లెఫ్టినెంట్ కల్నల్ నార్మన్ సింప్సన్, 1940లలో బెంగాల్ జైళ్ల శాఖ ఐజీగా పనిచేశారు.
జైలు పాలైన స్వాతంత్ర్య సమరయోధులను విపరీతంగా హింసించేవారని ఆయనకు పేరుంది.
నార్మన్ పర్యవేక్షణలో కరుడుగట్టిన నేరస్థులు, స్వాతంత్ర్య సమరయోధులపై అకృత్యాలకు పాల్పడటం అప్పట్లో అత్యంత సాధారణ అంశంగా ఉండేది.
ఒకసారి నార్మన్ ఆదేశాల మేరకు జైలులో ఉన్న సుభాష్ చంద్రబోస్‌పై ఖైదీల బృందం ఒకటి దాడి చేసింది.
ఆ రోజు సుభాష్ చంద్రబోస్‌తో పాటు అతని సహచరులైన దేశప్రియ జతీంద్ర మోహన్, కిరణ్ శంకర్ రాయ్, సత్య గుప్తాలను ఆ బృందం తీవ్రంగా కొట్టింది.
బెంగాల్ వలంటీర్లు, ఈ ఘటన తర్వాత తమ ఇద్దరు కార్యకర్తలైన దినేశ్ చంద్ర గుప్తా, సుధీర్ బాదల్ గుప్తాలను కోల్‌కతాకు పిలిపించారు. బినాయ్ కృష్ణ బసు అప్పటికే కోల్‌కతాలోనే ఉన్నారు.
భారత్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ వలంటీర్స్ అనే విప్లవ దళం ఏర్పాటైంది.
బ్రిటిష్ ప్రభుత్వ ఊహకు కూడా అందని సాహసోపేతమైన పనిని చేయాల్సిందిగా ఈ ముగ్గురికి ఒక బాధ్యతను అప్పగించారు.
ఐజీ సింప్సన్‌కు ఇక ఏమాత్రం బతికే అర్హత లేదు, అతన్ని ఈ లోకం నుంచి పైకి పంపించాల్సిందిగా వారికి చెప్పారు.
అయితే, ఎక్కడ? ఎలా? అతన్ని చంపాలనే ప్రశ్న ఉత్పన్నమైంది.
అతన్ని ఎలాంటి చోట చంపాలంటే, అది చూసి బ్రిటిష్ పాలక యంత్రాంగం కాళ్ల కింది నేల కదిలిపోవాలని వారు నిర్ణయించుకున్నారు.
సింప్సన్ కార్యాలయమైన రైటర్స్ బిల్డింగ్‌లో అందరూ చూస్తుండగా, బహిరంగ ప్రదేశంలో అతన్ని కాల్చి చంపాలనే ప్రణాళికను రచించారు.
బెంగాల్‌లో బ్రిటిష్ పాలనకు కంచుకోట రైటర్స్ బిల్డింగ్.
1930లో కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్
''బెంగాల్ వలంటీర్లు'' దళ స్థాపన
1928లో కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా సుభాష్ చంద్రబోస్, బెంగాల్ వలంటీర్స్ అనే రహస్య విప్లవ దళాన్ని ఏర్పాటు చేశారు.
త్యాగం, దేశభక్తి నిండిన వ్యక్తులతో ఈ సంస్థను స్థాపించారు.
బెంగాల్ వాలంటీర్లు సంస్థలోని సభ్యులు ప్రతీరోజూ యూనిఫామ్ ధరించి పార్క్‌లో మార్చ్ ఫాస్ట్ చేసేవారు. మేజర్ సత్య గుప్తా ఈ సంస్థలోని సభ్యులకు పోరాటాలు చేయడానికి కావాల్సిన శిక్షణను ఇచ్చేవారు.
1930లో బెంగాల్‌లోని అనేక జైళ్లలో పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి 'ఆపరేషన్ ఫ్రీడమ్'ను ప్రారంభించారు.
