Hydrogen: పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు మరియు అధిక కర్బన ఉద్గారాల కారణంగా గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది.
ఎలక్ట్రిక్ టెక్నాలజీతో పాటు హైడ్రోజన్ ఆధారిత ఇంధనం వినియోగం దిశగా భారత్ పయనిస్తోంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనమని వ్యాఖ్యానించారు.
పొరుగు దేశం చైనా ఇప్పటికే ఆసియాలో తొలి హైడ్రోజన్ రైలు నడపగా.. ఈ ఏడాది చివరి నాటికి మనం సైతం పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేశంలో తొలి ప్లాంట్:
ఇంధనంగా హైడ్రోజన్ వినియోగాన్ని ఇప్పుడిప్పుడే భారత్ అర్థం చేసుకుంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా ఘన వ్యర్థాల నుంచి హైడ్రోజన్ తయారీ ప్లాంట్ ను పూణేలో ఏర్పాటు చేయనున్నట్లు అక్కడి మున్సిపల్ అధికారులు తెలిపారు. రూ.430 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్లాంట్ ఏర్పాటుకు రూ.350 కోట్లు, లాజిస్టిక్స్ అవసరాలకు అదనంగా రూ.82 కోట్లు వెచ్చించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
సుదీర్ఘ ఒప్పందం:
ప్రతిరోజూ 350 టన్నుల ఘన వ్యర్థాలను శుద్ధి చేయనున్నట్లు 'ది గ్రీన్ బిలియన్స్ లిమిటెడ్ (TGBL)' వ్యవస్థాపకులు, ఛైర్మన్ ప్రతీక్ కనకియా తెలిపారు. ఈ మేరకు పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
30 ఏళ్ల సుదీర్ఘ కాలంపాటు సస్టైనబిలిటీ సొల్యూషన్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది నవంబరు నాటికి 10 టన్నుల రియాక్టర్, వచ్చే ఏడాది అదే సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
రోజూ 10 టన్నుల హైడ్రోజన్:
"350 టన్నుల ఘన వ్యర్థాల నుంచి రోజూ 10 టన్నుల హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలనేది మా ప్రణాళిక . ఇందుకోసం పూణేలోని హదప్సర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము .
భారత్ లో వ్యర్థాల నుంచి హైడ్రోజన్ వెలికితీసేందుకు మొదటి ప్రయత్నం ఇదే" అని ప్రతీక్ పేర్కొన్నారు. చెత్తను శుద్ధి చేసేందుకు టన్నుకు రూ.347 చొప్పున PMC టిప్పింగ్ ఫీజు చెల్లిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మున్సిపాలిటీలతోనూ ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
వివిధ సంస్థల సమిష్టి కృషితో..
పూణేలో ప్లాంట్ ఏర్పాటు కోసం PSU సంస్థ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ ను అందిస్తున్నట్లు TGBL ఛైర్మన్ తెలిపారు.
బాబా అటామిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సాంకేతిక మద్ధుతు ఇస్తున్నట్లు వెల్లడించారు. వారందరి సహకారంతో TGBL అనుబంధ సంస్థ 'వేరియట్ పూణే వేస్ట్ టు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్' ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుందన్నారు.
0 Comments:
Post a Comment