ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గానిస్థాన్(Afghanistan)ను పాలిస్తున్న తాలిబన్ల (Taliban) మధ్య విభేదాలు తలెత్తాయి.
ముఖ్యంగా హక్కానీ గ్రూప్ సీనియర్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ, సుప్రీం లీడర్ హైదాతుల్లా అఖుంద్‌జాద మధ్య విభేదాలు ఇటీవల బహిర్గతమయ్యాయి.
అఖుంద్‌జాద ఏకఛత్రాధిపత్యంగా అధికారాలను అనుభవిస్తున్నాడని సిరాజుద్దీనే బహిరంగంగానే విమర్శించారు. శనివారం ఖోస్ట్ ప్రాంతంలో జరిగిన మతపెద్దల సమావేశంలో అఖుంద్‌జాద పేరు ప్రస్తావించకుండా సిరాజుద్దీన్ మాట్లాడుతూ ''అధికార కేంద్రీకరణ పాలన వ్యవస్థ పరువు తీస్తోంది.
దీనిని చూస్తూ సహించే పరిస్థితి దాటేశాం. ఇక ఏ మాత్రం సహించం. పాలన వ్యవస్థకు ప్రజలకు మధ్య చీలికలు తెచ్చే విధానాలు అవలంభించడం మానుకోవాలి. లేకపోతే ఇది ఇస్లాంను నిందించడానికి ఇతరులకు అవకాశం ఇస్తుంది'' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల తాలిబన్(Taliban) ప్రతినిధి జుబైహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ హక్కానీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ''మన ఇస్లాం పద్ధతుల ప్రకారం.. బహిరంగంగా ఎమిర్(అఖుంద్‌జాద) లేదా మంత్రి, ప్రభుత్వ అధికారులను విమర్శించకూడదు.
మీరు నేరుగా ఆయన్ను సంప్రదించి వ్యక్తిగతంగా మీ విమర్శలను తెలియజేయండి. అప్పుడు అవి ఎవరూ వినరు'' అని పేర్కొన్నాడు. ఇక అఫ్గాన్(Afghanistan) న్యాయశాఖ మంత్రి అబ్దుల్ ఘనీ ఫయిక్ మాట్లాడుతూ ''అతడు ఇస్లామిక్ ఎమిరేట్‌లో మంత్రి పదవిలో ఉండి.. అదే ఎమిరేట్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడా. ఇది ఏమాత్రం సహించరానిది'' అని మీడియా ఎదుట హెచ్చరికలు జారీ చేశాడు.
మహిళల హక్కులపై విభేదాలు..
సిరాజుద్దీన్ హక్కానీ వ్యాఖ్యలు సుప్రీం లీడర్ హైదాతుల్లా అఖుంద్‌జాదను వేలెత్తి చూపుతున్నట్లు ఉన్నాయి. ఇటీవల అఖుంద్‌జాద కాందహార్ వేదికగా పాలన సాగిస్తున్నారు. అఫ్గాన్(Afghanistan) మహిళలు చాలా చోట్ల పనిచేయడాన్ని నిషేధించారు.
దీంతోపాటు వారిని విద్యకు కూడా దూరం చేశారు. ఈ నిర్ణయాలను అఖుంద్‌జాద సమర్థించుకొన్నారు. అంతేకాదు మహిళలు ఒంటరిగా 70 కిలోమీటర్లకు మించి ప్రయాణించడంపై నిషేధం ఉంది.
కానీ, ఈ నిర్ణయాలను తాలిబన్ల(Taliban)తో సన్నిహితంగా ఉంటున్న దేశాలు కూడా వ్యతిరేకించాయి. హక్కానీ వర్గం మాత్రం బాలిక విద్యపై నిషేధం ఎత్తివేయాలని కోరుతోంది. ''ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలు పాత గాయాల నుంచి కోలుకొనేట్లు చేయాలి'' అని హక్కానీ ఇటీవల వ్యాఖ్యానించారు.
మరో వైపు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ కూడా మహిళలకు హక్కుల పట్ల సానుకూలంగా ఉన్నారు. వారికి హక్కులు ఉన్నప్పుడే అంతర్జాతీయంగా అఫ్గాన్(Afghanistan) ఏకాకిగా మారకుండా ఉంటుందని అతడు భావిస్తున్నట్లు కొందరు విదేశీ దౌత్యవేత్తలు చెబుతున్నారు.
