అమెరికాలోని ఒహాయో నగరానికి సమీపంలోని ఈస్ట్ పాలస్తీన్‌లో నివసించే జాన్, లిసా హామ్నర్‌లకు ఫిబ్రవరి 3 రాత్రి 8.55 నిమిషాలతో జీవితం ఆగిపోయినట్లయింది.
విషపూరిత రసాయనాలు మోసుకెళ్తున్న గూడ్స్ ట్రైన్ ఈస్ట్ పాలస్తీన్‌లో వారి గార్బేజ్ ట్రక్ బిజినెస్ ప్రాంతానికి అత్యంత సమీపంలో పట్టాలు తప్పింది.
ఒహాయోకు అత్యంత సమీపంలో ఉండే ఈస్ట్ పాలస్తీన్‌లో జాన్, లిసాలు వ్యర్థాలు సేకరించే వ్యాపారం చేస్తున్నారు. 18 ఏళ్ల కిందట అయిదుగురు కస్టమర్లకు సేవలందించడంతో వారు వ్యాపారం ప్రారంభించగా ఇప్పుడు వారికి 7 వేల మంది కస్టమర్లు ఉన్నారు.
తన గార్బేజ్ వాహానాలు నిలిపే పార్కింగ్ లాట్‌లో నిల్చున్న జాన్.. 'ఈ రైలు ప్రమాదం మా జీవితాలను సర్వనాశనం చేసింది' అంటూ విలపించారు. పట్టాలు తప్పిన రైలు నుంచి బయటకు లీకైన రసాయనాలు, సల్ఫర్ అక్కడ గుప్పుమంటూ దుర్వాసన వెదజల్లుతున్నాయి.
BBCజాన్ గార్బేజ్ ట్రక్‌లు
'ఇక్కడ ఉండలేం'
'ఇక్కడ నుంచి మేం వెళ్లిపోవాలనుకుంటున్నాం. ఇకపై ఇక్కడ వ్యాపారం చేయలేం. మా మకాం మార్చేస్తాం' అన్నారు జాన్. జాన్ హామ్నర్ కళ్లు ఎర్రగా ఉన్నాయి. వాపుతో ఉబ్బిపోయాయి. పట్టాలు తప్పిన రైలు నుంచి లీకైన రసాయనాల ప్రభావం వల్లే తన కళ్లు ఇలా మారాయని, మంటగా ఉన్నాయని ఆయన చెప్పారు.
జాన్, ఆయన భార్య లీసాలకు ఈ ప్రమాదం వల్ల బయటకు కనిపించే గాయాలకంటే మానసికంగా మరింత పెద్ద గాయాలయ్యాయి. 'నాకు విపరీతంగా నిద్ర వస్తోంది. నేను ఇప్పటికే రెండుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆందోళన తగ్గించుకునేందుకు మాత్రలు వేసుకుంటున్నాను' అన్నారు జాన్.
'ఇది జీవనోపాధిని కోల్పోవడాన్ని మించిన నష్టం. మేం ఈ వ్యాపారాన్ని ఏళ్లుగా నిర్మించుకుంటూ వచ్చాం' అన్నారాయన.
జాన్ హామ్నర్‌లాగే ఆయన భార్య లిసా కూడా తమ వ్యాపారం గురించి, తమ దగ్గర పనిచేస్తున్న 10మంది ఉద్యోగుల గురించి, తాము 20 ఏళ్లు గడిపిన ఈస్ట్ పాలస్తీన్ పట్టణం గురించి నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పారు.
ఇప్పటికే వారి కస్టమర్లలో అనేక మంది ఈస్ట్ పాలస్తీన్‌ను విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ఇప్పటికే కొందరు జాన్, లిసాల నుంచి చెత్త సేకరణ సేవలను రద్దు చేసుకున్నారు.
'ఇక్కడ జీవిస్తున్న ప్రజల గురించి ఆందోళన చెందుతున్నాను. ఎవరికీ నిద్ర పడుతుందని నేను అనుకోను. సొంత వ్యాపారాలు, మన ఆరోగ్యం, స్నేహితుల ఆరోగ్యం వంటి అనేక అంశాలలో ఆందోళన ఉంది' అన్నారు లిసా.
పట్టాలు తప్పి, కాలిపోయిన గూడ్స్ రైలు బోగీల మధ్య మురికి గుట్టపై నిల్చున్న జాన్ ఈ ప్రమాదాన్ని చెర్నోబిల్ ఘటనతో పోల్చారు.
