అది 16వ శతాబ్దం, మాల్వా రాజ్యం.
నేటి దిల్లీకి దక్షిణంగా 700 కి.మీ దూరంలో, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల సంగమం వద్ద ఈ చారిత్రక ప్రదేశం ఉంది.
ఇక్కడ నర్మదా నది ప్రవహిస్తుందని, ఎల్లప్పుడూ సంగీతం వినిపించేదని రచయిత మాలతి రామచంద్రన్ వర్ణిస్తారు.
ఒకనాడు నది వెంబడి వెళుతున్న బాజ్ బహదూర్‌కు ఒక కమ్మని గొంతు వినిపిస్తుంది. పాటలోని మాధుర్యంతో పాటు ఆ గాలి మల్లెపువ్వుల పరిమళాన్ని కూడా మోసుకొచ్చింది. ఆలాపన వినిపిస్తున్న వైపు కదిలాడు బాజ్ బహదూర్.
ఒక పెద్ద చెట్టు కింద సంగీతం పాడుతున్న ఒక అమ్మాయిని చూశాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. తానూ స్వరం కలిపాడు. ఆ గానంలో లీనమైపోయాడు.
బాజ్ బహదూర్ అనేది మియా బాయజీద్ రాచరికపు పేరు. అతడు మధ్య భారతదేశంలోని మాల్వా రాజ్యానికి రాజు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవాడు.
బాయజీద్ 'అద్వితీయ గాయకుడు' అని చరిత్రకారుడు అబుల్ ఫజల్ అభివర్ణిస్తారు.
చెట్టు కింద కూర్చుని పాడుతున్న అమ్మాయి అందానికి, స్వరానికి ముగ్ధుడైపోయాడు బాజ్ బహదూర్. అతికష్టం మీద ఆ అమ్మాయి పెదవి విప్పి తన పేరు చెప్పింది.. రూపమతి.
ఒక జానపథ కథ ప్రకారం, బాజ్ బహదూర్ రూపమతి దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తాడు.
"రీవా (నర్మద) మాండూ గుండా ప్రవహించినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని ఆమె జవాబిస్తుంది.
వెంటనే బాజ్ బహదూర్ నదిలోకి దిగి, అక్కడికి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న మాండూ గుండా ప్రవహించమని నర్మదా నదిని వేడుకుంటాడు.
నది, అతడిని తన రాజధానికి తిరిగి వెళ్లమని చెబుతుంది. అతడి రాజ్యంలో ఒక విశేషమైన, పవిత్రమైన చింత చెట్టు ఉందని, దాని కింద భూమి అడుగున చెట్టు వేళ్లను తాకుతూ నీటి ప్రవాహం కనిపిస్తుందని, అది రీవా నది పాయ అని చెబుతుంది.
బాజ్ బహదూర్ ఆ చింత చెట్టును వెతికి పట్టుకుంటాడు. దాని కింద తవ్వి నీటిని కనుగొంటాడు. ఆ నీటితో ఒక సరస్సు నింపుతాడు. ఆ సరస్సుకు రీవా కుండ్ అని పేరు పెడతాడు. అలా రూపమతి కోరిక నెరవేరుస్తాడు.
నర్మదా నదిపై రాణి రూపమతి ప్రేమ
మాలతి రామచంద్రన్ తన పరిశోధన పుస్తకంలో బాజ్ బహదూర్, రాణి రూపమతిల ప్రేమగాధ గురించి రాశారు.
బాజ్ బహదూర్ రూపమతిని తనతో పాటు రాజభవనానికి రమ్మని కోరాడు. ప్రతిరోజూ నర్మదా నదిని చూసే అవకాశం ఉంటేనే వస్తానని ఆమె చెప్పింది.
రూపమతికి వాగ్దానం చేశాడు రాజు. రాజభవనంలో రెండు పెద్ద గోపురాలను నిర్మించాడు. అక్కడి నుంచి రాణి రూపమతి రోజూ నర్మదా నదిని చూస్తూ ఉండేది.
బాజ్ బహదూర్ మొదటి చూపులోనే రూపమతిని ప్రేమించిన సంగతి, వారి వివాహం, రూపమతికి నర్మదా నది మీదున్న ప్రేమ గురించి అనేక పుస్తకాల్లో చరిత్రకారులు రాశారు.
