Bank Locker | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం..
వినియోగదారుడు బ్యాంకు లాకర్‌లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్‌మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Bank Locker | నగలు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచుకుంటే దొంగలు ఎత్తుకుపోతారేమోనని భయపడిపోతుంటారు. అందుకే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు.
అలా ఇప్పటికే చాలామంది లాకర్లు తీసుకుని బ్యాంకుల్లో నగలు, ఆస్తిపత్రాలు, విలువైన వస్తువులను దాచిపెట్టుకున్నారు. అయితే కొద్దిరోజులుగా లాకర్ వినియోగిస్తున్న వాళ్లందరికీ సదరు బ్యాంకుల నుంచి ఓ మెసేజ్ వస్తుంది.
లాకర్‌కు సంబంధించి బ్యాంకుతో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని.. లేదంటే లాకర్‌ను ఫ్రీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ సందేశాలను పంపిస్తున్నాయి. దీంతో లాకర్ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కానీ ఇది భయపడాల్సిన పెద్ద విషయమేమీ కాదని బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు.
ఆర్బీఐ నిబంధనలు మారడం వల్లే కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని వివరణ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త ఒప్పందం ఏంటి? దీనివల్ల లాభాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయా? ఒకసారి తెలుసుకుందాం..
కొత్త నిబంధనలో ఏముంది?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకర్‌లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్‌మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
బ్యాంక్ నిర్లక్ష్యం కారణంగా లాకర్‌లో ఉన్న వస్తువులు పోతే.. లాకర్ అద్దెకు 100 రెట్లు వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే బ్యాంకులో అగ్నిప్రమాదం, దొంగతనాలు జరిగినా.. బ్యాంకు బిల్డింగ్ కూలిపోయి లాకర్‌లో ఉన్న వస్తువులు ధ్వంసమైనా సరే మేనేజ్‌మెంట్‌దే బాధ్యత ఉంటుంది.
ఈ నిబంధనలను ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ నిబంధనలు వర్తించాలంటే.. ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు.. బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా జనవరి 1వ తేదీ లోపు ఈ బాండ్ పేపర్‌ను బ్యాంకులో అందించాలని.. లేదంటే లాకర్‌ను సీజ్ చేస్తామని ఆదేశించాయి.
అన్నట్లుగానే కొన్ని బ్యాంకులు సీజ్ చేశాయి. అయితే దీనిపై ఇంకా చాలామంది వినియోగదారులకు అవగాహన లేకపోవడంతో కొత్త అగ్రిమెంట్ చేసుకోలేదు.
ఈ క్రమంలో ఈ గడువును తాజాగా ఆర్బీఐ డిసెంబర్ 31వరకు పొడిగించింది. కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా అగ్రిమెంట్ సబ్‌మిట్ చేయాలని సూచించింది.
లాకర్ ఒప్పందం ఏంటి?
బ్యాంక్ వినియోగదారుడికి, బ్యాంకుకు మధ్య ఈ లాకర్ ఒప్పందం ఉంటుంది. దీని ప్రకారం అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్‌లో దాచిపెట్టనని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్‌ను వినియోగిస్తానని ఒప్పుకుంటూ ఆ ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి.
ఆ అగ్రిమెంట్‌ను బ్యాంకులో అందజేయాలి. అప్పుడే బ్యాంకులో లాకర్ తీసుకోవడం సాధ్యమవుతుంది. లాకర్ ఓపెన్ అయిన తర్వాత ఈ అగ్రిమెంట్‌కు సంబంధించిన కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంకుల నుంచి పరిహారం ఎప్పుడు అందుతుంది?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారుల లాకర్‌ను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. కాబట్టి బ్యాంకులో సెక్యూరిటీ లోపాలు లేకుండా చూసుకోవడం, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు జరగకుండా చూసుకోవడం, భవనాలు కూలిపోకుండా బ్యాంకులే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా వీటిలో ఏదైనా జరిగి లాకర్ ధ్వంసమైతే దానికి బ్యాంకులపై బాధ్యత వహించాలి. ఖాతాదారుడికి నష్టపరిహారం చెల్లించాలి. అది కూడా ఆ లాకర్‌కు అయ్యే వార్షిక అద్దెకు 100 రెట్లు ఖాతాదారుడికి పరిహారం రూపంగా అందజేయాలి.
ఒకవేళ భూకంపాలు, వరదలు, సునామీ వంటి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం జరిగితే మాత్రం బ్యాంకులు బాధ్యత వహించక్కర్లేదని ఆర్బీఐ పేర్కొంది.
డబ్బులు దాచిపెట్టడం నిషేధం
బ్యాంక్ లాకర్లలో నగదు దాచిపెట్టడంపై ఆర్బీఐ నిషేధం విధించింది. లాకర్లలో పెద్ద నోట్ల నిల్వలను అరికట్టడం కోసం ఆర్బీఐ ఈ నిబంధనను తీసుకొచ్చింది.
దీంతో పాటు బ్యాంకులో ఎలాంటి వస్తువులు దాయాలి? ఎలాంటి వస్తువులు దాయకూడదనే దానిపై ఈ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.
నగలు, బంగారం వంటి విలువైన వస్తువులు, పత్రాలను మాత్రమే లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించింది.
వీటిని అస్సలు లాకర్లలో ఉంచవద్దు
– కరెన్సీ నోట్లు
– ఆయుధాలు, పేలుడు సామగ్రి
– మాదక ద్రవ్యాలు
– రేడియేషన్ పరికరాలు
– చట్ట విరుద్ధమైన వస్తువులు
0 Comments:
Post a Comment