అనుకున్న ప్రణాళిక ప్రకారం సింప్సన్‌ను చంపడం సఫలమైనా, విఫలమైనా అక్కడికి వెళ్లినవారిలో ఎవరికీ ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉండవు.
ఈ విషయం ఆ ముగ్గురు యువకులకు తెలుసు. అయినప్పటికీ ఈ పెద్ద మిషన్ కోసం ఎంపికైనందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మిషన్ గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
బినాయ్ కృష్ణ బసు ఈ మిషన్ కంటే ముందు ఢాకాలోని మెడికల్ కాలేజీలో ఢాకాకు చెందిన ఐజీ లాసన్‌ను కాల్చి చంపారు.
అతని కోసం ప్రతీచోటా పోలీసులు గాలిస్తున్నారు. అయినప్పటికీ వారి కళ్లు గప్పి ఢాకా నుంచి కోల్‌కతాకు బినాయ్ చేరుకున్నారు.
WB GOVTమేజర్ సత్య
బినాయ్, బాదల్, దినేశ్ ఎవరు?
బినాయ్ కృష్ణ బసు 1908 సెప్టెంబర్ 11న ముషీగంజ్ జిల్లాలో జన్మించారు. ఈ ప్రాంతం ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది. 22 ఏళ్ల వయస్సులో దేశం కోసమే బతకాలని, దేశం కోసమే చనిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
దినేశ్ గుప్తా కూడా ముషీగంజ్ జిల్లాలోనే జన్మించారు. బాదల్ గుప్తాతో పాటు వీరిద్దరూ కూడా బెంగాల్ వలంటీర్ల బృందంలో సభ్యులు. తన చిన్నాన్నలు ధరణీనాథ్ గుప్తా, నరేంద్రనాథ్ గుప్తాల జీవన విధానంతో ప్రభావితమైన దినేశ్ గుప్తా, తాను కూడా విప్లవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నారు.
వీరిద్దరూ అలీపూర్ కుట్ర కేసులో అరబింద్ ఘోష్‌తో కలిసి చాలా రోజుల పాటు జైలు జీవితం గడిపారు.
సింప్సన్‌ను చంపడం కోసం ఈ ముగ్గురు యువకులు, పాశ్చాత్యుల తరహాలో సూట్‌ను కుట్టించుకున్నారు. రివాల్వర్, బుల్లెట్లు అన్నింటినీ సమకూర్చుకున్నారు.
బినాయ్‌ని వలీవుల్లా లేన్ నుంచి మటియాబుర్జ్‌లోని రాజేంద్రనాథ్ గుహా ఇంటికి తీసుకెళ్లారు.
బాదల్, దినేశ్‌లను న్యూ పార్క్ స్ట్రీట్‌లోని ఒక రహస్య స్థావరానికి చేర్చారు.
సింప్సన్‌ను డిసెంబర్ 8వ తేదీన హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముగ్గురూ ఖిదిర్పూర్‌లోని పాయిప్ రోడ్‌లో కలుసుకోవాలని అనుకున్నారు.
RUPAబాదల్ (ఎడమ), బినాయ్ (మధ్య), దినేశ్ (కుడి)
సూటు-బూట్లతో రైటర్స్ బిల్డింగ్‌కు
1930 డిసెంబరు 8న ఈ ముగ్గురూ చివరిసారిగా తమ కోటు జేబులను చెక్ చేసుకున్నారు. వారి జేబుల లోపల రివాల్వర్లు, కాట్రిడ్జ్‌లు ఉన్నాయి. బాదల్ తన జేబులో పొటాషియం సైనైడ్ క్యాప్సూల్ కూడా పెట్టుకున్నారు.
గడియారం 12 గంటలు కొట్టగానే, ఈ ముగ్గురు తమ ప్రయాణం ప్రారంభించారు. ఒక టాక్సీ డ్రైవర్ దగ్గరకు వెళ్లి తమను రైటర్స్ బిల్డింగ్‌కు తీసుకెళ్లమని అడిగారు.
ఈ ఘటన గురించి సుప్రతిమ్ సర్కార్ అనే రచయిత 'ఇండియా క్రైడ్ దట్ నైట్' అనే పుస్తకంలో ప్రస్తావించారు.