1599లో అహ్మద్ అల్ ఉమ్రీ రాసిన పుస్తకంలో ఈ సంఘటనల గురించి వివరంగా రాశారు.
ఎల్ఎం కరమ్ప్ ఆ పుస్తకాన్ని 1926లో 'ది లేడీ ఆఫ్ ది లోటస్: రూపమతి, క్వీన్ ఆఫ్ మాండూ, ఏ స్ట్రేంజ్ టేల్ ఆఫ్ ఫైత్‌ఫుల్‌నెస్'గా అనువదించారు.
ఇదే కాకుండా, మొహమ్మద్ హుస్సేన్ ఆజాద్ 'దర్బార్-ఎ-అక్బరీ'లో ఇలా రాశారు.
"రూపమతి ఎంత అందగత్తె అంటే బహదూర్ ఆమెకు దాసుడయ్యాడు. ఆమె హాస్య చతురత, కవిత్వం, ఆట పాటలు ఆమె అందానికి వన్నె తెచ్చేవి. ఆమె ఎప్పుడూ పున్నమి నాటి వెన్నెలలా వెలుగుతూ ఉండేది."
రూపమతి గొప్ప సంగీత విద్వాంసురాలుగా, కవయిత్రిగా పేరుగాంచిన రాణి అని కరమ్ప్ అంటారు. భీమ్ కళ్యాణ్ రాగం ఆమె సృజనే.
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు సయ్యద్ బషీర్ హసన్ తన పరిశోధన గ్రంధం 'మాల్వా అండర్ ది మొఘల్స్'లో రూపమతి కవిత్వం గురించి రాశారు.
రూపమతి రాసిన 26 కవితలు అల్ ఉమ్రీ రాసిన పుస్తకంలో ఉన్నాయి. ఒక కవిత ఇలా సాగుతుంది..
"ప్రేమ తాలూకా ఎత్తులను అధిరోహించడం కష్టం
కొమ్మలు లేని ఖర్జూరం చెట్టు ఎక్కినట్టు ఉంటుంది
అదృష్టవంతులు ఫలాలను చేరుకుంటారు
దురదృష్టవంతులు నేలమీద పడతారు."
రూపమతి, బాజ్ బహదూర్‌ల ప్రేమకథ
ముస్లిం, హిందూ ఆచారాల ప్రకారం వీరిరువురూ 1555లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆరు సంవత్సరాలు సంతోషంగా జీవించారు.
బాజ్ బహదూర్ రోజులో ఎక్కువ సమయం రూపమతితో గడిపేవాడని, ఆమె కూడా బహదూర్ పట్ల ఎనలేని అనురాగం కనబరిచేదని డాక్టర్ తహజీబ్ ఫాతిమా రాశారు.
ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. బహదూర్, రూపమతితో ఎంత లోతు ప్రేమలో కూరుకుపోయాడంటే, రాజ్య వ్యవహారాలు కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు.
"షేర్షా సూరి కుమారుడు సలీం షా సూరి రాజ్యంలోని బలవంతుడైన అమీర్ (పాలకుడు) దౌలత్ ఖాన్.. బాజ్ బహదూర్‌పై దండెత్తాలనుకున్నాడు.
అయితే, యుద్ధాన్ని నివారించేందుకు బాజ్ బహదూర్ తన తల్లిని, ఇతర పాలకులను రాయబారం పంపి, ఉజ్జయిని, మాండూ సహా కొన్ని ప్రాంతాలను దౌలత్ ఖాన్‌కు ఇచ్చేశాడు.
తరువాత, బాజ్ బహదూర్.. దౌలత్ ఖాన్‌ను మరో కారణంతో చంపి అతడి తలను సారంగపూర్ నగర ద్వారానికి వేలాడదీశాడు. అంతకుముందు దౌలత్ ఖాన్‌కు అప్పగించిన తన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే, రాయ్‌సేనా, భలేర్ నగరాలను కూడా ముట్టడించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. దీని తరువాత, మళ్లీ బాజ్ బహదూర్ తన భోగావిలాసాలలో మునిగిపోయాడు" అని డాక్టర్ తహజీబ్ ఫాతిమా తన పరిశోధనా గ్రంధంలో రాశారు.