1986 నాటి సోవియట్ యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌లో అణు ప్రమాదం జరిగింది.
'అడుగు బయటకు పెట్టాలంటే భయం'
జాన్, లిసాలు మాత్రమే కాదు ఈస్ట్ పాలస్తీన్‌లోని నివసించే అనేక మంది ఈ ప్రమాద ప్రభావం తమపై తీవ్రంగా ఉందని బీబీసీతో చెప్పారు.
''ఈస్ట్ పాలస్తీన్‌కు ఇది 9/11 లాంటిది, పెరల్ హార్బర్ లాంటిది. ఇక్కడి ప్రజలు తమ జీవితాంతం దీని గురించి మాట్లాడుకుంటారు'' అని అక్కడి కాఫీ షాప్ యజమాని బెన్ రాట్నర్ చెప్పారు.
ఈస్ట్ పాలస్తీన్ ప్రజలు ఇప్పుడు మరింత భయపడుతున్నారని, ఇకపై నిత్యం అప్రమత్తంగా ఉంటారని బెన్ చెప్పారు. ''ఎమోషనల్‌గా, మానసికంగా దీని దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్నది చూడాలి'' అన్నారు బెన్.
పిల్లలను బయటకు పంపించాలన్నా, పెంపుడు కుక్కలతో వాకింగ్‌కు వెళ్లాలన్నా భయమేనని..పెంపుడు జంతువులు ప్రమాదవశాత్తు రసాయనాలతో కలుషితమైన నీటిని తాగినా ఇబ్బందేనని బెన్ చెప్పారు.
కోవిడ్-19 తరువాత ఇక్కడి పిల్లలు ఇప్పుడిప్పుడే వారి జీవితాలను మెరుగుపర్చుకుంటున్న సమయంలో మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని బెన్ అన్నారు.
''ఇది కొన్ని తరాలపాటు కొనసాగొచ్చు. విషవాయువులు, రసాయనాలకు మించిన సమస్య. అనేక సామాజిక, కుటుంబ అంశాలతో ముడిపడి ఉంది'' అన్నారు బెన్.
ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) నిర్వాహకుడు మైఖేల్ రీగన్ గురువారం ఈస్ట్ పాలస్తీన్‌లో పర్యటించారు. అక్కడి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి ఆయన వెళ్లారు.
''మేం మిమ్మల్ని చూస్తున్నాం. మీరు చెప్పేది వింటున్నాం. మీరు ఎందుకు ఆందోళనగా ఉన్నారో మేం అర్థం చేసుకున్నాం'' అని ప్రజలనుద్దేశించి రీగన్ అన్నారు.
Reuters
'అందరూ సురక్షితంగా ఉన్నారని ఎలా చెప్తారు?'
మరోవైపు ఒహాయో గవర్నర్ మైక్ డివైన్ ఫెడరల్ ప్రభుత్వం నుంచి సహాయం కోరారు. ఒహాయో సెనేటర్లు జేడీ వాన్స్, షెరాడ్ బ్రౌన్‌లు అండగా ఉంటామంటూ ప్రజలకు సందేశాలు పంపించారు. పట్టాలు తప్పిన ఈ రైలును నిర్వహించిన సంస్థ నార్‌ఫోక్ సదరన్ సీఈవో అలాన్ షా ఈ ఘటనపై ఓ లేఖ విడుదల చేశారు.
ప్రజలు ఆందోళన చెందుతున్నారని, సమాధానాలు దొరకని ప్రశ్నలతో వారు వేదన చెందుతున్నారని అంగీకరించారు. కాగా రైలు పట్టాలు తప్పిన 15 రోజులు తరువాత కూడా అధికారులు కానీ, తనికీ బృందాలు కానీ తమ వద్దకు రాలేదని కొందరు స్థానికులు చెప్పారు.
'ఇక్కడ ఎవరూ ఏమీ తనిఖీ చేయలేదు. మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు' అని కిమ్ హాన్‌కాక్ చెప్పారు.
రైలు పట్టాలు తప్పిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో కిమ్ నివాసం ఉంటారు.
''అందరూ సురక్షితంగా ఉన్నారని వారు ఎలా చెప్పగలరు? రైలు ప్రమాదం తరువాత మా ఇంటిపై నుంచి పెద్ద పొగ మేఘం వెళ్లింది. నేను గొంతు విప్పుతాను'' అన్నారామె.
0 Comments:
Post a Comment