📚✍️టీచర్లకు గుడ్‌బై✍️
♦️ఇక ఎన్నికల డ్యూటీ సచివాలయ సిబ్బందికి!
♦️ఎన్నికల విధుల నుంచి1.91 లక్షల మంది టీచర్ల తొలగింపు
♦️వారి స్థానంలో 1.31 లక్షల మంది సచివాలయ సిబ్బంది
♦️ఎన్నికల నిర్వహణలో అనుభవం శూన్యం
♦️నిష్పాక్షికంగా, నిర్భయంగా విధులు కష్టమే
♦️వైసీపీ నేతల కనుసన్నల్లోనే గ్రామ సచివాలయాలు
♦️మొదటి నుంచీ సర్కారు గుప్పిట్లోనే ఆ సిబ్బంది
♦️వారి డిమాండ్లు పరిష్కరించకుండా ఆటలు
♦️ఎన్నికల్లో టీచర్లతో ప్రమాదమని సర్కారు ఆందోళన
♦️బోధనేతర’ సాకుతో ఎన్నికల విధుల నుంచి ఔట్
🔺గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించడం ఖాయమైంది. 1.91 లక్షల మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం చేయడంతో... వారి స్థానంలో 1.31 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీలు వేయనున్నారు. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది! టీచర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులను ఎన్నికల్లో వాడుతున్నారా? లేక... సచివాలయ ఉద్యోగులకు ఆ అవకాశం కల్పించేందుకే టీచర్లను ఎన్నికల విధుల నుంచి దూరం చేశారా? లోతుగా విశ్లేషిస్తే... ఉపాధ్యాయులు ఎన్నికల డ్యూటీల్లో ఉంటే తమకు నష్టమని, అందుకే వారిని పక్కకు తప్పించి, వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులను చేర్చారని స్పష్టంగా తెలుస్తోంది. ఇదో... పెద్ద రాజకీయ/ఎన్నికల వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో ఏమాత్రం అనుభవం లేని సచివాలయ ఉద్యోగులతో ఎన్నికల నిర్వహణ క్లిష్టంగా మారుతుందని పేర్కొంటున్నారు.
♦️వైసీపీ ఎన్నికల మేనేజ్‌మెంట్!
ఎన్నికల్లో ఓట్లు వేసేది ప్రజలు. గత సార్వత్రిక ఎన్నికల్లో అనేక గిమ్మిక్కులు చేసి ఓటర్లను వలలో వేసుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు.. అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో... ‘జనంతో సంబంధంలేని పోల్ మేనేజ్‌మెంట్’పై వైసీపీ దృష్టి సారించింది. వలంటీర్లు ఇందులో భాగమే! ఆ తర్వాత వలంటీర్లపై పార్టీ తరఫున పెత్తనానికి గృహ సారథులు, కన్వీనర్లను రంగంలోకి దించింది. చివరగా... ఉపాధ్యాయులను పక్కకు నెట్టేసి, సచివాలయాల సిబ్బంది ద్వారా ‘అనుకూల’ ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది.
🌻(అమరావతి - ఆంధ్రజ్యోతి): పీఆర్సీలో మోసం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, జీతాల చెల్లింపులో జాప్యం... తదితర కారణాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత ఏడాది జరిగిన ‘చలో విజయవాడ’ విజయవంతానికి ముఖ్య కారణం ఉపాధ్యాయులే. అప్పటి నుంచే టీచర్లపై సర్కారు కత్తిగట్టింది. వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో సహకరించే అవకాశమే లేదని ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన అంచనాకు వచ్చారు. దీంతో... ఎన్నికల విధుల నుంచి వారిని దూరం చేయడంపై దృష్టి సారించారు. బోధనేతర విధులను తప్పించాలని ఉపాధ్యాయులు ఎన్నాళ్లుగానో కోరుతున్న సంగతి తెలిసిందే. వారి ఉద్దేశంలో బోధనేతర విధులంటే... రోజుల తరబడి సాగే జనాభా లెక్కల సేకరణ, రోజూ సాగే యాప్‌ల అప్‌డేట్, మధ్యాహ్న భోజనం విధులు! కానీ... ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఉపాధ్యాయులు అడగనే లేదు. కానీ... ప్రభుత్వం ఆ పని చేసేసింది. టీచర్లను ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టేసింది.