''టాక్సీ, రైటర్స్ బిల్డింగ్ ప్రధాన గేటు ముందు ఆగిన వెంటనే అక్కడున్న పోలీసు అధికారి, సూటు బూటు ధరించిన ముగ్గురు వ్యక్తులు టాక్సీ నుంచి దిగడం చూశారు. డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి వారు ముగ్గురు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచారు.
పోలీసు అధికారికి, ఆయన బృందానికి వారిపై ఎలాంటి సందేహం కలగలేదు. మెట్ల దారి గుండా వారు ముగ్గురు మొదటి అంతస్థుకు చేరుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ సింప్సన్, తన గదిలో ఉత్తరం రాస్తూ కూర్చున్నారు. అతని వ్యక్తిగత సహాయకుడు జేసీ గుహా, ప్యూన్ బాగల్ ఖాన్ ఆయనకు సమీపంలో నిల్చొని ఉన్నారు. ద్వారం బయట అసిస్టెంట్ ప్యూన్ ఫాగూ సింగ్ కూడా ఉన్నారు'' అని పుస్తకంలో రాశారు.
ప్యూన్‌ను నెట్టేసి సింప్సన్ గదిలోకి చొరబాటు
సింప్సన్ కార్యాలయం, పొడవైన కారిడార్‌కు చివరన పశ్చిమ దిశలో ఉంది. అక్కడే చాలా మంది బ్రిటిష్ అధికారుల కార్యాలయాలు కూడా ఉన్నాయి. వాటి దర్వాజాల ముందు సేవకులు నిల్చొని ఉన్నారు. కారిడార్‌లో చాలా మంది గుమస్తాలు తమ ఫైళ్లను పట్టుకుని తిరుగుతున్నారు.
ముగ్గురు యువకులు, వేగంగా నడుచుకుంటూ సింప్సన్ గది ముందుకు చేరుకున్నారు.
గది బయట ఉన్న ఫాగు సింగ్ వారిని ప్రశ్నించారు. ''మీరు సాహిబ్‌ను కలవడానికి వచ్చారా?'' అని వారిని అడిగారు.
''ఆయన లోపలే ఉన్నారా?'' అంటూ బినాయ్ ఎదురు ప్రశ్న వేశారు.
''ఆయన లోపల ఉన్నారు. కానీ, బిజీగా ఉన్నారు. ఆయనను కలవడం కోసం అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? మీకు విజిటింగ్ కార్డ్ ఉంటే నాకు ఇవ్వండి లేదా ఈ రిజిస్టర్‌లో మీ పేరు రాయండి. మీ గురించి సార్‌కి నేను చెబుతాను. కానీ, లోపల ఆయన నుంచి సమాధానం వచ్చే వరకు మీరు బయట ఆగాల్సిందే'' అని ఫాగూ సింగ్ సమాధానం ఇచ్చారు.
వెంటనే ముగ్గురూ ఫాగూ సింగ్‌ను తోసేసి బలంగా తలుపును నెట్టారు. రెప్పపాటులో రివాల్వర్‌ను చేతుల్లోకి తీసుకున్నారు.
బుల్లెట్లతో చిద్రమైన సింప్సన్ శరీరం
సుప్రతిమ్ సర్కార్ ఇలా రాశారు. "సింప్సన్ తల పైకెత్తి చూడగా, ముగ్గురు యువకులు రివాల్వర్లతో తన ముందు నిలబడి ఉండటం కనిపించింది. అతని సహాయకుడు గుహా వెంటనే వెనక్కి వెళ్లగానే, ముగ్గురి రివాల్వర్ల నుంచి బుల్లెట్లు, సింప్సన్ శరీరంలోకి దూసుకెళ్లాయి. సింప్సన్‌కు కనీసం తన కుర్చీ నుంచి కదిలే అవకాశం కూడా లేకపోయింది. కుర్చీలోనే అతను ప్రాణాలను విడిచారు.
