Good Morning Drinks | రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఉదయం పూట ఇలాంటి పానీయాలు తాగాలి!
Good Morning Drinks: ఉదయాన్నే మనమంతా 'గుడ్ మార్నింగ్' అని చెప్పుకుంటాం. అంటే ఉదయం పూటా బాగుంటే, ఆ రోజంతా కూడా బాగానే గడుస్తుంది అనే అర్థాన్ని సూచిస్తుంది.
కాబట్టి ఉదయం లేచిన తర్వాత రోజుకి సరైన ప్రారంభాన్ని ఇవ్వాలంటే మంచి శక్తివంతమైన అల్పాహారం ఇవ్వాలి, సాధారణంగా తాగే కాఫీ, టీలకు బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలు అందించాలి. పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఒక గ్లాసు ఆరోగ్యకరమైన పానీయం తాగటం ద్వారా ఉదయం పూట రిఫ్రెషింగ్ గా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. మరి అలాంటి గుడ్ మార్నింగ్ డ్రింక్స్ ఏవో కొన్నింటిని ఇక్కడ చూడండి.
తేనే- దాల్చిన చెక్క పానీయం
ఉదయం లేవగానే ఒక గ్లాసు తేనె, దాల్చిన చెక్క పానీయం తాగండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె, ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి త్రాగాలి. ఇది తేలికైనది, మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. మీ కడుపును క్లియర్ చేస్తుంది.
నిమ్మరసం
ఒక గ్లాసు నిమ్మరసం సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇది ఉదయం వేళ టీ లేదా కాఫీకి కూడా గొప్ప ప్రత్యామ్నాయం. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి, రుచి కోసం కొంచెం తేనెను కూడా కలపవచ్చు.
దాల్చిన చెక్క గ్రీన్ టీ
గ్రీన్ టీ తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ, కడుపు సమస్యలను నివారించడానికి, మీరు మీ గుడ్ మార్నింగ్ డ్రింక్‌గా ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ రుచి ఇష్టం లేకపోతే అందులో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి అప్పుడు ఆ పానీయాన్ని ఆస్వాదించండి.
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు చాలా ఆరోగ్యకరమైన పానీయం. అప్పుడప్పుడూ ఉదయం పూట కొబ్బరి నీరు తాగండి. ఇది మీకు మార్నింగ్ ఎనర్జీ డ్రింక్‌గా మాత్రమే కాదు, మీ శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేసే రుచికరమైన పానీయం. సాదా కొబ్బరి నీరు తాగండి, ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేదు.
కలబంద రసం
చాలా రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులు కలబంద ఆధారితమైనవే ఉంటాయి. ఉదయం పూట కలబంద జ్యూస్ తాగటం ఉత్తమమైనది. ఈ పానీయం ఉదయాన్నే తాగిన తరువాత, మీ శరీరం తక్షణమే చైతన్యం అవుతుంది. మీరు మీ రోజును ప్రారంభించడానికి శక్తివంతంగా ఉంటారు. అంతేకాకుండా, చర్మ సమస్యలు అన్నీ పోయి, మెరిసే చర్మం వస్తుంది.
దోసకాయ పుదీనా నీరు
దోసకాయ పుదీనా నీరు మంచి డిటాక్సింగ్ డ్రింక్. మీ శరీరం నుండి మలినాలను, విషపదార్థాలను తొలగిస్తుంది. ఉదయం పూట మిమ్మల్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. మీ ఆరోగ్యకరమైన ఉదయం దినచర్యకు ఇంతకంటే మంచి డ్రింక్ ఉంటుందా? ముఖ్యంగా వేసవిలో పుదీనాతో మిళితమైన దోసకాయ డ్రింక్ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.
ప్రతిరోజూ ఉదయం పూట ఇలాంటి ఏదైనా ఒక పానీయం తాగటం ద్వారా మీరు రోజంతా చురుకుగా, హుషారుగా ఉంటారు.
0 Comments:
Post a Comment