♦️టీచర్లను అకడమిక్ విధులకు తప్ప వేరే వాటికి వినియోగించుకోదలచుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. దీంతో... ఎన్నికల విధులకు కేటాయించే ఉద్యోగుల డేటాబే్‌సలో 1.91 లక్షల మంది టీచర్లను తొలగించారు. వారి స్థానంలో 1.36 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను చేర్చారు. నిజానికి... తమ సొంత కార్యకర్తల్లాగా భావిస్తున్న వలంటీర్లకే ఎన్నికల డ్యూటీలు వేయాలని కూడా ప్రయత్నించారు. కానీ... వలంటీర్లు పూర్తిస్థాయి ఉద్యోగులుకారు. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో... ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన సచివాలయ సిబ్బందిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే... ప్రతి సచివాలయంలో ఇద్దరు కార్యదర్శులను బీఎల్‌వోలుగా (బూత్‌లెవెల్ ఆఫీసర్) నియమించారు.
♦️అనుభవం లేని వారితో...
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర కీలకం. ఇతరత్రా బోధనేతర విధుల సంగతి ఎలా ఉన్నా... ఎన్నికల నిర్వహణకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోవడం సమంజసమే అని హైకోర్టు తీర్పులూ ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అనే అంశంపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంటుంది. కానీ... సచివాలయ కార్యదర్శులకు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అనుభవమూ లేదు. ఇప్పటిదాకా ఒక్క ఎలక్షన్ డ్యూటీ కూడా చేయలేదు. వీరు ఉపాధ్యాయులకు ఎలా ప్రత్యామ్నాయం అవుతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
♦️కనుసన్నల్లో ఉంటారనే...
గ్రామ సచివాలయ కార్యదర్శులుగా ఏ ప్రాంతం వాళ్లు అక్కడే నియమితులయ్యారు. కుదిరితే... ఎన్నికల్లోనూ వారిని ‘స్థానికం’గానే ఉపయోగించుకోవాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది మాట ఎలా ఉన్నా... గ్రామ/వార్డు సచివాలయాలపై పూర్తిగా వైసీపీ నేతల పెత్తనం కొనసాగుతోంది. వైసీపీ నేతల కనుసన్నల్లోనే కార్యదర్శులు పనిచేయాల్సి వస్తోంది. మరి... కార్యదర్శులు ఎన్నికల విధులను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వర్తించగలరా? స్థానిక నేతల ఒత్తిళ్లను భరించగలరా?
♦️గుప్పిట పెట్టుకుని...
‘ఎన్నికల్లో మాకు సహకరిస్తేనే... మీకు భవిష్యత్తు’ అనేలా సచివాలయ కార్యదర్శులను ప్రభుత్వం పరోక్షంగా ‘బ్లాక్ మెయిల్’ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే... వీరితో ప్రభుత్వం ముందు నుంచీ ఒక ఆట ఆడుకుంటోంది. సమయానికి ప్రొబేషన్ ప్రకటించకుండా ముప్పు తిప్పలు పెట్టింది. ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలలకు సంబంధించిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. 25వేల మందికి ఇంకా ప్రొబేషన్ ప్రకటించనేలేదు. హెల్త్ కార్డులు, సెలవులకు సంబంధించి వారికి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సచివాలయ కార్యదర్శులకు క్యాజువల్ లీవ్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇలా అనేక న్యాయబద్ధమైన డిమాండ్లు/కోరికలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. పోలింగ్ రోజు తమకు అనుకూలంగా వ్యవహరిస్తేనే ఇవన్నీ పరిష్కరిస్తామని ఇప్పటి నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. ఇక... సచివాలయ ఉద్యోగులు ఎక్కడ నియమితులైన వారు అక్కడే పని చేస్తున్నారు. బదిలీల ఊసే లేదు. స్థానిక వైసీపీ నేతల కనుసన్నల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ‘తేడా వస్తే మున్ముందు మీ సంగతి చూస్తాం’ అనేలా హెచ్చరికలు పంపిస్తున్నారు. టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా నిర్భయంగా విధులు నిర్వహించే పరిస్థితుల్లో సచివాలయ కార్యదర్శులు లేరు. గ్రామాల్లో వివాదాలు రాకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు టీచర్ల అనుభవం ఎంతో ఉపయోగపడుతోంది. సచివాలయ ఉద్యోగులతో ఎన్నికల్లో ఎన్నెన్ని సమస్యలు ఎదురవుతాయోనని ఉన్నతాధికారులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.
0 Comments:
Post a Comment