 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. దాంతో కార్బన్ డైమండ్‌గా మారుతుంది.
నాణ్యత ఎలా ఉంటుందంటే..
భూమిలో నుంచి తవ్వి తీసిన వజ్రాల్లాగే ల్యాబ్ వజ్రాలను డైమండ్ టెస్టర్‌తో పరీక్షిస్తారు. వాటిలోని కార్బన్ మిశ్రమం, ఉష్ణవాహకత ఇంచుమించు సహజ వజ్రాల్లానే ఉంటాయి. దృఢంగా ఉండటంతోపాటు, గీతలు కూడా పడవు. కిందపడినా పగిలిపోవు.
సహజంగా వజ్రాన్ని ఎలా కోస్తారో వీటిని కూడా అలాగే కోయాల్సి ఉంటుంది. యంత్రాల్లో వినియోగించే కొన్ని లోహాలు గట్టిదనం లేక విరిగిపోతుంటాయి. అటువంటి చోట కృత్రిమ వజ్రాలను వాడుతున్నారంటే వాటి దృఢత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.
కృత్రిమ వజ్రాలతో పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. విద్యుత్ తయారీ రంగంలోనూ స్వచ్ఛమైన సింథటిక్ డైమండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. హైపవర్ లేజర్ డయోడ్స్‌లో వాటిని ఉష్ణవాహకాలుగా వినియోగిస్తున్నారు.
కృత్రిమానికి డిమాండ్ ఉంటుందా?
సహజంగా.. అరుదుగా దొరికే వాటిపై ఉన్న వ్యామోహం కృత్రిమంగా దొరికే వాటిపై ప్రజలకు ఉండదు. పురాతన వజ్రం అనగానే ధనికులు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తుంటారు. కృత్రిమం అనగానే చిన్నచూపు చూస్తారు. నేటి రోజుల్లో వివాహ శుభకార్యాలకు బంగారం కొనడం సర్వ సాధారమైపోయింది.
దాంతో భిన్నంగా ఉండాలని కొందరు వజ్రాల ఉంగరం, వజ్రాల నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా కనీసం ఓ డైమండ్ ఉంగరమైనా సరే కొనుగోలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇలాంటి వారు కృత్రిమ వజ్రాలు ఎంపిక చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని తయారీదారులు పేర్కొంటున్నారు. అయితే సహజ వజ్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న కృత్రిమ వజ్రాల ధర భవిష్యత్తులో మరింత తగ్గిపోవచ్చనే ఊహాగానాలున్నాయి. దాంతో కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.
బడ్జెట్‌లో తీపికబురు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో(Union Budget) ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పరిశ్రమ వర్గాలకు తీపి కబురు చెప్పింది. భారీ ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Ministry of Finance) ప్రకటించారు.
డైమండ్ల తయారీలో ఉపయోగించే సీడ్స్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 5 శాతం నుంచి సున్నాకు తీసుకురావడంతో ఆ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
ఇదే రంగం అభివృద్ధిని కాంక్షిస్తూ ఐఐటీలు కృత్రిమ వజ్రాలపై పరిశోధనలు(research), అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొంటూ 5ఏళ్ల రీసెర్చ్ గ్రాంట్‌ను ప్రభుత్వం కేటాయించింది.
అసలు వజ్రాల వ్యాపారుల అసంతృప్తి
కృత్రిమ వజ్రాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించడంపై సహజ వజ్రాలు తయారు చేసే వ్యాపారులు అసంతృప్తిగా ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్ ప్రాంతం వజ్రాల వ్యాపారానికి పేరుగాంచింది. తమ వ్యాపారం దెబ్బతినే విధంగా ఆ ప్రకటన ఉందంటూ వారు కేంద్రానికి ఇటీవల వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతానికి వజ్రాల వ్యాపారంలో కృత్రిమ వజ్రాలకు ఆదరణ చాలా తక్కువగా ఉందని.. అలాంటి వ్యాపారానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం తగదని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ శ్యామ్ మెహ్రా, వైస్ ఛైర్మన్ రాజేశ్ రోక్డే తెలిపారు.
వజ్ర భారత్.. సూరత్
ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో వజ్రాల కోత, మెరుగు చేసే పరిశ్రమలున్నాయి. గుజరాత్‌లోని సూరత్ డైమండ్ల తయారీకి గ్లోబల్ హబ్‌గా నిలుస్తోంది. డైమండ్ల తయారీ పనిలో నిష్ణాతులుగా పేరు గడించి చాలా మంది ఉపాధి పొందుతున్నారు.
ప్రపంచంలోని మొత్తం డైమండ్ ఎగుమతుల్లో(exports) భారత్(India) వాటా 19శాతం ఉంది. 2021 సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే దిగుమతుల్లోనూ మనం ముందున్నాం.
ప్రస్తుతం కృత్రిమ వజ్రాల తయారీ పరంగా చూస్తే సగం వాటా చైనాదే ఉంది. దాంతో ఆ రంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి వృద్ధి సాధించాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తోంది.
0 Comments:
Post a Comment