అయితే ఇవి బడ్డెట్ లో చూపిస్తున్నఅప్పులు మాత్రమే. ఇవి కాకుండా కార్పోరేషన్ల రుణాలు, ఇతరత్రా తీసుకుంటున్న అప్పులు వీటికి అదనం.
అప్పుల కుప్పగా రాష్ట్రం
ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం ఇవాళ పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు.
2019తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయని ఇందులో పేర్కొన్నారు. అలాగే ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందన్నారు. తాజా వివరాల్ని రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి వెల్లడించారు.
రూ.4.42 లక్షల కోట్లకు అప్పు
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తున్న బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,42,442 కోట్లు అని కేంద్రమంత్రి పంకజ్ చౌదురి తెలిపారు. ఇది బడ్జెట్ లో పేర్కొన్న అప్పు మాత్రమే.
2019లో అప్పు రూ.2,64, 451 కోట్లు ఉండగా.. 2020 లో రూ.3,07, 671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 లో రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ లెక్కన చూస్తే 2019లో ఉన్న 2.64 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం రూ.4.42 లక్షల కోట్లకు చేరినట్లయింది.
బడ్జెటేతర అప్పులు అదనం
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో వెల్లడించిన బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు దీనికి అదనమని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఇవాళ వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి సమాధానం క్లారిటీ ఇచ్చింది.
ముఖ్యంగా బడ్జెట్ అప్పుల కంటే బడ్జెటేతర అప్పులు పెరిగిపోతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి.
జనవరి నుంచి మార్చికి గాను రూ.12 వేల కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐకి అప్పుల కేలండర్ పంపింది.
జనవరిలో రూ.7 వేల కోట్లను, ఫిబ్రవరిలో రూ.4,000 కోట్లను, మార్చిలో రూ.1,000 కోట్లను తీసుకుంటామని పేర్కొంది.
0 Comments:
Post a Comment