దాంతో, రాజ్యంలో పరిస్థితి అల్లకల్లోలమైంది. బహదూర్ పాలన వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడంతో జాగీర్దార్‌లు, అధికారులు ప్రజలను పీడించడం మొదలుపెట్టారు.
మరోవైపు, మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్ దృష్టి మాల్వా మీద పడింది.
1561 మార్చిలో అక్బర్, మహమాంగా కుమారుడు అధమ్ ఖాన్‌ను సైన్యంతో మాల్వా మీదకు పంపాడు. మొఘల్ సైన్యం సారంగపూర్‌కు చేరుకుంది.
ఈ విషయం తెలిసిన బాజ్ బహదూర్ సారంగపూర్ నుంచి మూడు కోసుల దూరంలో తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
కానీ, అధమ్ ఖాన్ వీరత్వం ముందు బహదూర్ ఓడిపోయాడు. దక్షిణం వైపు పారిపోయి నర్మదా, తపతి నదుల గుండా ఖాందేశ్ చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాంతం మహరాష్ట్రలో ఉంది.
విషం తాగిన రూపమతి
మహ్మద్ హుస్సేన్ ఆజాద్ ఇలా రాశారు.
"బాజ్ బహదూర్ సుసంపన్నమైన రాజు. అతడి రాజ్యం అపార సంపదతో తులతూగేది. రాజమందిరంలో వజ్రాభరణాలకు కొదవలేదు. రాజ్యంలో వేల ఏనుగులు ఉండేవి. అరేబియా, ఇరానియన్ గుర్రాలతో అశ్వశాలలు నిండి ఉండేవి.
ఇంత అపారమైన సంపద చేజిక్కినందుకు అధమ్ ఖాన్ సంతోషానికి అవధులు లేవు. కొన్ని ఏనుగులను అక్బర్‌కు పంపించాడు. దానితో పాటు ఒక అభ్యర్థన కూడా పంపాడు. మాల్వా రాజ్యానికి పాలకుడిగా అక్కడే తిష్టవేశాడు.
రాణి రూపమతి అందం, సద్గుణాల గురించి విన్నాడు. ఆమెకు ఒక సందేశం పంపించాడు. 'ప్రజలను బాధించవద్దు. బాజ్ బహదూర్ వెళ్లిపోయాడు. అంతా అయిపోయింది. నా హృదయం ముక్కలైపోయింది' అని ఆమె జవాబిచ్చింది."
అధమ్ ఖాన్ ఊరుకోలేదు. మళ్లీ రాయబారం పంపాడు. తాను తప్పించుకోలేనన్న విషయం రూపమతికి అర్థమైంది. అధమ్ ఖాన్ రాయబారాన్ని రెండు, మూడు సార్లు నిరాకరించిన తరువాత, చివరికి కలుస్తానని మాటిచ్చింది.
ఆ రోజు రానే వచ్చింది. రాణి రూపమతి ఉదయాన్నే లేచి అందంగా సింగారించుకుంది. పువ్వులు పెట్టుకుంది, నవ్వుతూ తుళ్లుతూ పాన్పు పైకి చేరింది. కాళ్లు చాపుకుని పడుకుంది.
అక్కడ అధమ్ ఖాన్ గడియారంలో గంటలు లెక్కెడుతున్నాడు. ఇక ఆగలేక, అనుకున్న సమయానికి ముందే స్వయంగా రాణి దగ్గరకు వెళ్లాడు.
రాణి రూపమతి లేవలేదు. అంతకుముందే విషం తాగి నిద్రలోకి జారుకుంది. అలాగే ప్రాణాలు విడిచింది.
రూపమతిని సారంగపూర్‌లోనే సమాధి చేశారు.
అక్బర్ ఈ ఘటనలకు సంబంధించి అధమ్ ఖాన్‌పై కోపంగా ఉన్నాడు. అనంతరం, మరో కారణంతో అధమ్ ఖాన్‌ను చంపాడు.
ఆ తరువాతే, బాజ్ బహదూర్ మొఘల్ చక్రవర్తి ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అక్బర్ చక్రవర్తి రాజ్యంలో తన సేవలు కొనసాగించాడు. చివరికి, బాజ్ బహదూర్ చనిపోయాక, తన ప్రియురాలి సమాధి పక్కనే ఆయనకూ సమాధి కట్టించారు.
0 Comments:
Post a Comment