దిశ, ఫీచర్స్: మొగుడు.. మారుతున్నాడు. బాధ్యతలు పంచుకుంటూ సతికి సాయంగా ఉంటున్నాడు. 'సక్సెస్‌ఫుల్ వైఫ్ వెనుక ఎంకరేజింగ్ హజ్బెండ్' ఉన్నాడని రుజువు చేస్తున్నాడు.
ఇల్లాలు ఇంటి పనులకు పరిమితమయ్యే కాలం చెల్లిపోయిందని పితృస్వామ్య సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడు. సతీమణి ఆశలు, ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి అడుగులో తోడుంటానని హామీ ఇస్తున్నాడు.
భర్త చెప్పినట్లుగా భార్య వినాలన్న సంస్కృతికి చరమగీతం పాడుతూ 'హజ్బెండ్ అండ్ వైఫ్'.. బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉండాలని సూచిస్తున్నాడు. కాలం మారుతోంది.. ఆమె మారింది.. అతను కూడా మారాల్సిన అవసరాన్ని గుర్తించాలంటున్నాడు. భార్యకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమంటూ ఈ విషయంలో ప్రపంచాన్ని మార్చే పనిలో నిమగ్నమయ్యాడు అర్బన్ హజ్బెండ్.
సపోర్టింగ్ హజ్బెండ్
హెల్తీ మ్యారేజ్‌కు వర్క్ అండ్ ఎఫర్ట్ కచ్చితంగా అవసరం. భార్య పాత్ర ఎంత ముఖ్యమో భర్త పాత్ర కూడా అంతే ముఖ్యం. భార్యాభర్తలకు నిర్ణీత విధులు, బాధ్యతలు ఉంటాయి.
ఇవి విషయాలను సులభతరం చేయడానికి సహాయపడుతాయి. పూర్వ కాలంలో పురుషుడు సంపాదించుకొస్తే.. స్త్రీ ఇంటిని చక్కదిద్దాలి. అంటే ప్రాచీన కాలం నుంచి స్త్రీ తమ పురుషునికి మద్దతుగా నిలిచింది. అతని కెరీర్ వృద్ధికి తోడ్పడింది.
కానీ ఇప్పుడు మహిళలకు అవకాశాలు భారీగా ఉన్నాయి. మద్దతు కోసం భర్త వైపు చూస్తోంది. తను జాబ్ చేస్తున్నప్పుడు ఇల్లు, కుటుంబం బాధ్యతలను పంచుకోవాలని కోరుతోంది.
ఈ క్రమంలోనే నేడు స్త్రీ, పురుషులు తమ పాత్రలను ఎక్స్‌చేంజ్ అండ్ షేర్ చేసుకుంటూ శాంతియుత సంసారాన్ని కొనసాగిస్తున్నారు. భర్త.. తన భార్య ఎడ్యుకేషన్, ప్రొఫెషన్‌ను గౌరవిస్తున్నాడు.
అంతెందుకు తాజాగా పడిన గ్రూప్స్ జాబ్స్‌లో మహిళలకు ఎక్కువ అవకాశాలున్నాయని ఎంకరేజ్ చేస్తున్న భర్తలు లక్షల్లో ఉంటే.. పెళ్లయ్యాక భార్యలను చదివించుకుంటున్న భర్తలు కూడా చాలా మందే. ఈ క్రమంలో ఇంట్లో పనుల బాధ్యతను ఆమెకే వదిలేయకుండా.. తను చూసుకుంటున్నాడు.
ఆఫీస్ క్యాబిన్ టు హోమ్ కిచెన్
సాధారణంగా భర్తలకు భార్యలు వండిపెట్టడం.. పొద్దున్నే లేచి ఆఫీసుకు వెళ్లే భర్తకు క్యారేజీలు రెడీ చేయడం చూశాం. కానీ నేడు భర్త ఈ పని చేసేందుకు వెనకాడట్లేదు. మార్నింగ్ షిఫ్ట్‌కు వెళ్లే భార్యకు క్యాబ్ వచ్చే లోపు ఫుడ్ రెడీ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు.
