హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీకి సంబంధించి ముగ్గురు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉపాధ్యాయులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసిపి మున్సిపల్ వైస్ చైర్మన్‌కు సంబంధించిన బాలయేసు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. డిఇఒ ఫిర్యాదుతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయివేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఐదు సర్వీసు ఉంటేనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. హిందూపురంలోని బాలయేసు ప్రయివేటు హైస్కూలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న షరీఫాబీ, హజరాంబీ, గీతలకు ఐదేళ్లు సర్వీసు లేదు. అయినా, వీరు ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని డిఇఒ కార్యాలయ సిబ్బంది వెరిఫై చేశారు. ఈ సందర్భంగా డిఇఒ సంతకం ఫోర్జరీ విషయం బట్టబయలైంది. దీనిపై జిల్లా ఎస్‌పికి డిఇఒ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌పి విజ్ఞప్తి మేరకు హిందూపురం తహశీల్దారు సౌజన్యలక్ష్మి విచారణ నిర్వహించి అధికారులకు నివేదిక పంపారు. డిఇఒ సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలడంతో హిందూపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లోనూ ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో, ముగ్గురు ఉపాధ్యాయులపైనా కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీకి చెందిన వారు అడ్డదారులు తొక్కుతున్నారు. వారికి సంబంధించిన పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను అర్హత లేకున్నా ఓటర్లుగా నమోదు చేసినట్లు, ఇందుకు డిఇఒ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముగ్గురి ఉపాధ్యాయుల విషయంలోనూ ఈ విధంగానే జరిగి ఉంటుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి దొంగ ఓట్లు ఇంకా ఎన్ని నమోదయ్యాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలని, అర్హతలేని వారి ఓట్లు తొలగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments:
Post a Comment