ఈ దృశ్యాన్ని చూసిన గుహా గట్టిగా అరుస్తూ గది నుంచి బయటకు పరిగెత్తారు. ఫాగూ సింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి మరో బ్రిటిష్ అధికారి టఫ్నాల్ బారెట్ గదిలో దాక్కున్నారు.
బారెట్ వెంటనే సమీపంలోని లాల్ బజార్‌కు ఫోన్ చేసి భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు "రైటర్స్ బిల్డింగ్‌లో కాల్పులు జరిగాయి. సింప్సన్ చనిపోయారు. వెంటనే సాయుధ భద్రతా బలగాలను పంపండి'' అని గట్టిగా ఫోన్‌లో అరిచారు'' అని పుస్తకంలో సర్కార్ పేర్కొన్నారు.
వందేమాతరం అంటూ నినాదాలు
వాహనాన్ని పిలవడం కంటే నేరుగా రైటర్స్ బిల్డింగ్‌కు పరిగెత్తడం సరైందని పోలీసు కమిషనర్ చార్లెస్ టెగార్ట్ భావించారు. ఆయనతోపాటు రిజర్వ్ ఫోర్స్‌కు చెందిన కొందరు సైనికులు కూడా ఉన్నారు. రెండు, మూడు నిమిషాల్లోనే వారు రైటర్స్ బిల్డింగ్‌కు చేరుకున్నారు.
ఇంతలో బెంగాల్ ఐజీ క్రెయిగ్, చేతిలో రివాల్వర్‌తో రెండో అంతస్థులోని తన గది నుంచి మొదటి అంతస్థులోకి దిగి వచ్చారు.
సింప్సన్‌ను కాల్చిన తర్వాత దినేశ్ చంద్ర గుప్తా, సుధీర్ బాదల్ గుప్తా, బినాయ్ కృష్ణ బసు తమ చేతుల్లో రివాల్వర్లతో కారిడార్‌లో పశ్చిమ దిశ నుంచి తూర్పు వైపుకు నడవడం మొదలుపెట్టారు.
మరోవైపు కాల్పుల వార్త అంతటా వ్యాపించింది. కారిడార్‌లో తిరిగే వారంతా భయంతో దొరికిన చోటల్లా దాక్కోవడం మొదలుపెట్టారు. కాసేపటికి కారిడార్‌లో నిశ్శబ్ధం ఆవరించింది. అప్పుడే ఈ ముగ్గురూ 'వందేమాతరం' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు.
తర్వాత ఈ మొత్తం ఎన్‌కౌంటర్‌కి 'బ్యాటిల్ ఆఫ్ వరండాజ్' అని పేరు పెట్టారు. అదే సమయంలో ఫోర్డ్ అనే సార్జెంట్ తన వ్యక్తిగత పని కోసం రైటర్స్ బిల్డింగ్‌కు వచ్చారు. ఆయన దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. ఆయన మెట్ల దగ్గర నిలబడి అక్కడ జరిగేదంతా చూస్తున్నారు.
RUPA
పాస్‌పోర్ట్ కార్యాలయంలోకి ముగ్గురు యువకులు
సుప్రతిమ్ సర్కార్ ఈ ఘటన గురించి ఇలా రాశారు. ''ఈ ముగ్గురు యువకులను చూడగానే ఐజీ క్రెయిగ్ వారిపై కాల్పులు జరిపారు. కానీ, వారెవరికీ బుల్లెట్ తగల్లేదు. క్రెయిగ్ నుంచి రివాల్వర్ తీసుకున్న ఫోర్డ్ వారిపై మళ్లీ కాల్పులు జరిపారు.
బినాయ్, బాదల్, దినేశ్ పరుగెత్తుతూనే తిరిగి కాల్చడం మొదలుపెట్టారు. కాసేపటికి వారి రివాల్వర్‌లోని బుల్లెట్లు అయిపోయాయి. రివాల్వర్లను మళ్లీ లోడ్ చేయాల్సి వచ్చింది. దీనికోసం వారు సీనియర్ అధికారి జేడబ్ల్యూ నెల్సన్ గది బయట ఆగారు.
