వాషింగ్టన్: ఉద్గారాలు(Emissions) తగ్గినప్పటికీ.. రానున్న 10- 15 ఏళ్లలో భూతాపం(Global Warming) పెరుగుదల 1.5 డిగ్రీలు దాటుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.
రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఒకవేళ ఉద్గారాల విడుదల అధికంగా ఉంటే.. ఈ శతాబ్దం మధ్య నాటి(2050)కే భూతాపం పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోల్చితే సగటున రెండు డిగ్రీలు పెరిగే అవకాశం రెండింట ఒకవంతుగా ఉందని అధ్యయనం అంచనా వేసింది.
2060 నాటికి ఐదింట నాలుగువంతుల కంటే ఎక్కువ అవకాశం ఉందని తెలిపింది. 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా సేకరించిన ఇటీవలి ఉష్ణోగ్రతల వివరాలను ఉపయోగించి కృత్రిమ మేధ(AI) సాయంతో భవిష్యత్తు వాతావరణ మార్పులను ఇందులో అంచనా వేశారు.
భవిష్యత్తు వాతావరణ మార్పుల అంచనా విషయంలో పూర్తిగా కొత్త విధానాన్ని ఉపయోగించి ఈ అధ్యయనాన్ని రూపొందించినట్లు ప్రధాన రచయిత, అమెరికా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త నోహ్ డిఫెన్‌బాగ్ చెప్పారు.
కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త, అధ్యయన సహ రచయిత ఎలిజబెత్ బర్న్స్‌తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. '
ఒకవేళ నెట్-జీరో ఉద్గారాల స్థాయికి చేరుకునేందుకు మరో అర శతాబ్దం పట్టినట్లయితే.. అప్పటికి భూతాపం 2 డిగ్రీల సెల్సియస్ మించిపోయే అవకాశం ఉంది' అని తమ ఏఐ మోడల్ అధ్యయనంలో తేలిందన్నారు.
తాజా అధ్యయనంలో పరిశోధకులు 'న్యూరల్ నెట్‌వర్క్' అనే కృత్రిమ మేధ ఉపయోగించారు.
0 Comments:
Post a Comment