ఏసీబీ వలలో ప్రధానోపాధ్యాయురాలు
మన బస్తీ - మన బడి'బిల్లు చెల్లింపునకు లంచం డిమాండ్ ●పాఠశాలలోనే డబ్బు తీసుకుంటూ పట్టుబడిన వైనం ●అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మధిర: నీతి, నిజాయితీ, విలువలపై విద్యార్థులకు బోధించాల్సిన వృత్తిలో కొనసాగుతున్నారు.
పాఠాలు చెప్పడమే కాక పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే ప్రధానోపాధ్యాయురాలి పదవిలో ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా రాష్ట్రప్రభుత్వం మన బస్తీ - మన బడి ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాల్సిన ఆమె... పనులు చేసిన కాంట్రాక్టర్‌కు చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి పాఠశాలలోనే డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
కమీషన్ ఇస్తేనే సంతకం..
మధిరలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మన బస్తీ - మన బడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులను విద్యా కమిటీ చైర్మన్ ఎస్.కే.ఫాతిమా సిఫారసుతో కాంట్రాక్టర్ మునుగోటి వెంకటేశ్వరరావు దక్కించుకున్నారు. మొత్తం పనుల విలువ రూ.23,82,059 కాగా, ఇప్పటివరకు సుమారు రూ.14 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇక ఈనెల 3వ తేదీన రూ.7,88,446 చెక్కు వచ్చింది. ఈ చెక్కుపై ఎస్‌ఎంసీ చైర్మన్‌తో పాటు హెచ్‌ఎం మాతంగి శ్రీలత సంతకం చేయాల్సి ఉంది. అయితే, సంతకం చేయాలంటే మొత్తం రూ.23,82,059 విలువైన పనులకు గాను రెండు శాతం కమీషన్ రూ.48వేలకు రూ.2వేలు కలిపి రూ.50వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావును డిమాండ్ చేశారు.
ఇరవై రోజులు ఆలస్యంగా...
పనులకు సంబంధించి రూ.7.88లక్ష చెక్కు ఈనెల 3న వచ్చినా హెచ్‌ఎం శ్రీలత సంతకం చేయడం లేదు. తనకు రూ.50వేలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఒకేసారి అంత మొత్తం ఇవ్వలేనని కాంట్రాక్టర్ చెప్పడంతో రెండుసార్లు రూ.25వేలు చొప్పున ఇవ్వాలని ఆఫర్ ఇచ్చారు. ఈమేరకు కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం అధికారుల సూచనల మేరకు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ హెచ్‌ఎం వాయిస్ రికార్డు చేసి సమర్పించారు. మొదటి విడతగా హెచ్‌ఎం శ్రీలతకు రూ.25వేలు ఇవ్వాలంటే చెక్కు మార్చాల్సి ఉందని చెప్పడంతో ఈనెల 23న హెచ్‌ఎం సంతకం చేసి చెక్కు ఇచ్చారు. ఇక శనివారం ఏసీబీ అధికారుల కనుసన్నల్లో వెంకటేశ్వరరావు తన కుమారుడు రాముకు డబ్బు ఇచ్చి పంపించాడు.
రంగు అంటుతోంది ఏమిటి?
కాంట్రాక్టర్ కుమారుడు రాము రూ.25వేల నగదుతో శనివారం పాఠశాలకు వచ్చి కార్యాలయ గదిలో ఉన్న హెచ్‌ఎం శ్రీలత చేతికి ఇచ్చాడు. ఈక్రమంలో ఆమె డబ్బులు లెక్కిస్తూ చేతికి రంగు అంటుతుందేమిటని ఆరా తీసింది. అయితే, తమ ఇంట్లో ఫంక్షన్ జరగగా పసుపు, కుంకుమ అంటి ఉండొచ్చని చెబుతూ మొత్తం తతంగాన్ని వీడియో తీశాడు. అదే సమయానికి ఏసీబీ అధికారులు గదిలోకి ప్రవేశించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన హెచ్‌ఎం తనను రోజుల తరబడి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అందుకే ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్టర్ కుమారుడి నుంచి మధిర బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీలత లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ఆతర్వాత ఆమె నివాసాల్లో కూడా తనిఖీలు చేశామని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి హెచ్‌ఎంను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
0 Comments:
Post a Comment