వారి పక్కనే పాస్‌పోర్ట్ ఆఫీసు ఉంది. బినాయ్, బాదల్ తమ రివాల్వర్లను లోడ్ చేసుకోవడానికి లోపలికి పాస్‌పోర్ట్ ఆఫీసు లోపలికి వెళ్లారు. బయట నిలబడి రివాల్వర్ లోడ్ చేసుకునేందుకు దినేశ్ ప్రయత్నించారు.
నెల్సన్ తన గది తలుపు తెరవగానే, దినేశ్ అతనిపై కాల్పులు జరిపారు. నెల్సన్ తొడకు బుల్లెట్ తగిలింది. అయినప్పటికీ అతను దినేశ్‌ను ఎదుర్కొన్నారు. దినేశ్ చేతిలోని రివాల్వర్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు.
కాల్పుల శబ్దం విని బినాయ్, బాదల్ రివాల్వర్లతో పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. బినాయ్ తన రివాల్వర్ బట్‌తో నెల్సన్ తలపై కొట్టాడు. నెల్సన్ నేలపై పడిపోయాడు. అయినప్పటికీ పాక్కుంటూ గది నుంచి బయటకు రాగలిగాడు. అతని శరీరమంతా రక్తం కారుతోంది. ఇంతలో వారు ముగ్గురు మరోసారి పాస్ పోర్టు కార్యాలయంలోకి ప్రవేశించారు.
RUPAఇండియా క్రైడ్ దట్ నైట్ పుస్తక రచయిత సుప్రతిమ్ సర్కార్
బినాయ్, బాదల్, దినేశ్‌లను చుట్టుముట్టారు
లాల్ బజార్ నుంచి రిజర్వ్ బలగాలు వచ్చే వరకు క్రెయిగ్, ఫోర్డ్ తప్ప మిగతా ఎవరూ తమ గది నుంచి బయటకు రావడానికి సాహసించలేదు.
రెండో అంతస్థులో పోలీసు ఉన్నతాధికారుల గదులు ఉన్నాయి. వాటిలో నుంచి కూడా ఎవరూ బయటకు రాలేదు. భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బినాయ్, బాదల్, దినేశ్‌లు ఉన్న పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని నలువైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
తలుపు సందులో నుంచి దినేశ్ కాల్పులు జరిపారు. కానీ, అతని బుల్లెట్లు లక్ష్యాన్ని చేరుకోలేదు. జోన్స్ అనే పోలీసు అధికారి ఎదురు కాల్పులు జరిపారు. దినేశ్ భుజానికి బుల్లెట్ తగలడంతో గాయపడ్డాడు.
''వారిని నలువైపుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. తలుపు బయట తుపాకులతో సైనికులు నిల్చొని ఉన్నారు. ముగ్గురూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అక్కడి నుంచి సురక్షితంగా బయట పడలేమని వారు అనుకున్నారు. వారి వద్ద బుల్లెట్లు కూడా అయిపోవడంతో తాము పట్టుబడటం ఖాయమని వారికి తెలిసిపోయింది. మరణం కోసం వారంతా సిద్ధమయ్యారు. బాదల్ తన జేబులో నుంచి పొటాషియం సైనైడ్ క్యాప్సూల్‌ని తీసి మింగేశారు" అని సుప్రతిమ్ సర్కారు పుస్తకంలో రాశారు.
అతని శరీరం నిర్జీవంగా కింద పడిపోయింది. అప్పుడు బయట నిలబడి ఉన్న పోలీసులకు గది లోపల నుంచి రెండు కాల్పుల శబ్ధాలు వినిపించాయి.
బినాయ్, దినేశ్ కూడా తలపై కాల్చుకున్నారు.
RUPA
ఆసుపత్రికి బినాయ్, దినేశ్
డిప్యూటి కమిషనర్ బార్ట్‌లీ, దర్వాజా కింద నుంచి లోపల ఏం జరుగుతుందో చూశారు. ఇద్దరు వ్యక్తులు నేలపై పడి ఉండటం ఆయనకు కనిపించింది. నేలంతా రక్తసిక్తం అయింది.
