సీపీఎస్ ఖాతా ఖాళీ..
11 నెలలుగా ప్రాన్ ఖాతాకు జమకాని మొత్తం రూ.1,320 కోట్లు
ప్రభుత్వ వాటా కలిపితే రూ.2,600 కోట్లు
వడ్డీతో చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్.
ఈనాడు - అమరావతి
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులను ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఉద్యోగులు ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. మరోవైపు వారి జీతాల నుంచి మినహాయించిన డబ్బులనూ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోంది. ప్రభుత్వం ప్రతి నెలా సీపీఎస్ ఉద్యోగుల జీతంలో 10 శాతం సీపీఎస్‌ను మినహాయిస్తోంది. దీనికి ప్రభుత్వ వాటా మరో 10 శాతం కలిపి మొత్తాన్ని ఉద్యోగుల ప్రాన్ (శాశ్వత పదవీ విరమణ) ఖాతాల్లో జమ చేయాలి. 2022 ఫిబ్రవరి జీతం నుంచి జమ కావడం లేదు. పది శాతం లోపు మందికి మాత్రం ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మొత్తం ప్రాన్ ఖాతాకు జమయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెలా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సుమారు రూ.120 కోట్లు కాగా.. ప్రభుత్వ వాటా మరో రూ.120 కోట్లు ఉంటుంది. తన వాటా సొమ్ము జమ చేయని ప్రభుత్వం 11 నెలలకు కలిపి ఉద్యోగుల వాటానే రూ.1,320 కోట్లు వాడేసుకుంది. రెండు వాటాలు కలిపితే రూ.2,640 కోట్లు ప్రభుత్వం ప్రాన్ ఖాతాలకు చెల్లించాల్సి ఉందని, ఎప్పుడు జమ చేస్తుందో తెలియడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వీరికి నగదు రూపంలో ఇవ్వాల్సిన డీఏ బకాయిలూ చెల్లించడం లేదు. బకాయిలు ఇవ్వకుండానే వారి నుంచి ఆదాయపు పన్ను మినహాయించేశారు. పీఆర్సీ కంటే ముందు ఇవ్వాల్సిన డీఏ బకాయిలే రూ.960 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో 90 శాతాన్ని ఉద్యోగులకు నగదుగా ఇవ్వాలి. మరో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయాలి. సీపీఎస్ రద్దు చేస్తారనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు తమ సొమ్మునూ ఇతర అవసరాలకు మళ్లించేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలతో తమ పదవీవిరమణ ప్రయోజనాలనూ నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు.
2019 నుంచి సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన వాటాను 14 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని రాష్ట్రం అమలు చేయకపోవడంతో ఉద్యోగులు ప్రతి నెలా 4 శాతం నష్టపోతున్నారు. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల్లో రెగ్యులరైజ్ అయిన 96 వేల మంది జీతాల నుంచీ ప్రభుత్వం సీపీఎస్ కోసం సొమ్ము మినహాయిస్తోంది. ఒక్కో సచివాలయ ఉద్యోగి నుంచి సుమారు రూ.2,700 చొప్పున మినహాయిస్తున్నా ప్రాన్ ఖాతాలో జమ కావడం లేదని వారు చెబుతున్నారు.
11 నెలల వాటానే చెల్లించలేకపోతే భవిష్యత్తులో ఎలా?
ఈ 11 నెలల కాంట్రిబ్యూషన్ చెల్లించలేని ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా కొండలా పెరిగే వాటాను ఏం చెల్లిస్తుంది?
సీఎం దాస్, రవికుమార్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్)
తక్షణం వడ్డీతో చెల్లించాలి
సీపీఎస్ కింద తీసుకున్న సొమ్మునూ మళ్లించేయడం దారుణం. వెంటనే ఆ మొత్తాన్ని ప్రాన్ ఖాతాల్లో వడ్డీతో కలిపి జమ చేయాలి
అప్పలరాజు, పార్థసారథి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ)
0 Comments:
Post a Comment