జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచేస్తున్న విశాఖ సదస్సు ? రాజధానుల కేసుపై సుప్రీంకోర్టు మరో రిక్వెస్ట్ !
ఏపీలో అమరావతి స్ధానంలో తెరపైకి వచ్చిన మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మరోవైపు జగన్ సర్కార్ కు డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి.
రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. మరోవైపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నేపథ్యంలో రాజధాని తేల్చాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఈ వ్యవహారాన్ని సత్వరం తేల్చాలని జగన్ సర్కార్ ఒత్తిడి పెంచుతోంది.
సుప్రీంలో రాజధానుల కేసు
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల కేసు హైకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆలస్యంగా సవాల్ చేసిన ప్రభుత్వం.. ఆ మేరకు దాని ఫలితాన్ని రాబట్టుకోలేకపోతోంది. దీంతో ప్రభుత్వం గతేడాది చేసిన అప్పీలుపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో అసలు విచారణ ప్రారంభం కానట్లే కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పులో అమరావతి నిర్మాణం కోసం విధించిన గడువుల విషయంలో మాత్రమే ఊరట లభించగా.. అసలు రాజధాని మార్పుకు అసెంబ్లీకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై మాత్రం ఏమీ తేలలేదు. దీంతో రాజధాని ఏదో ఇప్పుడు చెప్పుకోలేని పరిస్ధితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖకు బ్రాండింగ్ కోసం తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాజధాని వ్యవహారంలో ట్విస్టులకు కారణమవుతోంది.
సుప్రీంకు జగన్ సర్కార్ మరో వినతి
సుప్రీంకోర్టులో ఏపీ రాజధానులపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 23న విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. రాజధాని రైతులకు ఇచ్చిన నోటీసులు అందడంలో ఆలస్యం కావడంతో ఫిబ్రవరి 23న ఈ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఆలోపే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి కోరుతున్నారు. గతంలో అడ్వకేట్ ఆన్ రికార్డ్ మెహఫూజ్ నజ్కీ కూడా ఇదే విజ్ఞప్తి చేసినా సుప్రీంకోర్టు మాత్రం అదేమీ పట్టనట్టుగా ఫిబ్రవరి 23కు విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు నిరంజన్ రెడ్డి నిన్న మరోసారి సుప్రీంకోర్టును సత్వరి విచారణ కోరారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
విశాఖ సదస్సుతో సర్కార్ పై ఒత్తిడి
వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సన్నాహకంగా ఢిల్లీ, బెంగళూరుతో పాటు పలు నగరాల్లో కర్టెన్ రైజర్, రోడ్ షో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా పెట్టుబడిదారుల్ని ఎలాగైనా విశాఖ రప్పించాలనేది సర్కార్ వ్యూహం. కానీ ఈ ఈవెంట్లకు హాజరవుతున్న ఇన్వెస్టర్లు ఏపీ రాజధానిపైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి సమాధానం చెప్పేందుకు సీఎం జగన్, మంత్రి బుగ్గన నానా తంటాలు పడుతున్నారు. జగన్ త్వరలో విశాఖ వెళ్లిపోతున్నామని ప్రకటిస్తే, బుగ్గన అసలు మూడు రాజధానులు ఎక్కడివని ప్రశ్నించారు. విశాఖే మన రాజధాని అంటున్నారు. దీంతో విశాఖ సదస్సు వారిపై ఏ మేరకు ఒత్తిడి పెంచుతోందో అర్ధమవుతోంది.
విశాఖలో పెట్టుబడులపై ప్రభావం ?
ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు ఈ నెల 23లోపు రాజధానుల కేసు విచారణ చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే మధ్యలో కేవలం వారం రోజులే గడువు ఉండటంతో ఈ లోపు అత్యవసర విచారణ చేపట్టినా తీర్పు ఇవ్వడం కష్టం. అలాగని మరో మధ్యంతర ఉత్తర్వు ఇవ్వాలన్నా వాదోపవాదాలు వినాల్సిందే. దీంతో ఈనెల 23న సుప్రీం విచారణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా మరిన్ని వాయిదాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మూడు రాజధానులపై తీర్పు కష్టమే. కానీ విశాఖ సదస్సుకు వచ్చే ఇన్వెస్టర్లకు ఇవన్నీ అనవసరం. వారికి విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వం చెబుతున్నా నమ్మకం కుదరడం లేదు. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప విశాఖలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
0 Comments:
Post a Comment