కొన్ని వజ్రాలు, ఆభరణాలకు వాటి చరిత్ర వల్ల అత్యంత విలువ చేకూరుతుంది.
ప్రపంచప్రఖ్యాతి గాంచిన కోహినూర్ అటువంటిదే. భారత్‌లో వెలికి తీసిన ఆ వజ్రం బ్రిటన్ మహారాణి మకుటంలో చేరింది.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుకల్లో ఆ కిరీటాన్ని రాణి ధరించరని రాజభవనం ప్రకటించింది.
మాములుగానే వజ్రాలు, ఆభరణాల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అవి చరిత్రలోని ప్రముఖ వ్యక్తులు ధరించినవి అయితే అది ఇంకా పెరుగుతుంది. పనితనం వల్ల కూడా ఆ ఆభరణాలు మరింత గుర్తింపును పొందుతాయి.
చరిత్రలో అత్యంత గుర్తింపు పొందిన అటువంటి 5 వజ్రాలు, ఆభరణాలను చూద్దాం.
కోహినూర్
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కట్ డైమండ్. 105.6 క్యారట్ల కోహినూర్, బ్రిటిషన్ రాజవంశపు ఆభరణాల్లో అత్యంత వివాదాస్పదమైనది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నది తీరంలో గల కోల్లూరు గనుల్లో కోహినూర్ దొరికిందని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో అది గోల్కొండ పాలకుల అధీనంలో ఉండేది. సుమారు 1628లో ఆ వజ్రం దొరికిందని చెబుతారు.
చరిత్రకారుల ప్రకారం, 1645-60 ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు గోల్కొండ నవాబులు కోహినూర్‌ను ఆయనకు ఇచ్చారు. 1739లో పర్షియా పాలకుడు నదీర్ షా దిల్లీ మీద దండయాత్ర చేసి భారీ సంపదను దోచుకుని పోయాడు. నాడు కోహినూర్ కూడా అందులో ఉంది.
మళ్లీ 1813లో సిక్కు రాజు రంజిత్ సింగ్ చేతికి కోహినూర్ వచ్చింది. ఆ తరువాత 1849లో పంజాబ్ పాలకుడైన 10ఏళ్ల బాలున్ని దించేసి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అలా కోహినూర్ వారి వద్దకు చేరింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ వజ్రాని నాటి బ్రిటన్ రాణి విక్టోరియాకు బహూకరించారు.
1851లో జరిగిన ది గ్రేట్ ఎగ్జిబిషన్‌లో కోహినూర్‌ను ప్రదర్శించారు. ఆ తరువాత కొన్ని దుష్టశక్తులు ఉన్నాయనే కారణంతో దాన్ని కోసి మార్పులు చేశారు. క్వీన్ ఎలిజబెత్-2 తల్లి కిరీటంలో ప్రస్తుతం కోహినూర్ ఉంది.
ఆ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ డిమాండ్ చేస్తున్నాయి.
ద అటల్లా క్రాస్
అమెరికా సెలబ్రిటి కిమ్ కర్దాషియన్ ఇటీవల 'ద అటల్లా క్రాస్'ను సుమారు రూ.1.63 కోట్లకు ఇటీవల సొంతం చేసుకున్నారు. 5.2 క్యారట్ల వజ్రాలు పొదిగిన దాన్ని 1920లో లండన్ జువెలరీ గార్రర్డ్ తయారు చేసింది.
ఆ ఆభరణాన్ని నాటి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా కొన్ని సందర్భాల్లో ధరించారు. 1980లలో డయానా ఫ్యాషన్ స్టైల్‌కు అది ప్రతీకగా ఉండేది. తన జీవితంలో ప్రత్యేక సందర్భాల కోసం డయానా ఆభరణాలను ఎంచుకునే తీరుకు ఈ పెండెంట్ ప్రతీకగా ఉందని సోత్‌బేస్ లండన్ హెడ్(జువెలరీ) క్రిస్టియన్ స్పొఫర్త్ అన్నారు.
బ్లాక్ ఒర్లోవ్ డైమండ్
ఇది చాలా అరుదైనది.
ఇలాంటి బ్లాక్ క్రిస్టలీన్ డైమండ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. 67.49 క్యారెట్ల బ్లాక్ ఒర్లోవ్ డైమండ్, మిగతా వాటితో పోలిస్తే చాలా అరుదైనది.
