✍️ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయాలనుకుంటున్నారా?
♦️అందుకే షోకాజ్ నోటీసిచ్చినట్లు కనిపిస్తోంది
♦️మీ చర్య భావప్రకటన స్వేచ్ఛపై దాడే
♦️హైకోర్టు అభ్యంతరం
♦️షోకాజ్ నోటీసు అమలు నిలుపుదల..
♦️గుర్తింపు రద్దుపై చర్యలొద్దు
♦️ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక ఉత్తర్వులు
🌻ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి, మీడియాతో మాట్లాడిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసివ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దాన్ని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ భావప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించింది. సంఘం గుర్తింపు రద్దు కోసం ముందుగా నిర్ణయించుకొని షోకాజ్ నోటీసిచ్చినట్లుందని వ్యాఖ్యానించింది. నోటీసివ్వడానికి కారణాలేంటో పేర్కొనలేదని ఆక్షేపించింది. ఈ ఏడాది జనవరి 23న జారీ చేసిన షోకాజ్ నోటీసు అమలును నిలుపుదల చేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు.. ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని స్పష్టం చేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరపాలని పేర్కొంది. మూడు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, తర్వాత రెండు వారాల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను మార్చి 23కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలవడం, మీడియాతో మాట్లాడిన వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు.
♦️న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తే నోటీసులా?
‘ఫైనాన్షియల్ కోడ్, 1990 ఏప్రిల్‌లో ఇచ్చిన జీవో ప్రకారం ప్రతి నెలా చివరి రోజు ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వడం లేదు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.413 కోట్లను వారికి తెలియకుండానే వివిధ పథకాలకు మళ్లించింది. ఉద్యోగులకు జీతాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులకు వినతులిచ్చినా చర్యల్లేవు. చివరి ప్రయత్నంగా గవర్నర్‌ను కలిసి విన్నవించాం. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాకు షోకాజ్ నోటీసిచ్చింది. వివరణ ఇవ్వకపోతే వారంలో సంఘం గుర్తింపును ఉపసంహరిస్తామని పేర్కొంది. మేం ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. షోకాజ్ నోటీసులోనూ కారణాలను పేర్కొనలేదు. మా సంఘం గుర్తింపును ఉపసంహరించాలనే ఉద్దేశంతోనే నామమాత్రంగా నోటీసిచ్చారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం తీసుకున్నా, సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా కూడా గొంతెత్తకూడదా? వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నోటీసు ఆధారంగా తదుపరి చర్యలను నిలువరించండి’ అని కోరారు.
♦️షోకాజ్ నోటీసును సవాలు చేయలేరు: జీపీ
సాధారణ పరిపాలనశాఖ (సర్వీసు సంక్షేమం) కార్యదర్శి తరఫున జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. షోకాజ్ నోటీసును సవాలు చేయడానికి వీల్లేదన్నారు. వివరణ అందాక తగిన ఉత్తర్వులిస్తామన్నారు. గవర్నర్‌కు వినతి ఇస్తే తప్పులేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై మీడియాతో మాట్లాడటంపై అభ్యంతరం ఉందన్నారు. కొన్ని అంశాల్ని గోప్యంగా ఉంచాలన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment