Dharpally | శ్రీకృష్ణుడు సేదతీరిన నేల.. మన తెలంగాణ పల్లె.. త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న ఈ గ్రామం గురించి తెలుసా !
Dharpally | త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం పర్యటనకు బయల్దేరి వెళ్లినసమయంలో దారిమధ్యలో ఆగిన పల్లెనే దారిలోనిపల్లెగా పేరుగాంచిందని..
అదికాస్తా రానురాను ధర్పల్లిగా ప్రసిద్ధిగాంచిందని ప్రతీతి.
Dharpally | ధర్పల్లి, ఫిబ్రవరి 23: త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం పర్యటనకు బయల్దేరి వెళ్లినసమయంలో దారిమధ్యలో ఆగిన పల్లెనే దారిలోనిపల్లెగా పేరుగాంచిందని.. అదికాస్తా రానురాను ధర్పల్లిగా ప్రసిద్ధిగాంచిందని ప్రతీతి. రాజుల కాలంలో ధర్పల్లికి చుట్టు పక్కల పెద్దపెద్ద పేటలు(పట్టణాలు) సీతాయిపేట, హోన్నాజిపేట, దమ్మన్నపేట ఉండేవి. దీంతో వ్యాపారులు, గొప్పగొప్ప ధనవంతులు వ్యాపారం కోసం ఈ పేటలకు వచ్చేవారని.. అలా వచ్చేప్పుడు దారిమధ్యలో సేద తీరేవారు. ఆ గ్రామాలకు వెళ్లే దారి ప్రధాన కూడలీలో ఈ గ్రామం ఉండడంతో దీనిపేరు దారిపల్లెగా పేరుగాంచిందని… తర్వాత ధర్పల్లిగా రూపాంతరం చెందిందని పూర్వీకులు చెబుతున్నారు.
చరిత్రకు సజీవ సాక్ష్యం జగన్నాథుని ఆలయం..
ధర్పల్లి మీదుగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వెళ్లాడనేదానికి నిదర్శనంగా మండల కేంద్రంలోని మాలగుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య జగన్నాథుని ఆలయం నెలకొని ఉంది. శ్రీకృష్ణుడు లోకసంచారం చేస్తూ నడయాడిన నేల కాబట్టే ఆయనకు గుర్తుగా ఆలయం నిర్మించి పూజించారు. మాలగుట్టపై పురాతన కాలంలో నిర్మించిన ఆలయం చాలా ఏండ్ల క్రితమే ఆనవాళ్లు లేకుండా కూలీపోవడంతో పక్కనే ఉన్న రెండు పెద్ద రాళ్ల మధ్యన చిన్నపాటి ఆలయం నిర్మించి మూలవిరాట్టు విగ్రహాలను ఉంచారు. ఇప్పటికీ పచ్చని ప్రకృతి ఒడిలో గుట్టపై జగన్నాథుడు కొలువై ఉన్నాడు. అయితే రాళ్లమధ్యలో ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నపాటి ఆలయం సైతం శిథిలమైపోయింది.
మామూలు పల్లె నుంచి మండలంగా రూపాంతరం…
చిన్న దారిపల్లెగా ఉన్న గ్రామం మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ మండలంగా రూపాంతరం చెందింది. 1960-70దశకంలో గ్రామం పలు అభివృద్ధి పనులకు నోచుకున్నది. దీంతో గ్రామం రూపురేఖలు మారుతూ వచ్చాయి. 1964లో గ్రామానికి విద్యుత్ సరఫరా వచ్చింది. 1970లో బ్యాంకు, పోస్టాఫీసు ఏర్పడి తారు రోడ్డుకు నోచుకున్నది. 1985లో మండల వ్యవస్థ రూపొందడంతో చుట్టు ప్రక్కల గ్రామాలకు ప్రధాన కూడలీగా ఉన్న ధర్పల్లిని మండలంగా ఏర్పాటు చేశారు. అప్పటి ఎమ్మెల్యే థామస్ సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కర్ణం రామచంద్రరావును కలిసి విన్నవించడంతో వారి కృషి ఫలితంగా ధర్పల్లి మండలంగా ఏర్పాటైందని పూర్వీకులు చెబుతున్నారు. 1987లో మండల కేంద్రంలో 5 ఎకరాల స్థలంలో 30 పడకల ప్రభుత్వ దవాఖానను నిర్మించారు. ధర్పల్లి మొదటి సర్పంచ్‌గా మూత రాములు (నామినేటేడ్)కాగా ఎన్నికల ద్వారా ఎం.కాంతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే అప్పుడు సర్పంచ్ పదవికి మూడు సంవత్సర కాలపరిధి మాత్రమే. కాగా కొన్నేండ్లు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా మొట్టమొదటిసారి 1981లో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఏలేటి వెంకట్‌రెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన తొలి సర్పంచ్‌గా చరిత్రలో నిలిచారు.
గోవర్ధనగిరిగా మాలగుట్ట…
జగన్నాథ ఆలయం నిర్మిస్తున్న మాలగుట్ట 'గోవర్ధనగిరి'గా ప్రసిద్ధికెక్కుతున్నది. మాలగుట్టపై నూతనంగా జగన్నాథ ఆలయ నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా కృషి చేసి ఆలయం ప్రారంభమయ్యేలా చూడడంతోపాటు విద్యుత్ సౌకర్యం, నీటి వసతుల ఏర్పాటుకు నిధులందించి పూర్తి సహకారమందించడంతో బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు ఆయన పేరు వచ్చేలా ఈ గుట్టకు 'గోవర్ధనగిరి'గా నామకరణం చేశారు.
నూతన ఆలయ నిర్మాణం..
ధర్పల్లిలో జగన్నాథుడు అడుగీడిన గొప్ప చరిత్ర కాలగర్భంలో కలిసిపోరాదనే భావనతో గ్రామస్తులు శిథిలమైన ఆలయ స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించారు. 2007లోనే జగన్నాథ ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.5లక్షల వరకు చందాలు చేశారు. కాగా పురాతన ఆలయాల పరిరక్షణ కోసం దేవాదాయ శాఖ నిధులు అందిస్తుందని తెలుసుకొని గ్రామస్తులు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేశారు. దీంతో పరిశీలనకు వచ్చిన అధికారులు పురాతన ఆలయం చరిత్ర గుర్తులు ఏమీలేక పోవడంతో సందేహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఆలయం వద్ద చెక్కు చెదరకుండా ఉన్న రాతి స్తంభం ఆధారంగా ఆలయ చరిత్రను గుర్తుపట్టినట్లు తెలిసింది. దీంతో మాలగుట్టపై చందాల ద్వారా పోగు చేసిన రూ.5లక్షలు, ప్రభుత్వం(ఎండోమెంట్ శాఖ) అందించిన రూ.20లక్షలు కలిపి మొత్తం రూ.25లక్షలతో నూతన ఆలయం నిర్మించి.. శాస్ర్తోక్తంగా ప్రారంభించారు.
ఆలయం నిర్మించడం హర్షణీయం..
చరిత్ర ఆనవాళ్లను కాపాడడంలో భాగంగా ఎత్తయిన మాలగుట్టపై జగన్నాథ నూతన ఆలయం నిర్మించడం హర్షణీయం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టపైన ఆల యం, అటు రెండు గ్రామాల మధ్య అందంగా పొదిగి ఉన్న చెరువుపై మినీ ట్యాంక్‌బండ్ అందాలతో గ్రామం మంచి పర్యాటక కేంద్రంగా అలరారుతోంది.
-సంతోష్, ధర్పల్లి గ్రామం
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..
ధర్పల్లి చరిత్రను కాపాడడంలో భాగంగా నూతనంగా ఆలయం నిర్మించడానికి సహకారం అందించి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు గ్రామస్తులమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం. చరిత్రకు సజీవ సాక్ష్యమైన రాతి స్తంభం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉండడం చాలా సంతోషం. గోవర్ధనగిరి చరిత్రకు సాక్ష్యంగా నిలపడంతోపాటు ఎమ్మెల్యే సహకారంతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో పర్యాటకంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం.
-నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, ఎంపీపీ, ధర్పల్లి
0 Comments:
Post a Comment