అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి.
అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను కిందటి నెల 31వ తేదీన చేపట్టాల్సి ఉన్నప్పటికీ- అది సాధ్యపడలేదు. తాజాగా మరో తేదీని నిర్ధారించింది సుప్రీంకోర్టు.
లిస్టింగ్ లో లేని పిటీషన్లు..
అమరావతి ప్రాంతం నుంచి సచివాలయం తరలింపు, మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ వికేంద్రీకరణపై ఇదివరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన విచారణను చేపట్టింది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు.
స్టే ఎత్తివేస్తూ..
ఈ అప్పీల్ పిటీషన్ పై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని అభిప్రాయపడింది. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఉందని స్పష్టం చేసింది.
తదుపరి విచారణ..
తదుపరి విచారణను జనవరి 31వ తేదీ నాటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు అప్పట్లో. షెడ్యూల్ ప్రకారం- ఈ పిటీషన్లు నిర్దేశిత సమయానికి విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ- అలా జరగలేదు. లిస్టింగ్ కాలేదు. పీఎం కేర్స్, ఎలక్టోరల్ బాండ్స్.. వంటి కీలకమైన పిటీషన్లు ఆ రోజున లిస్టింగ్ అయ్యాయి. ఫలితంగా మూడు రాజధానుల వ్యవహారాన్ని లిస్టింగ్ చేయలేదు. దీనితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ ను కూడా విచారణకు స్వీకరించినందున మూడు రాజధానుల అంశాన్ని వాయిదా వేసింది.
తాజాగా మరో తేదీ..
దీనితో తాజాగా మరో కొత్త తేదీని నిర్ధారించింది సుప్రీంకోర్టు. ఈ నెల 7వ తేదీన మూడు రాజధానులపై పిటీషన్లపై విచారణ చేపట్టనుంది. మస్తాన్ వలీ దాఖలు చేసిన పిటీషన్ ను కూడా కలిపి విచారణకు స్వీకరించనుంది. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ మస్తాన్ వలీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధాని నగరాన్ని నిర్దారించడానికి అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ఒకేచోట రాజధాని నగరం సరైంది కాదంటూ కమిటీ సిఫారసు చేసింది.
0 Comments:
Post a Comment