19వ శతాబ్దంలో భారత్‌లోని ఒక బ్రహ్మ దేవుని విగ్రహం నుంచి దాన్ని దొంగిలించారు. అప్పట్లో అది 195 క్యారెట్ల వజ్రం. ఆ వజ్రాన్ని దొంగిలించిన వ్యక్తి చనిపోయినట్లుగా చెబుతారు. ఆ తరువాత కూడా ఆ వజ్రాన్ని కొనుగోలు చేసిన వారిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
రష్యా రాజకుమారి నదియా విగిన్ ఒర్లోవ్, ఆమె బంధువుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ తరువాత దాన్ని దక్కించుకున్న అమెరికా డైమండ్ డీలర్ జేడబ్ల్యూ పారిస్ కూడా సూసైడ్ చేసుకున్నారు.
అందువల్ల ఆ వజ్రాన్ని 'శాపగ్రస్తమైనది' అని అంటారు.
ఆ తరువాత 'శాపాన్ని' తొలగించేందుకు ఆ వజ్రాన్ని మూడు ముక్కలుగా కట్ చేశారు.
లా పెరిగ్రీనా పెరల్
పియర్ ఆకారంలో ఉండే ఈ ముత్యం 1576 పనామా తీరంలో దొరికింది.
50.56 క్యారెట్ల ఈ ముత్యాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన ఫిలిప్-2, తన భార్య క్వీన్ మేరీ-1 కోసం తీసుకొని పోయారు. అలా స్పెయిన్ రాజవంశీకుల చేతుల్లో మారుతూ చివరకు నెపోలియన్ సోదరుడు జోసెఫ్ చెంతకు లా పెరిగ్రీనా చేరింది.
1969లో ఎలిజబెత్ టేలర్ కోసం రిచర్డ్ బర్టన్ దాన్ని కొనుగోలు చేశారు. ఆమె కోసం డిజైన్ చేసిన నెక్లెస్‌లో దాన్ని పొదిగారు.
2011లో సుమారు రూ.53 కోట్లకు లా పెరిగ్రీనా ముత్యాన్ని క్రిస్టీస్ న్యూయార్క్ విక్రయించింది. నాడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సహజమైన ముత్యంగా అది నిలిచింది.
హోప్ డైమండ్
45.52 క్యారెట్ల ఈ వజ్రం దాని జాతిలోని పెద్దదని క్రిస్టీస్ లండన్‌కు చెందిన జువెలరీ స్పెషలిస్ట్ అరాబెల్లా తెలిపారు. అతినీలలోహిత కిరణాలు పడినప్పుడు ఆ వజ్రం రక్తపు వర్ణంలో మెరుస్తుందని వెల్లడించారు.
ఆ వజ్రం యజమాని పేరు మీదుగా దాన్ని హోప్ అని పిలుస్తున్నారు.
1996లో ద అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అనే పుస్తకంలో కార్ల్ షుకర్ రాసిన దాని ప్రకారం... భారతదేశంలోని ఒక దేవుని విగ్రహం నుదుట ఉన్న ఆ వజ్రాన్ని, ఒక హిందూ పూజారి దొంగిలించారు. ఆ తరువాత అతను శాపానికి గురయ్యాడు.
ఆ తరువాత 1668లో ఫ్రాన్స్ రాజు లూయిస్-XIV చేతికి అది చేరింది. ఆ తరువాత ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా అది దొంగతనానికి గురైంది. లూయిస్-XIV, ఆయన భార్యకు హోప్ డైమండ్ శాపం తగిలినట్లు చెబుతారు.
ఆ తరువాత అది 1912లో అమెరికా గనుల వ్యాపారి కూతురు ఎవలిన్ వాల్ష్ మెక్‌లీన్ దాన్ని కొనుగోలు చేశారు. ఆ తరువాత ఆమె పిల్లల్లో ఇద్దరు చనిపోయినట్లు అరాబెల్లా తెలిపారు.
చివరకు 1958లో దాని యజమాని 'హోప్ డైమండ్'ను స్మిత్సోనియన్‌కు దానం చేశారు.
0 Comments:
Post a Comment