టీచర్లపై వేధింపులను ఆపాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్ మౌనం తగదు
ప్రవీణ్‌ప్రకాష్, ప్రతాపరెడ్డి, కల్పలతారెడ్డిలను నియంత్రించాలి
రాజధానిపై ప్రకటనలు బాధ్యతా రాహిత్యం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, ఎన్‌సిఈఆర్‌టి డైరక్టర్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిల జోక్యాన్ని నియంత్రించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
బుధవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారిలో మానసిక వికాసాన్ని పెంపొందించాల్సిన ఉపాధ్యాయులను ఆ పని చేయనీయకుండా ఫేషియల్ వంటి యాప్స్‌తో నాడు-నేడు పనులంటూ, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.
ఎంఇఓలు, డిఇఓలు చేయాల్సిన పాఠశాల తనిఖీలను ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్‌ప్రకాష్ చేస్తూ ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న ఈ వేదింపులను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రపంచబ్యాంకును సంతృప్తి పరిచేందుకు విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోందని అన్నారు.
విద్యారంగాన్ని కార్పోరేట్‌లకు కట్టబెట్టేందుకే పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను పిల్లల ఎదురుగా దుర్బాషలు,
అవమానించడం, సస్పెండ్ చేయడం లాంటి చర్యలకు పూనుకుంటోందని అన్నారు.
నూతన విద్యావిధానం పేరుతో ఒకటి, రెండు తరగతి పిల్లలకు ఏడెనిమిది పేజీలతో పరీక్షలు రాయించడం ఏమిటని ప్రశ్నించారు.
5వ తరగతి విద్యార్థులకు ఇప్పటిదాకా పుస్తకాలను అందించని పరిస్థితి వుంది.
ఇంగ్లీష్‌లో పాఠాలు చెబుతూ... తెలుగులో ప్రశ్నాపత్రాలు ఇస్తున్నారు.
మధ్యాహ్న భోజనంకు 40 రకాల రికార్డులను రాయిస్తూ, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలనే నిబంధన పెట్టారని అన్నారు.
విద్యార్థులకిచ్చిన బైజూస్ యాప్‌లను కూడా తనిఖీచేసే పని కూడా టీచర్లకే అప్పగించారు.
బైజూస్‌ను తెచ్చి పెట్టడంలోనే కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడానికనేది అర్థమౌతోంది.
పుస్తకాల్లో వున్న సిలబస్‌కు బైజూస్‌లోని పాఠాలకు ఒకదానికొకటి సంబంధం లేదు. టీచర్ల పనంతా రాసుకోవడం, అప్‌లోడ్ చేసుకోవడంతోనే సరిపోతోంది.
అప్‌లోడ్ చేయడం ఆలస్యమైతే మెమోలను అందుకోవాల్సి వస్తోంది.
తక్షణమే ప్రభుత్వం టీచర్లపై వేధింపులను ఆపకపోతే ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
టీచర్లు స్వేచ్ఛగా పాఠాలు చెప్పడానికి, విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పటానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే పిల్లల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి కూడా ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీనివాసరావు హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారపార్టీ ప్రలోభాలతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల కమిషన్ స్పందించకుండా నిద్రపోతోందని వి శ్రీనివాసరావు విమర్శించారు.
ఐదో తరగతి చదివిన వారికి, టీచర్‌కాని వారికి ఓటును ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఎస్‌సిఈఆర్‌టి డైరక్టర్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ప్రవీణ్ ప్రకాష్‌లు తనిఖీల పేరుతో అధికారపార్టీ అభ్యర్థులకు చేస్తున్న ప్రచారాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
అలాగే నకిలీ ఓట్లను పెద్దఎత్తున చేర్పించారని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.
గిఫ్ట్ పంపిణీకి అడ్డుకట్ట వేసి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కోవిడ్ సమయంలో ప్రైవేట్‌పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఏ మొఖం పెట్టుకొని వారి ఓట్లను అడుగుతుందో చెప్పాలన్నారు.
0 Comments:
Post a Comment