అద్భుతమైన పోస్టాఫీస్ పథకం.. కేవలం రూ. 5000 పొదుపుతో రూ. 16 లక్షల రాబడి..!
పొదుపు చేయాలన్న ఆలోచన ఉండాలే కానీ, ఎన్నో ప్రభుత్వ పథకాలు, పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడని వారికి ఈ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మంచి ప్రత్యామ్నాయం.
మీరు దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)’ పథకం అన్నిటికన్నా ఉత్తమమైనది. ఓ పదిహేనేళ్ల పాటు పెట్టుబడిగా పెడుతూ పోతే.. మెచ్యూరిటీ అనంతరం భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు. ఉదాహరణకు నెలకు రూ. 5000 పొదుపుతో 15 ఏళ్ల తర్వాత రూ. 16 లక్షల రాబడిగా పొందవచ్చు. అలాగే.. డబ్బు అవసరమైన సందర్భాల్లో రుణ సదుపాయం, నగదు ఉపసంహరణ, మెచ్యూరిటీ గడువు కంటే ముందే ఖాతాను క్లోజ్ చేసే అవకాశం వంటి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
పీపీఎఫ్ పథకం గురుంచి ఒక్కమాటలో చెప్పాలంటే.. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడానికి సురక్షితమైన, అత్యంత అనుకూలమైన మార్గాలలో ఒకటి. ఇందులో చేరితే రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందొచ్చు. అంతేకాకుండా.. రాబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. వయోజన భారతీయులు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్ల లోపు చిన్న పిల్లకు కూడా ఈ ఖాతా తెరవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ గడువు.. 15 సంవత్సరాలు. అంటే మీరు ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ ఉంటుంది. ఈ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించాలనుకుంటే.. మరో ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.
ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయాలి. మీవద్ద అంతమొత్తంలో నిధులు లేకపోతే కనీసం రూ.100 మొత్తంతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. అనంతరం.. మీ ఆదాయం పెరిగాక, అందుకు అనుగుణంగా కాంట్రిబ్యూషన్ పెంచుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వార్షిక వడ్డీ అందుతోంది. ఈ వడ్డీని ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. అయితే.. ఏదేని ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 జమ చేయని పక్షంలో పీపీఎఫ్ ఖాతా నిలిచిపోతుంది. నిలిచిపోయిన ఖాతాపై లోన్ గానీ, నగదు ఉపసంహరణ వెసులుబాటుగానీ ఉండదు. నిలిచిపోయిన ఖాతాను మెచ్యూరిటీ కాలవ్యవధికి ముందు మరోసారి పునరుద్ధరించుకోవచ్చు. అందుకు నిలిచిపోయిన కాలానికి ప్రతి ఏడాదికి కనీసం రూ. 500 చొప్పున జమచేయాల్సి ఉంటుంది.
రూ. 16 లక్షలు రాబడిగా పొందాలంటే..
ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ. 5,000 పెట్టుబడిగా పెట్టాడనుకోండి.. ఈ మొత్తం ఏడాదికి 60 వేల చొప్పున 15 సంవత్సరాలకు రూ. 9 లక్షలు అవుతుంది. ఈ మొత్తానికి కాంపౌండ్ ఇంటరెస్ట్ ప్రాతిపదికన మెచ్యూరిటీ అనంతరం రూ. 16.25 లక్షలు చేతికొస్తాయి. అంటే.. రూ. 7.25లక్షలు అదనంగా చేతికొస్తుంది.
పీపీఎఫ్ ఖాతా ఇతర ప్రయోజనాలు
రుణ సదుపాయం
పీపీఎఫ్ ఖాతా తెరిచిన ఆర్థిక సంవత్సరం ముగిసి ఏడాది గడిచాక లోన్ తీసుకోవచ్చు. అంటే 2022-23లో ఖాతా తెరిస్తే 2024-25లో లోన్ తీసుకోవచ్చన్నమాట. ఒక ఏడాదిలో ఒక లోన్ మాత్రమే తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. మొదట తీసుకున్న లోన్ తీర్చేంతవరకు మరో లోన్ ఇవ్వరు. పెట్టుబడిగా పెట్టిన మొత్తంపై 25 శాతం మాత్రమే లోన్ రూపంలో ఇస్తారు. 36 నెలలలోపు లోన్ కడితే.. వడ్డీ రేటు కేవలం 1 శాతంగా మాత్రమే ఉంటుంది. అనంతరం 6 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
నగదు ఉపసంహరణ
ఖాతా తెరిచిన సంవత్సరం కాకుండా తదుపరి ఐదేళ్లలో ఒకసారి నగదు ఉపసంహరించుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు 2023-24లో ఖాతా తెరిచారనుకుంటే.. 2029-30లో నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఖాతాలో నిల్వ ఉన్న మొత్తంలో 50 శాతం మాత్రమే ఉపసంహరించుకోవచ్చు.
మెచ్యూరిటీ గడువు కంటే ముందే క్లోజ్ చేసే అవకాశం
ఖాతాదారులకు గానీ, వారిపై ఆధారపడిన కుటుంబసబ్యులకు గానీ తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు లేదా వారి పిల్లలకు ఉన్నత విద్య అవసరాలు ఉన్నప్పుడు ఖాతా క్లోజ్ చేయవచ్చు. అయితే, గడువు కంటే ముందే క్లోజ్ చేసిన పక్షంలో 1 శాతం వడ్డీ కోత విధిస్తారు. అదే ఖాతాదారులు అర్ధాంతరంగా మరణిస్తే ఖాతా రద్దు చేసుకోవచ్చు. లేదా నామినీ పేరుతో కొనసాగించవ్చు.
గమనిక: పీపీఎఫ్ పై వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతు ఉంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది. ఈ వడ్డీని ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన ఖాతాల్లో జమచేస్తారు. పోస్టాఫీస్‌లో గానీ, బ్యాంకులో గానీ పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు.
0 Comments:
Post a Comment