మెజార్టీల మాట వినని అతివాద నాయకులు తాలిబన్(Taliban) పాలనకు తలనొప్పిగా మారారని నిపుణులు చెబుతున్నారు. తాలిబన్ల(Taliban)లో ఛాందసవాదులు అత్యధికంగా అధికారాలను దక్కించుకొన్నారు. వారు సంఖ్యలో మైనార్టీలు.
మరో వైపు అధిక సంఖ్యలోని మితవాదులకు తక్కువ అధికారాలు దక్కాయి. దీంతో అతివాదుల నిర్ణయాలు ప్రభుత్వంపై బలవంతంగా రుద్దుతున్నారనే భావన మిగిలిన వారిలో ప్రబలిందని కాబుల్ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ హమ్జా మొమిన్ హకీమ్ పేర్కొన్నారు. సిరాజుద్దీన్ హక్కానీ వంటి వారి వ్యాఖ్యలు దీనికి అద్దంపడుతున్నాయన్నారు.
తాలిబన్ల మధ్య బలమైన విభేదాలు ఉన్నాయని ఈ ఘటన తెలియజేస్తోందని అఫ్గాన్(Afghanistan) రాజకీయ విశ్లేషకుడు మోహిబుల్లా షరీఫ్ పేర్కొన్నారు.
అంతర్యుద్ధానికి దారితీయొచ్చు..
తాలిబన్ల(Taliban) మధ్య విభేదాలు ముదిరితే అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తాలిబన్(Taliban) నాయకులకు ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి. ఇక సిరాజుద్దీన్ చేతిలో కూడా అత్యంత బలమైన హక్కానీ నెట్‌వర్క్ ఉంది.
మరోవైపు ముల్లా యాకూబ్ వద్ద ముల్లా ఒమర్ సేనలు ఉన్నాయి. అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాల్లో చాలా వరకు వీరి ఆధీనంలో ఉన్నాయి. ఇక సుప్రీం లీడర్ అఖుంద్‌జాద చేతిలో మాత్రం కాందహార్‌లోని స్థానిక మిలిటెంట్లు ఉన్నారు. దీంతోపాటు అతివాద దళాలు కూడా ఆయన మాటే వింటాయి.
గతంలోనూ తన్నుకొన్న తాలిబన్లు(Taliban)..
2021లో అధికారం దక్కించుకొన్న సమయంలో మంత్రి వర్గం ఏర్పాటు, అఫ్గాన్(Afghanistan)లో తాలిబన్ల (Taliban)విజయంపై 'క్రెడిట్' ఎవరికి దక్కాలనే విషయంపై హక్కానీ నెట్‌వర్క్‌లోని శక్తిమంతమైన నాయకుడు ఖలీల్ ఉర్ రహ్మన్ హక్కానీ, శాంతి చర్చల నాయకుడు ముల్లా బరాదర్ మధ్య వివాదం జరిగింది.
తమ దౌత్యం వల్లే అమెరికన్లు వెళ్లిపోయారని బరాదర్ భావిస్తుండగా.. తాము యుద్ధం చేయడంతోనే అమెరికన్లు పలాయనం చిత్తగించారని హక్కానీ అనుచరులు వాదించారు. ఈ క్రమంలోనే ఇరువురు నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
అదే సమయంలో పక్కన ఉన్న ఇరువర్గాల సభ్యులు తన్నుకొన్నారు. దీంతో మంత్రివర్గం కూర్పుపై అలిగిన బరాదర్ అప్పట్లో కాందహార్ వెళ్లి సుప్రీం లీడర్ ముల్లా హబైతుల్లా అఖుంద్‌జాదాతో భేటీ అయ్యారు. హక్కానీ గ్రూప్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీకి ఖలీల్ సోదరుడి వరుస అవుతాడు.
తాలిబన్లలోని సిరాజుద్దీన్ హక్కానీ వర్గం, ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్‌లను పాకిస్థాన్ చేరదీసింది. వీరిద్దరూ పాక్‌కు మద్దతుదారులు. పాక్ సైన్యం, ఐఎస్‌ఐ వీరికి కీలక సహకారం అందించింది.
తాజాగా తాలిబన్లు పాక్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సిరాజుద్దీన్ ఏకంగా సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం చర్చనీయాంశమైంది.
0 Comments:
Post a Comment