పోలీసులు తలుపులు తెరిచి చూడగా దినేశ్ పక్కన .455 వెబ్లీ రివాల్వర్ పడి ఉంది.
బినాయ్ ప్యాంటు జేబులో .32 బోర్ ఐవోర్ జాన్సన్ రివాల్వర్, బాదల్ మృతదేహం దగ్గర .32 బోర్ అమెరికన్ రివాల్వర్లను పోలీసులు చూశారు. నేలపై బుల్లెట్ల గుండ్లు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ముగ్గురి టోపీలు కూడా కింద కనిపించాయి.
ఇవే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ జెండాలు రెండు నేలపై పడి ఉన్నాయి. బినాయ్ ప్యాంటు జేబులో కూడా మరో జెండా కనిపించింది.
బాదల్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి బినాయ్, దినేశ్‌లను ఆసుపత్రికి తరలించారు.
వారి వ్యూహం గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం వారిద్దరినీ ప్రాణాలతో కాపాడేందుకు బ్రిటిష్ వారు శాయశక్తులా ప్రయత్నించారు.
మరుసటి రోజు, 'బెంగాల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్‌ను కాల్చి చంపారు' అనే శీర్షికతో ఆనంద్ బజార్ పత్రిక వార్తను ప్రచురించింది.
దినేశ్‌కు మరణశిక్ష
ఇద్దరినీ కాపాడేందుకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా బినాయ్‌ను కాపాడలేకపోయారు. 1930 డిసెంబర్ 13న ఆయన తుది శ్వాస విడిచారు.
తన కొడుకును చూడాలని బినాయ్ మరణానికి రెండు రోజుల ముందు అతని తండ్రి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దినేశ్ మృత్యువు ముఖం నుంచి బయటపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ''ఇతనికి మరణ దండనే సరైన శిక్ష. కల్నల్ సింప్సన్‌ను చంపిన ముగ్గురిలో దినేశ్ గుప్తా ఒకడు అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు'' అని విచారణ సందర్భంగా న్యాయమూర్తి రాల్ఫ్ రేనాల్డ్స్ గార్లిక్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద అతనికి మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు.
RUPA
తీర్పు చెప్పిన న్యాయమూర్తి కాల్చివేత
1931 జూలై 7 తెల్లవారుజామున 4.45 గంటలకు దినేశ్‌ను ఉరితీశారు. అప్పటికి అతని వయసు 19 సంవత్సరాలే.
దినేశ్ మరణశిక్షను నిలిపివేయాలంటూ సంతకాల ఉద్యమం జరిగింది. శిక్షను నిలిపివేయాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం పంపగా ఆయన దాన్ని దానిని తిరస్కరించారు.
శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉందన్న కారణంతో ఉరి తేదీని, టైమ్‌ను రహస్యంగా ఉంచారు.
కానీ, ఇంత చేసినా ఆ వార్తను మాత్రం ఆపలేకపోయారు. మరుసటి రోజు 'అడ్వాన్స్' అనే వార్తాపత్రికలో 'ధర్మం ఎరుగని దినేశ్ తెల్లవారుజామున మరణించాడు'' అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.
మరుసటి రోజు కలకత్తాలోని ప్రతి వీధిలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దినేశ్ చంద్ర గుప్తా ఉరిశిక్షకు ఇది నిదర్శనమని ప్రజలు భావించారు.
దినేశ్‌ను ఉరితీసిన 20 రోజుల తర్వాత, అతనికి మరణశిక్ష విధించిన న్యాయమూర్తి రాల్ఫ్ రేనాల్డ్స్ గార్లిక్‌ను ఆయన కోర్టులోనే కనైలాల్ భట్టాచార్య కాల్చి చంపారు.
స్వాతంత్య్రం తర్వాత, కలకత్తాలోని డల్హౌసీ స్క్వేర్‌కు అతని గౌరవార్థం బీబీడీ బాగ్ అని పేరు పెట్టారు. బీబీడీ అంటే బినోయ్, బాదల్, దినేశ్ అని అర్ధం.
0 Comments:
Post a Comment