వైఫ్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సరికి డైనింగ్ టేబుల్‌పై డిన్నర్ రెడీ చేస్తున్నాడు. మూవీస్, షాపింగ్, ఫ్రెండ్స్‌తో చాటింగ్, మీటింగ్ అన్నింటిలోనూ నమ్మకంగా ఉంటున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ అందించేందుకు ముందుకొస్తున్నాడు.
ఫ్యామిలీతో వెకేషన్స్, పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ అన్నింటిలోనూ ఆమె చాయిస్‌ను రిజెక్ట్ చేయడం మానేసి యాక్సెప్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. మొత్తానికి 'భార్యకు ఏం తెలుసు?' అని తక్కువగా చూసే స్థాయి నుంచి 'భార్యకు తెలుసు' అని తన పక్కనే చోటిచ్చే భర్తగా మారాడు.
ఫ్రెండ్లీ ఫాదర్
పిల్లల విషయంలోనూ అంతే కేరింగ్‌గా ఉంటున్నాడు. భార్య తన వర్క్‌లో బిజీగా ఉంటే.. స్కూల్‌కు తీసుకెళ్లడం, వారికి స్నానాలు చేయించడం, యూనిఫామ్ రెడీ చేయడం, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం నుంచి బుక్స్ కొనివ్వడం, స్కూల్ నుంచి తీసుకురావడం, స్నాక్స్ అందించడం, హోమ్ వర్క్‌లో హెల్ప్ చేయడం వరకు అన్నీ చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలో తల్లి కన్నా తండ్రే బిడ్డలకు దగ్గరవుతున్నాడు. వారికీ ఓ ఫ్రెండ్‌గా మారిపోతున్నాడు. ఇంతకు ముందు తల్లి చుట్టే తిరిగే పిల్లలు.. ఈ జనరేషన్‌లో తండ్రితో ఎక్కువ క్లోజ్ అవుతున్నారు. ఇక ఇంట్లో కీలక నిర్ణయాలు ఆమె తీసుకుంటున్న కాలం కూడా వచ్చేసినట్లే ఉంది.
కాబట్టి పిల్లలకు మంచి-చెడు చెప్పే క్రమంలో కాస్త కఠినంగానే ఉంటున్న అమ్మ కన్నా నాన్నకే ఎక్కువ దగ్గర అవుతున్నారు. ఇంట్లో నిర్ణయాధికారం భార్యకు అప్పగించారంటే.. ఆమె డెసిషన్ మేకింగ్‌పై భర్తకు ఎంత నమ్మకం ఉంది అనేది ఇక్కడ గుర్తించాల్సిన విషయం.
ఇద్దరమూ సమానమే..
ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు ఇంటిపనులు షేర్ చేసుకోవడం తప్పనిసరి. పిల్లలను చూసుకోవడంలో చాలా హ్యాప్పీనెస్ ఉంటుంది. అందుకే ఇంటిపనులు ఆడవాళ్లే చేయాలనుకోవడం ఇప్పటి జనరేషన్‌కు సూట్ కాదు. ఆర్థికపరమైన అంశాల్లోనూ ఇద్దరమూ కలిసే నిర్ణయాలు తీసుకుంటాం.
-ఆదిత్య, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
బాధ్యతలతో మరింత అనుబంధం
ఆఫీసులో లేటు అయినా.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా ఇంటి పనుల్లో సహాయం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల పిల్లల పెంపకంలోనూ ఇద్దరి సహకారం అవసరంగా మారింది. ఇంటి విషయాల్లో నా భర్త పూర్తిగా సహకరించడం వల్లనే ఉత్సాహంగా ఉద్యోగంలో కొనసాగుతున్నాను.
0 Comments:
Post a Comment